ఘనంగా సత్యదేవుని 126వ ఆవిర్భావ దినోత్సవం

4 Aug, 2016 21:34 IST|Sakshi
ఘనంగా సత్యదేవుని 126వ ఆవిర్భావ దినోత్సవం
  • స్వామి, అమ్మవార్లకు ప్రత్యేకాభిషేకం 
  • ఆయుష్యహోమం, పూర్ణాహుతి
  • అన్నవరం :
    అన్నవరం సత్యదేవుని 126వ ఆవిర్భావ దినోత్సవం శ్రావణశుద్ధ విదియ గురువారం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం మఖ కూడా కలిసి రావడంతో పలు కార్యక్రమాలు తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి, అమ్మవార్ల మూలవిరాట్‌లకు పాలు,పెరుగు, నెయ్యి, తేనె, పళ్లరసాలు, కొబ్బరినీరు, మంచిగంధంతో మహాన్యాసపూర్వక అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధభరిత పూలమాలలతో అలంకరించారు. ఉదయం ఆరు గంటల స్వామివారి దర్శనం కలుగచేశారు. 
    ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దర్బారు మండపంలో ఉదయం 10.30 గంటలకు స్వామివారి ఆయుష్యహోమం, పూర్ణాహుతి నిర్వహించారు.   అమ్మవారి ప్రతిరూపాలు బాల, కుమారి, సువాసినులుగా ఆయా వయసు బాలికలు, ముత్తయిదువలకు పాదపూజ నిర్వహించారు. దేవస్థానం చైర్మన్‌ రాజా ఐవీ రోహిత్, ఈఓ నాగేశ్వరరావు దంపతులు హోమద్రవ్యాలను హోమగుండంలో వేయగా వచ్చిన పెద్ద మంట వచ్చి సుమారు పది నిమిషాలు వెలిగింది. స్వామివారి మాహాత్మ్యం వల్లే ఈ అద్భుతం జరిగిందని పండితులన్నారు. స్వామి, అమ్మవార్లకు వేదాశీస్సులందచేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన ‘కాయం’ ప్రసాదాన్ని, స్వామివారి గోధుమ నూక ప్రసాదాన్ని నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. దేవస్థానం పండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
    పండితులకు సత్కారం
    ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రికి చెందిన మహా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, వేదవాచస్పతి చిర్రావూరి శ్రీరామశర్మ, దేవస్థానం వైదిక సలహాదారు ఎంవీఆర్‌ శర్మ, అయ్యగారి జోగిసోమయాజులు, విష్ణుభట్ల హనుమత్‌ సోమయాజి, అన్నవరానికి చెందిన యనమండ్ర సూర్యనారాయణ అవధానులను ౖచైర్మన్, ఈఓలు సత్కరించారు. ఒక్కొక్కరికీ రూ.2,500 చొప్పున నగదు, దుశ్శాలువా, స్వామి ప్రసాదాలను అందచేశారు. విశ్రాంత వ్రతబ్రహ్మ పాలంకి పట్టాభిరామ్మూర్తి, విశ్రాంత వ్రతపురోహితుడు, పంచాంగకర్త తొయ్యేటి సుబ్రహ్మణ్యం, మంగళంపల్లి కృష్ణభగవాన్‌జీలను కూడా సన్మానించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలయప్రాంగణాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. కోలాటం, భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
మరిన్ని వార్తలు