సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం

27 Dec, 2016 22:28 IST|Sakshi
సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం
  సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు కాటూరి
 
 
గుంటూరు రూరల్‌ :  గ్రామ సభలు జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని, ఇక మీదట అలా జరిగితే జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్‌లందరూ మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమని సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు కాటూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. నగరంలోని సీతానగర్‌ రెండో లైనులోని సర్పంచ్‌ల సంఘం జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉన్న జన్మభూమి కమిటీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, గ్రామ సర్పంచ్‌ అంటే గ్రామానికి ప్రథమ పౌరుడనే ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు.
 
గ్రామ సభల్లో సర్పంచ్‌లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి..
 గ్రామ స్థాయిలో జరిగే ప్రతి కార్యక్రమం గ్రామ సర్పంచ్‌ ఆధ్వర్యంలోనే ఉండాలని డిమాండ్‌ చేశారు. గ్రామ సభలు, సమావేశాల్లో సర్పంచ్‌లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో సర్పంచ్‌లకు సర్వహక్కులు ఇవ్వాలని కోరారు. సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఇళ్ల ప్లానులు, ఇతర ప్లానులు తదితర రెవెన్యూ అధికారాలు సర్పంచ్‌లకు కేటాయించాలని కోరారు. విద్యుత్‌ బిల్లులు, ఆర్థిక సంఘాల నిధుల వినియోగానికి ఈవోపీఆర్‌డీల కౌంటర్‌ సంతకాలను వెంటనే ఎత్తివేయాలన్నారు. 
 
సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం 
అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జాతీయ కార్యదర్శి జాస్థి వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కల్పించిన సర్పంచ్‌ల హక్కులను ప్రభుత్వాలు కాలరాయటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం సక్రమంగా అమలు జరిగేందుకు సహకరించాలని కోరారు. అనంతరం తమ సమస్యపై కలెక్టర్‌ కాంతిలాల్‌దండేకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి గౌస్‌ సంధాని, గౌరవాధ్యక్షుడు కళ్ల పానకాలరెడ్డి, ఎస్సీ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మన్నెం సుజాతకిషోర్, ప్రధాన కార్యదరిశ జగన్, నరసరావుపేట సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు చల్లా నారపరెడ్డి, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు గోగినేని వసుధ, చల్లావారిపాలెం సర్పంచ్‌ ఉగ్గం వెంకటేశ్వరరావు, ఓబులునాయుడు పాలెం సర్పంచ్‌ జి శివపార్వతి సుబ్బారావు, జిల్లా వ్యాప్తంగా సర్పంచ్‌లు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు