మా డబ్బులివ్వనిదే కదలం

24 Aug, 2016 22:35 IST|Sakshi
మా డబ్బులివ్వనిదే కదలం
కార్పొరేషన్‌ వద్ద పుష్కర కార్మికుల ఆందోళన
 పత్తాలేని కాంట్రాక్టర్లు
 
విజయవాడ సెంట్రల్‌ :
 రేయింబవళ్లు పుష్కర విధులు నిర్వహించిన కార్మికుల కష్టాన్ని కాంట్రాక్టర్లు దోచుకున్నారు. ఒప్పందం ప్రకారం వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడంతో కడుపుమండిన కార్మికులు పోరుబాట పట్టారు. విజయవాడలోని పొట్టి శ్రీరాములు హైస్కూల్, ఏకేటీపీ స్కూల్, వైఎస్సార్‌ కాలనీల్లో విడతలవారీగా ఆందోళన చేసిన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నగరపాలక సంస్థ వద్ద బైఠాయించారు. ఇద్దరు మహిళా సబ్‌ కాంట్రాక్టర్లను నిర్భంధించారు. చెప్పిన ప్రకారం డబ్బులిస్తే కానీ కదలబోమని ప్రకటించారు. సీవీఆర్, గాంధీజీ మునిసిపల్‌ హైస్కూల్లో భోజనాలు పెట్టలేదని, ఉదయం నుంచి పస్తులు ఉన్నామని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అనూహ్య పరిణామంతో ప్రజారోగ్య శాఖ అధికారులు కంగుతిన్నారు. సీఎంవోహెచ్‌ గోపీనాయక్‌ ఆదేశాల మేరకు  ఏఎంవోహెచ్‌ ఇక్బాల్‌ హుస్సేన్‌ కార్మికులతో చర్చలు జరిపారు. ఆయన కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటలోపు కాంట్రాక్టర్‌ బాలరాజు డబ్బు చెల్లించేందుకు అంగీకరించడంతో ఇక్బాల్‌ హుస్సేన్‌ హామీ మేరకు ఆందోళన విరమించారు. నిర్భంధించిన సబ్‌ కాంట్రాక్టర్లను వదిలేశారు. 
అధికారుల మిలాఖత్‌
 పుష్కర విధులు నిర్వహించేందుకు మొత్తం 19,200 మంది కార్మికులకు టెండర్లు పిలిచారు. విజయవాడ, విజయనగరం, శ్రీకాకుళం, నర్సీపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర ప్రాంతాలతోపాటు తమిళనాడు నుంచి సుమారు 15 వేల మంది కార్మికులు వచ్చారు. ఇక్కడి పరిస్థితులను చూసి మూడు వేల మంది తిరిగి వెళ్లిపోయారు. ఇక్కడ 12వేల మంది విధులు నిర్వహించినప్పటికీ 19,200 మంది విధుల్లో పాల్గొన్నారంటూ ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ అధికారులు కాంట్రాక్టర్లకు రూ.7 కోట్లు చెల్లించారు. డబ్బులను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్న కాంట్రాక్టర్లు కార్మికులకు అడ్వాన్స్‌ పేరుతో అరకొరగా ముట్టజెప్పారు. పుష్కర విధులు పూర్తయ్యాక మొత్తం లెక్కలు చూసి ఇచ్చేస్తామని నమ్మకంగా చెప్పారు. మంగళవారం రాత్రి నుంచే కొందరు కాంట్రాక్టర్లు మొహం చాటేయడంతో కార్మికులు ఎక్కడికక్కడే పుష్కరనగర్లలో ఆందోళన బాటపట్టారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్‌ కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో వేతనాల సొమ్ము జమ చేయాల్సి ఉంది. మామూళ్ల ఒప్పందం కుదరడంతో అధికారులు నేరుగా కాంట్రాక్టర్ల ఖాతాల్లో కోట్లాది రూపాయలు జమ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
అంతా మాయ..! 
రెండు షిప్టుల్లో పని చేయాల్సి ఉంటుందని, రోజుకు రూ.500 చొప్పున చెల్లిస్తామని కార్మికులను కాంట్రాక్టర్లు తీసుకొచ్చారు. పనులు పూర్తయ్యాక రోజుకు రూ.250 నుంచి రూ.325 చొప్పున మాత్రమే చెల్లిస్తామని పేచీ పెట్టారు. అల్పాహారం, భోజనాలు సక్రమంగా పెట్టకపోయినా గొడ్డు చాకిరీ చేశామని, చెప్పిన ప్రకారం డబ్బులు ఇవ్వాల్సిందేనని కార్మికులు పట్టుబట్టారు. ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు చెల్లించాల్సిన బిల్లులను అధికారులు కాకిలెక్కలతో సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కార్పొరేషన్‌ డబ్బులు ఇవ్వలేదంటూ కొందరు కాంట్రాక్టర్లు మాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకుని అడ్రస్‌ లేకుండాపోయారు. తిరుగు ప్రయాణానికి చేతిలో డబ్బులు లేకపోవడంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయామని విశాఖపట్నం నుంచి వచ్చిన కార్మికులు వాపోయారు. కార్మికులకు సీపీఎం నాయకులు సీహెచ్‌ బాబూరావు, దోనేపూడి కాశీనాథ్‌ తదితరులు మద్దతు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు