గిరిపై మార్మోగిన వేదఘోష

9 May, 2017 00:34 IST|Sakshi
అన్నవరం :
సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా వైశాఖ శుద్ధ త్రయోదశి సోమవారం సాయంత్రం నవదంపతులు  సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్ల సమక్షంలో వేదపండిత సదస్యం ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 125 మంది పండితులను సత్కరించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నవదంపతులు సత్యదేవుడు, అమ్మవార్లను పెళ్లిపెద్దలు సీతారాములు వెంట రాగా అనివేటి మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి అక్కడి వేదిక మీద ప్రతిష్ఠించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అలంకరించి పూజలు చేశారు. పండితులు నాలుగు గంటలకు అనివేటి మండపాన్ని చేరుకున్నారు. సాయంత్రం ఆరు గంటలవరకూ రత్నగిరి పరిసరాలు పండితుల వేదమంత్రోఛ్చాటనతో మార్మోగాయి. తరువాత దేవస్థానం వేదపండితులు సత్యదేవుడు, అమ్మవార్లకు వేదాశీస్సులందచేశారు.
  అనంతరం వేదపండితులను దేవస్థానం చైర్మ¯ŒS రోహిత్, ఈఓ నాగేశ్వరరావు ఘనంగా సత్కరించారు. తొలుత మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ. ప్రముఖ పండితుడు చిర్రావూరి శ్రీరామశర్మలను, తరువాత మిగిలిన పండితులను సత్కరించారు. వేదపండితుల పాండిత్యాన్ని అనుసరించి రూ.మూడువేలు, రూ.2,700, రూ.2,300, రూ.1,500 చొప్పున నగదు పారితోషికం, మామిడిపండు, స్వామివారి ప్రసాదం, విసనకర్ర బహూకరించారు. విశ్రాంత వ్రతబ్రహ్మ పాలంకి పట్టాభిరామ్మూర్తి, విశ్రాంత దేవస్థానం పంచాంగకర్త తొయ్యేటి సుబ్రహ్మణ్యంలను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠి, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు, కొండవీటి సత్యనారాయణ,   వ్రతపురోహిత ప్రముఖులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్, అర్చకస్వాములు కోట శ్రీను తదితరులు పాల్గొన్నారు.
 
అన్నవరంలో నేడు
వైదిక కార్యక్రమాలు
l తెల్లవారుజామున: 
3.00 గంటలకు     సుప్రభాతసేవ
l ఉదయం: 8.00 గంటలకు                 
చతుర్వేదపారాయణ
l సాయంత్రం 4.00 గంటలకు:  పేపర్‌ మిల్లు పార్కులో స్వామి, అమ్మవార్ల 
వనవిహారోత్సవం 
l రాత్రి 9.00 గంటలకు : కొండ దిగువన స్వామి, అమ్మవార్లను వెండి వాహనంపై 
ఊరేగింపు  
సాంస్కృతిక కార్యక్రమాలు
l ఉదయం 6.00 నుంచి 9.00 
గంటల వరకూ భజనలు
l సాయంత్రం 5.00 నుంచి 6.00 
గంటల వరకూ భక్తిరంజని
l సాయంత్రం 6.00 నుంచి రాత్రి 
9.00 గంటల వరకూ భరతనాట్యం
 
మరిన్ని వార్తలు