అద్వితీయ రాష్ట్రపతికి రాజమహేంద్రవరానుబంధం

4 Sep, 2016 18:10 IST|Sakshi
అద్వితీయ రాష్ట్రపతికి రాజమహేంద్రవరానుబంధం
చరిత్ర కెక్కని వాస్తవం
రెండేళ్లు ఆర్ట్స్‌ కాలేజీలో తత్త్వశాస్త్రాన్ని బోధించిన సర్వేపల్లి
రాజమహేంద్రవరం కల్చరల్‌: తత్త్వవేత్త, రాజనీతిజ్ఞుడు, భారతదేశ ద్వితీయ రాష్ట్రపరి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పండితునికి రాజమహేంద్రవరంతో అనుబంధం ఉంది. అయితే ఆ విషయం చరిత్రపుటలకు ఎక్కలేదు.  ఆయన 1917–1919 మధ్యకాలంలో రాజమహేంద్రవరం ఆర్ట్సు కళాశాలలో ‘ఫిలాసఫీ’ (తత్త్వశాస్త్రాన్ని) బోధించారు. ఆ రోజుల్లో ఆర్ట్సు కళాశాల నేటి గూడ్సుషెడ్డుకు సమీపంలో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనంలో ఉండేది. రాధాకృష్ణన్‌ పండితుడు నేటి టి.నగరు ప్రాంతంలోని కొక్కొండవారి వీధిలో నెలకు రూ.15 అద్దెకు ఉండేవారు. అయితే ఆ విషయం  సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జీవితంపై వెలువడిన గ్రంథాల్లో ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. చివరకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నిఘంటు నిర్మాణశాఖ, భాషాభివృద్ధిపీఠం ఆధ్వర్యంలో ప్రచురించిన ‘20వ శతాబ్దపు తెలుగువెలుగులు’ గ్రంథంలో ప్రచురించిన రాధాకృష్ణన్‌పై వ్యాసంలో కూడా ఈ విషయాన్నిఎక్కడా ప్రస్తావించలేదు. అయితే రాజమహేంద్రి జ్ఞాపకాలు ఆయనలో సదా పదిలంగా ఉండేవి. ఆ విషయం చరిత్ర పరిశోధకుడు, గ్రంథరచయిత యాతగిరి శ్రీరామనరసింహారావు తన స్వీయచరిత్ర‘నరసింహావలోకనం’లో ఇలా తెలియజేశారు. 
‘1962లో గుర్గాంవ్‌లో అఖిల భారత సహకారశిక్షణా కళాశాలలో శిక్షణపొందుతున్న సమయంలో నా నాయకత్వంలో వివిధ రాష్ట్రాలకు  చెందిన కొందరం ట్రెయినీలం రాష్ట్రపతి సర్వేపల్లిని కలుసుకునేటందుకు విజ్ఞాపన పత్రాన్ని పంపాం. వెంటనే రాష్ట్రపతి భవనం నుంచి ప్రత్యేక దూత ద్వారా మాకు అంగీకారం లభించింది. అది1962 సెప్టెంబర్‌ 30 వ తేదీ సాయంత్రం 4 గంటలు. సర్వేపల్లికి నాపేరు వైఎస్‌ నరసింహారావు అని తెలిపాను. ఊరు పేరు, ఇంటిపేరుతో సహాపూర్తిగా చెప్పమని ఆయన అడిగారు. ఊరు రాజమండ్రి, పూర్తిపేరు యాతగిరి శ్రీరామనరసింహారావు అన్నాను. మాది బ్రాహ్మణులలో మధ్వశాఖ అని వెంటనే గ్రహించిన ఆయన అరిపిరాల పాపారావు పంతులుగారు బాగున్నారా? అని అడిగారు. అరిపిరాలవారి ఇంట దక్షిణంవైపు వాటాలో నెలకు రూ. 15 అద్దెపై ఉండేవాడినని ఆయన తెలిపారు. ఆయనింకో ప్రశ్న వేశారు.. రాజమండ్రి మెయిన్‌రోడ్డు అంతే ఉందా? తరువాత ఆయన వేసిన మరోప్రశ్న– గోదావరిబ్రిడ్జి కింద ఏడో స్తంభం బలహీనమైనదని అనేవారు, ఇంకా అంటున్నారా? అని. నా చిన్నతనంలో అనేవారని బదులు చెప్పాను. మాకు కేటాయించిన 8 నిమిషాల సమయం 26 నిమిషాల వరకు కొనసాగింది’.
స్మృతి చిహ్నం
డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ రాజమహేంద్రవరంలో పనిచేసిన సుమారు 96 సంవత్సరాల తరువాత, నేటి ఆర్ట్సుకళాశాల ప్రాంగణంలో –2015లో ఆయన శిలా విగ్రహాన్ని నెలకొల్పారు. దానిపై ఈ వివరాలన్నీ పేర్కొనడం నగర ప్రేమికులకు కొంత ఊరట కలిగిస్తున్నాయి.
 
మరిన్ని వార్తలు