వక్ఫ్ భూములు కాపాడాలి

25 May, 2016 01:55 IST|Sakshi
వక్ఫ్ భూములు కాపాడాలి

భూముల సమాచారం పక్కాగా ఉండాలి
రిజిస్ట్రేషన్లు చేయొద్దు ఆక్రమణలు వాస్తవమే
శాసనసభ కమిటీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

 సంగారెడ్డి జోన్:  రాష్ట్రంలో వక్ఫ్ భూములను కాపాడాలని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణపై ఏర్పాటైన శాసనసభ కమిటీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధికారులను ఆదేశించారు. భూములు ఆక్రమణకు గురైన విషయం వాస్తవమేనని  అంగీకరించారు. వక్ఫ్ భూముల విచారణకు నియమించిన  శాసన సభ కమిటీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సభ్యులు ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, సయ్యద్ అల్తాఫ్ హుస్సేన్ రజ్వీలు మంగళవారం సంగారెడ్డిలో పర్యటించారు. ఈ మేరకు వారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహసీల్దార్లతో స మీక్ష నిర్వహించారు.

చైర్మన్ బాజిరెడ్డి మాట్లాడు తూ... గతంలో నియమించిన కమిటీ నివేదిక లో స్పష్టత లేకపోవడంతో శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల విజ్ఞప్తి మేరకు సీఎం  స్పందించి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం శాసన సభ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున వక్ఫ్ భూములు ఆక్రమణకు గురైనందున వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక రూపొందిస్తామన్నారు. రెవెన్యూ పో లీస్, వక్ఫ్ అధికారులు సమన్వయంతో పనిచేసి వక్ఫ్ భూములు, ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని సూచించారు.

ఆస్తుల విషయంలో గందరగోళం...
జిల్లాలో 23,910.11 ఎకరాల వక్ఫ్ భూములున్నట్టు సమాచారం ఉండగా, వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ మాత్రం 20,806 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు నివేదిక అందించారని చైర్మన్ బాజిరెడ్డి తెలిపారు. జిల్లాలో వక్ఫ్ బోర్డు ఆధీనంలో 4,480 ఎకరాలు ఉండగా, 7,728.3 ఎకరాలు ఓఆర్‌సీ, ఇతరుల కబ్జాలో ఉందన్నారు. 8,603.2 ఎకరాల భూమి వివరాలను తేల్చాల్సి ఉందన్నారు. వక్ఫ్ బోర్డు నుంచి ఆదాయం రూ.5 కోట్లు వస్తుండగా అంతే మొత్తంలో ఖర్చవుతుందన్నారు. వక్ఫ్ భూములను కొందరు దాతలు విరాళంగా అందజేశారన్నారు. వాటిని విద్య, వైద్యం, ఇతర సామాజిక అంశాలకు వినియోగించాలనే వారి లక్ష్యమన్నారు. కాని వారి లక్ష్యం నెరవేరకపోగా, ఆస్తులను కొందరు ఆక్రమించుకొని అనుభవిస్తున్నారన్న ఆరోపణలపై తమ కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు.

రిజిస్ట్రేషన్లు జరగకుండా నియంత్రించాలి...
వక్ఫ్ భూములు రిజిస్ట్రేషన్ జరగకుండా చూడాలని బాజిరెడ్డి అధికారులను ఆదేశించారు. సర్వే నంబర్ల వారీగా వివరాలను సంబంధిత రిజిస్ట్రార్లకు అందజేయాలని సూచించారు. ఆస్తుల ఆక్రమణను తీవ్రంగా పరిగణిస్తామన్నారు. వక్ఫ్ బోర్డు వివరాలను, రెవెన్యూ రికార్డులకు సరిచూసుకుని త్వరగా నివేదికలు అందజేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. జిల్లా నుంచి వచ్చే నివేదిక ఆధారంగా మిగిలిన తొమ్మిది జిల్లాల్లో తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టత వస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలోని వక్ఫ్‌బోర్డు పట్ల తీవ్ర నిర్లక్ష్యం జరిగిందన్నారు. వక్ఫ్ ఆస్తులతో ప్రభుత్వానికి సంబంధం లేకుండా చేశారన్నారు. వక్ఫ్ ఆస్తులను రెవెన్యూ శాఖకు అప్పగించి, వాటి పరిరక్షణకు శాసన సభ కమిటీ చర్యలు చేపట్టిందన్నారు.

 బోర్డులు ఏర్పాటు చేయాలి...
క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న తహసీల్దార్లు వక్ఫ్‌భూములను కాపాడాలని కమిటీ సభ్యులు ఫారూక్ హుస్సేన్, సయ్యద్ అల్తాఫ్ హుస్సేన్ రజ్వీ అధికారులకు సూచించారు. సదరు భూ ముల్లో బోర్డులను ఏర్పాటుచేసి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కోహీర్‌లో అత్యధికంగా భూములున్న నేపథ్యంలో వాటి పరిరక్షణకు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 175 దరఖాస్తులు ఆర్డీఓల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించి వివరాలను వక్ఫ్ బోర్డుకు అందజేయాలన్నారు. వక్ఫ్ భూములు లీజుకు పొందిన, ఆస్తుల విషయంలో అద్దె పెంచకుండా, ఖాళీ చేయకుండా బోర్డుకు ఆదాయం రాకుండా కబ్జా చేస్తున్న వాటి వివరాలను అందజేయాలన్నారు.

జిల్లాలో వక్ఫ్ భూములను క్షేత్రస్థాయిలో గుర్తించడానికి మరో ఐదుగురు ఇన్‌స్పెక్టర్లను కేటాయించాలని కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. పహాణీల్లో వక్ఫ్‌భూములను ప్రత్యేకంగా నమోదు చేయాలని సూచించారు. ఉదయం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో శాసన సభా కమిటీ సభ్యుల సమావేశంలో కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వక్ఫ్ భూముల వివరాలు వెల్లడించారు. సమావేశంలో శాసన సభ్యులు మహిపాల్ రెడ్డి, డీఆర్‌ఓ దయానంద్, వక్ఫ్ సీఈఓ మహ్మద్ అసదుల్లా, సంగారెడ్డి, మెదక్ ఆర్డీఓలు శ్రీనివాస్ రెడ్డి, మెంచు నగేశ్, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా