సమస్యలతో సతమతం

30 Jul, 2016 12:21 IST|Sakshi
జేసీ దివ్యకు వినతిపత్రం అందజేస్తున్న తహసీల్దార్ల సంఘ నాయకులు
  • సాంకేతిక లోపాలతో ఇబ్బందులు పడలేం  
  • జేసీ దివ్యకు తేల్చిచెప్పిన తహసీల్దార్లు
  • ఖమ్మం జెడ్పీసెంటర్‌:
    వెబ్‌ల్యాండ్, ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యల మూలంగా రైతులకు పహాణీలు ఇవ్వడంలో అంతరాయం కలుగుతోందని.. ఈ ఇబ్బందులు తాము పడలేమని తహసీల్దార్ల అసోసియేషన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ డి. దివ్యకు వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకారెడ్డి, శ్రీనివాసరావులు మాట్లాడారు. వెబ్‌ల్యాండ్‌ సాంకేతిక అంతరాయం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోందని, ప్రభుత్వం వెంటనే  సమస్యను పరిష్కరించాలన్నారు. రైతులకు, ప్రజలకు సేవ చేయలేకపోవడంతోపాటు అశించిన స్థాయిలో సాంకేతిక సహకారం అందడం లేదన్నారు.

    సాంకేతిక సమస్యల మూలంగా రైతులకు పహాణీలు, మీసేవ నుంచి వచ్చిన మ్యూటేషన్‌ దరఖాస్తులను పరిష్కరించలేకపోతున్నామని తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు డిజిటల్‌ కీలు మాకొద్దని తేల్చిచెప్పారు. వీటికి తోడు ప్రతి నెలా పేదలకు పంపిణీ చేసే నిత్యావసర వస్తువుల్లో బియ్యం కట్‌ అవుతోందని, ఆయా కార్డుల డేటాను డిజిటల్‌ కీల ద్వారా సవరించలేని పరిస్థితి నెలకొందన్నారు. సాంకేతిక సమస్యల మూలంగా రోజురోజకు ఇబ్బందులు అధికం అవుతున్నాయని, తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. దీంతో తీవ్ర నిరాశ నిస్పహలకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం మేరకు డిజిటల్‌ కీలను ఆర్డీఓలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్లు పుల్లయ్య, తాతారావు, ప్రకాష్‌రావు, రాజేంధర్‌ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు