కనీస వేతనం అందని ద్రాక్షే!

9 May, 2017 23:18 IST|Sakshi
కనీస వేతనం అందని ద్రాక్షే!

- సమస్యల్లో సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు
- 20 ఏళ్లుగా పనిచేస్తున్నా ఎదుగూ బొదుగు లేని వైనం

ధర్మవరం : ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది..సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేసే కార్మికుల వ్యథ. 20 ఏళ్లుగా పనిచేస్తున్నా ఎదుగూబొదుగు లేని వేతనాలతో బతుకులీడుస్తున్నారు. ప్రభుత్వ కనీస వేతన జీఓలు (జీఓ ఎంఎస్‌ 11/2011, జీఓఎంఎస్‌151/2016)ల ప్రకారం వృత్తితో సంబంధం లేకుండా బతకడానికి కనీస వేతనం ఇవాల్సి ఉంది. అయితే ఈ జీఓలు వారికి వర్తించడం లేదు.
            తాగునీటి సమస్యను పరిష్కరించాలన్న ఉద్ధేశంతో సత్యసాయిబాబా ప్రారంభించిన సత్యసాయి తాగునీటి పథకం జిల్లాలోని దాదాపు 860 గ్రామాలకు తాగునీరు అందిస్తోంది. ప్రభుత్వ తాగునీటి పథకాలు పడకేసినా నిత్యం జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మందికి తాగునీటిని అందిస్తోంది. ఈ పథకంలో మొత్తం 600 మంది దాకా కార్మికులు పని చేస్తున్నారు. సత్యసాయి తాగునీటి పథకాన్ని సత్యసాయి ట్రస్ట్‌ నుంచి 1995లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అదే ఏడాది పథకం నిర్వహణ బాధ్యతలను ఎల్‌అండ్‌టీ కంపెనీకి అప్పజెప్పింది. నిర్వహణకు గానూ ప్రతి నెలా ప్రభుత్వం రూ.1.60 కోట్లు ఇస్తోంది.

400 మంది దాకా కార్మికులు ఈ పథకం ప్రారంభం నుంచి పనిచేస్తున్నారు. వీరు తొలినాళ్లలో రూ.900కే పనికి కుదిరి, నేటికీ రూ.9,300కే పని చేస్తున్నారు. ఇన్నేళ్లుగా పనిచేస్తున్నా వారికి మాత్రం కనీస వేతనం దక్కడం లేదు. తమకు కనీస వేతనం అమలు చేయాలని కార్మికులు ఎన్నిసార్లు అందోళనలు చేసినా ఫలితం శూన్యం. యాజమాన్యం పట్టించుకోవడం లేదని, కనీసం గుర్తింపుకార్డులు కూడా ఇవ్వకపోవడంతో కార్మికులు కార్మిక సంక్షేమశాఖకు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును స్వీకరించిన ఆశాఖ విషయాన్ని మరుగునపడేసింది. తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు కనీసం కాంట్రాక్ట్‌ కార్మికులా, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులా అని కూడా «ధ్రువీకరించిన పాపాన పోలేదని వాపోతున్నారు.

రూ.900తో పనికెక్కా..
పథకం ప్రారంభంలో రూ.900తో పనికి కుదిరా. 20 ఏళ్లుగా పనిచేస్తుంటే ఇప్పుడు కేవలం రూ.9వేలు మాత్రమే వేతనం ఇస్తున్నారు. సర్వీస్‌ లేదు, ఇంక్రిమెంట్లు లేవు, పనికి తగిన వేతనం లేదు..కనీసం గుర్తింపు కార్డు కూడా లేదు. ఇదేమని అడిగితే యాజమాన్యం పెద్దలతో చర్చించి పెంచుతామంటున్నారు.
–భగవాన్, పంప్‌ ఆపరేటర్‌, సత్యసాయి తాగునీటి పథకం

కనీస వేతనం అమలు చేయాలి
జీఓ 151 ప్రకారం కనీసం వేతనం రూ.12వేలు చొప్పున కార్మికులకు వేతనం అందజేయాలి. ఇప్పటికే చాలా సార్లు ఆందోళనలు చేపట్టినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో ఒక్కో కార్మికుడు ఏడాదికి రూ.1.50 లక్షలు నష్టపోతున్నారని, కార్మికశాఖకు ఫిర్యాదు చేశాం. వారు ఫిర్యాదును కనీసం విచారించిన పరిస్థితి కూదా లేదు. అలాగే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా మాకు మాత్రం న్యాయం జరగలేదు.
ఉపేంద్ర, సత్యసాయి వాటర్‌ సప్లై కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు

మరిన్ని వార్తలు