అశ్రునయనాలతో సంతోషి అంత్యక్రియలు

26 May, 2017 23:27 IST|Sakshi
అశ్రునయనాలతో సంతోషి అంత్యక్రియలు

► కడసారి చూపుకోసం తరలిన విద్యార్థి లోకం
►  హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌
►విద్యార్థి సంఘాల ఆందోళన


సిద్దిపేటఅర్బన్‌: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంతోషి అంత్యక్రియలు గురువారం సహచర విద్యార్థులు, గ్రామస్తులు, బంధువుల అశ్రునయనాల మధ్య కొండపాక మండలం సిరిసినగండ్లలో జరిగాయి. కడసారి చూపు కోసం విద్యార్థి లోకం పెద్ద ఎత్తున తరలివచ్చింది. డిగ్రీ కళాశాల విద్యార్థులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మరోవైపు సంతోషి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి, పౌరహక్కుల, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పోలీసు అధికారులకు వినతి పత్రాలు అందించారు.

అదే విధంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. సంతోషి మృతికి సంతాపంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సెమిస్టర్‌ పరీక్షలను బహిష్కరించి ర్యాలీగా ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆస్పత్రి వద్ద విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. గురువారం ఏరియా ఆస్పత్రిలో పోలీసుల సమక్షంలో సంతోషి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని విద్యార్థులు కొండపాక మండలం సిరిసినగండ్లకు తరలించారు. తమతోటి విద్యార్థిని మృతిని జీర్ణించుకోలేక విద్యార్థులు పెద్ద ఎత్తున కన్నీటి పర్యంతమయ్యారు. అంత్యక్రియలకు వందలాది మంది తరలివచ్చారు.

అధికారులకు వినతి..
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని సంతోషిపై జరిగిన అత్యాచారం, హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ నాయకులు భరత్, సాయి, లింగం, లక్ష్మణ్‌ తదితరులు జిల్లా ఆస్పత్రి వద్ద నిరసన ప్రదర్శన చేశారు. నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీఐ నందీశ్వర్‌కు, ఆర్డీఓ ముత్యంరెడ్డిలకు వినతిపత్రాన్ని అందించారు. పౌరహక్కుల సంఘం జిల్లా కమిటీ అధ్యక్షుడు రాగుల భూపతి గురువారం ఏసీపీకి వినతి పత్రం అందించారు.

విద్యార్థిని మృతికి కారణమైన గుమ్మన్నగారి రవిశంకరశర్మ, పద్మావతి, వారి కుమారుడు కృష్ణచంద్ర, శరత్‌చంద్రలను నిందితులుగా చేర్చి అత్యాచారం, హత్య, నిర్భయచట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సంరక్షణ పేరుతో విద్యార్థిని పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ పని మనిషిలా ఉపయోగించుకున్న ఆ కుటుంబంపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సంతోషిని మరణంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని వారు పోలీసు శాఖను కోరారు. వినతి పత్రం అందించిన వారిలో పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, బీడీఎస్‌ఎఫ్, తెలంగాణ ప్రజాఫ్రంట్‌ ప్రతినిధులు అనిల్‌రెడ్డి, అశోక్, సత్తయ్య, మన్నె కుమార్, శ్రీకాంత్, ఆనంద్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు