సత్యదేవుని నిత్య పూజలపై చిన్నచూపు

7 Aug, 2016 23:43 IST|Sakshi
సత్యదేవుని నిత్య పూజలపై చిన్నచూపు
  • అషో్టత్తరం, సహస్రంపై ప్రచారం కల్పించని అధికారులు
  • దేవస్థానంలో వాటిని నిర్వహిస్తున్నారన్న సంగతే తెలియని పరిస్థితి
  • జూలైలో జరిగిన వ్రతాలు 22 వేలు కాగా 
  • నిత్యపూజలు చేయించుకున్నది 42మందే!
  • అన్నవరం :
    ఏ దేవాలయంలో అయినా ఎంత ఎక్కువ పూజలు జరిగితే అంత శక్తి అక్కడి దేవతామూర్తులకు వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. స్వామి, అమ్మవార్లకు నిత్యం అర్చనలు, అగ్నిహోత్రం వంటి కార్యక్రమాలు ఈ విధంగా వచ్చినవే. కలియుగదైవం వేంకటేశ్వరస్వామికి తిరుమలలో తెల్లవారుజాము నుంచి రాత్రి గుడి తలుపులు మూసివేసే వరకూ ఎన్నోరకాల పూజలు భక్తుల భాగస్వామ్యంతో చేస్తుంటారు. అయితే అన్నవరం దేవస్థానంలో మాత్రం ఒక్క స్వామివారి వ్రతానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి స్వామి,అమ్మవార్లకు భక్తులు చేయించే అషో్టత్తరం, సహస్రం వంటి పూజలకు దాదాపుగా మంగళం పాడేశారు. 
    ఒకప్పుడు  పూజలే ఎక్కువ 
    అన్నవరం దేవస్థానంలో జరిగే పూజల గురించి చెప్పమంటే అందరూ స్వామివారి వ్రతం గురించే చెబుతారు. సత్యదేవుడు, అమ్మవార్లకు ఉదయం, సాయంత్రం అషో్టత్తరం, సహస్రం వంటి పూజలు కూడా నిర్వహిస్తారు. అషో్టత్తరం టికెట్‌ రూ.20, సహస్రం రూ.40, యంత్రాలయంలో శివునికి అభిషేకం టిక్కెట్టు రూ.వంద గా నిర్ణయించారు. కానీ ఈ పూజల విషయం ఎవరికీ తెలియదు. కారణం ప్రచారం లేకపోవడమే. ఒకవేళ ప్రచారం చేస్తే వ్రతాలు చేయించుకునే భక్తులు ఈ పూజలు చేయించుకుంటే ఆదాయం తగ్గిపోతుందని అనుకుంటున్నారేమో తెలియదు. 25 సంవత్సరాల క్రితం వరకూ ప్రధాన ఆలయంలోనే స్వామి, అమ్మవార్లకు ఇరువైపులా గల ద్వారాల వద్ద భక్తులను కూర్చోబెట్టి వీటిని చేయించేవారు. ఆ తరువాత భక్తులు పెరగడంతో ఆ పూజలను దర్బారు మండపంలోకి మార్చారు. దర్బారు మండపంలో ఉత్సవ మూర్తుల దర్శనం నిలిపివేశాక ఈ పూజలు క్రమేపీ తగ్గించేశారు. ఈ పూజలు ఉదయం ఎనిమిది నుంచి 11 గంటల వరకూ దర్బారు మండపంలో చేస్తున్నారు. ఈ పూజల టిక్కెట్లు విక్రయించే బుకింగ్‌ కౌంటర్‌లో వాకబు చేస్తే రోజుకు ఒకటో రెండో టిక్కెట్లు విక్రయిస్తున్నామని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. జూలై నెలలో దేవస్థానంలో 22 వేల వ్రతాలు జరిగి సుమారు రూ.60 లక్షల ఆదాయం రాగా కేవలం 42మంది మాత్రమే అషో్టత్తరం, సహస్రం, అభిషేకాలు చేయించుకోవడంతో రూ.2 వేల రాబడి వచ్చింది. దీన్నిబట్టి ఈ పూజల గురించి భక్తులకు తెలియడం లేదని అర్థమౌతోంది.  
    ప్రచారమేది?
    స్వామివారికి అషో్టత్తరం, సహస్రం చేయించాలంటే టికెట్లు ఎక్కడ దొరుకుతాయో, ఏ సమయంలో చేస్తారో చెప్పే నాథుడే లేడు. ఎంతసేపు స్వామివారి వ్రతాల టికెట్ల గురించి మైకులో చెబుతారు తప్ప ఈ పూజల గురించి చెప్పరు. 
     
మరిన్ని వార్తలు