పారిశుద్ధ్య కార్మికుల సమ్మె విరమణ

3 Nov, 2016 23:26 IST|Sakshi
పారిశుద్ధ్య కార్మికుల సమ్మె విరమణ
  •  నేటి నుంచి విధుల్లోకి పారిశుద్ధ్య కార్మికులు
  • 279 జీఓను 110 మున్సిపాలిటీల్లో అమలు చేసిన తరువాతే నెల్లూరు కార్పొరేషన్‌లో అమలు
  • టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, నగర ఇన్‌చార్జ్‌ ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డిల హామీ
  • నెల్లూరు, సిటీ : పారిశుద్ధ్య కార్మికులకు తాత్కాలిక ఊరట లభించింది. 279 జీఓను రద్దు చేయాలని గత వారం రోజులుగా సమ్మె చేస్తుండగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, నగర ఇన్‌చార్జ్‌ ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి రంగంలోకి దిగి కార్మికుల సమ్మె విరమింపచేశారు. నగరంలోని నవాబుపేట బీవీఎస్‌ పాఠశాల సమీపంలో గురువారం జనచైతన్యయాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో పారిశుద్ధ్య కార్మికులు జనచైతన్య యాత్ర వద్దకు భారీగా చేరుకున్నారు. సీఐటీయూ. సీపీఎం నాయకులు టీడీపీ నాయకులతో ఆరగంట పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్‌ మాదాల వెంకటేశ్వర్లు, కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ 279 జీఓ అమలు చేయడం ద్వారా కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదన్నారు. ఇప్పటికే కాంట్రాక్ట్‌ పద్ధతిన 200 మంది కార్మికులను నియమించుకున్నారని, వారికి కేవలం రూ.5 వేలు మాత్రమే జీతం చెల్లిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు బ్యాంక్‌ అకౌంట్లలోకి జీతాలు వస్తున్నాయని, జీఓ అమలు జరిగితే కార్మికులు జీతాల కోసం కాంట్రాక్టర్‌ల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. కార్మికుల సమ్మెను దళితబాట పట్టిస్తున్నారని కొంత మంది టీడీపీ నాయకులు విమర్శించడం దుర్మార్గమని పేర్కొన్నారు. జీఓ అమలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వెళితే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సీపీఎం నాయకులు పెంచలయ్య, అల్లాడి గోపాల్, మస్దాన్‌బీ తదితరులు పాల్గొన్నారు. 
    279 జీఓ 109 మున్సిపాలిటీల్లో అమలు చేసిన తరువాతే నెల్లూరులో..
    రాష్ట్రవ్యాప్తంగా 279 జీఓ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని, అయితే 110 మున్సిపాలిటీల్లో 109 మున్సిపాలిటీల్లో జీఓను అమలు చేసిన తరువాతే నెల్లూరు నగర పాలక సంస్థలో ఈ జీవో అమలు అవుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, నగర ఇన్‌చార్జ్‌ ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి కార్మికులకు హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యలపై చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. 
    మేయర్‌ అజీజ్‌కు బీద చురక.. 
    కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆ సంఘ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని బీద రవిచంద్ర మేయర్‌ అజజ్‌కు చురకలంటించారు. టీడీపీలో ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, అనురాధ, రమేష్‌రెడ్డి కౌన్సిల్‌లో పనిచేసిన వారేనని గుర్తుచేశారు. వాళ్లతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గత వారం రోజులుగా మేయర్‌ వ్యవహరించిన తీరుపై బీదా రవిచంద్ర ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో మేయర్‌ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై బీద రవిచంద్ర పార్టీ వర్గాల ముందు పరోక్షంగా హెచ్చరించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
     
     
మరిన్ని వార్తలు