రత్నగిరిపై పెళ్లి సందడి

15 Feb, 2017 23:19 IST|Sakshi
రత్నగిరిపై పెళ్లి సందడి
  • సత్యదేవుని సన్నిధిలో 30కి పైగా వివాహాలు 
  • పెద్ద సంఖ్యలో ఉపనయనాలు, అక్షరాభ్యాసాలు
  • అన్నవరం :
    రత్నగిరి మామూలుగా వచ్చే భక్తులకు పెక్కు పెళ్లి బృందాలు తోడు కాగా సందడిగా మారింది. బుధవారం సత్యదేవుని సన్నిధి వివాహాలు చేసుకునే  వధూవరులు, వారి బంధుమిత్రులు, చిన్నారుల అక్షరాభ్యాస కార్యక్రమాలతో కిటకిటలాడింది. ఉదయం 10.54 గంటల ముహూర్తంలో రత్నగిరిపై 30కి పైగా వివాహాలు, 40 ఉపనయనాలు, 50 అక్షరాభ్యాస కార్యక్రమాలు జరిగాయి. ఈ శుభ కార్యక్రమాలన్నీ ఒకే సమయంలో జరగడంతో ఎక్కడ చూసినా సందడి నెలకొంది. బుధవారం రాత్రి కూడా పెద్దసంఖ్యలో వివాహాలు జరిగే అవకాశం ఉందని పండితులు తెలిపారు.
    అక్షరాభ్యాస మండపం చాలక ఇబ్బంది
    దేవస్థానంలో గతంలో వ్రతమండపాల ఆవరణలోనే అక్షరాభ్యాసాలు, అన్నప్రాశనలు, నామకరణాలు జరిగేవి. అయితే ఈ నెల 9 నుంచి దర్బారు మండపం పక్కనే గల మండపంలో సరస్వతి విగ్రహం ఉంచి అక్కడే ఈ మూడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ మండపం చాలా చిన్నదిగా ఉండడంతో ఐదు అక్షరాభ్యాసాలు ఒకేసారి జరిగితేనే కిక్కిరిసి పోతోంది. బుధవారం ఒకేసారి 50 మంది తమ చిన్నారులతో సహ ఆ మండపంలోకి రావడంతో ఎవరికీ కూర్చోవడానికి కూడా స్థలం  లేదు. దీంతో పురోహితులు పక్కనే గల మండపంలో, మండపం వెలుపల కొన్ని అక్షరాభ్యాసాలు, అన్నప్రాశనలు జరిపించాల్సి వచ్చింది. రూ.700 వ్రతమండపంలో విధులు నిర్వర్తించే పురోహితులు చాలకపోవడంతో రూ.300 వ్రతమండపంలో పనిచేసే పురోహితులు కూడా ఈ కార్యక్రమాలకు రావల్సి వచ్చింది. కాగా బుధవారం 15 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. వ్రతాలు 1,619 జరగగా, అన్ని విభాగాల ద్వారా రూ.15 లక్షల ఆదాయం సమకూరింది.
     
>
మరిన్ని వార్తలు