డజను సార్లు పాస్‌వర్డ్‌ చెప్పాడు!

24 Dec, 2016 10:10 IST|Sakshi
డజను సార్లు పాస్‌వర్డ్‌ చెప్పాడు!

ముషీరాబాద్‌ వాసికి సైబర్‌ నేరగాళ్ళ ఎర
అతడి ఖాతా నుంచి రూ.లక్ష నగదు స్వాహా


సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకు ఖాతాలోని నగదు ఆన్‌లైన్‌లో కాజేసే సైబర్‌ నేరగాళ్ళు రోజురోజుకూ  తెలివి మీరుతున్నారు. ముషీరాబాద్‌కు చెందిన ఓ చిరు వ్యాపారికి టోకరా వేసిన ఈ కేటుగాళ్ళు రెండు రోజుల్లో రూ.లక్ష కాజేశారు. సదరు సైబర్‌ నేరగాళ్ళు ఏ స్థాయిలో బుట్టలో వేసుకున్నారంటే... ఈ వ్యవధిలో పన్నెండుసార్లు తన ఫోన్‌కు వచ్చిన వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) చెప్పిన సదరు చిరు వ్యాపారి అదే సమయంలో తన సెల్‌ఫోన్‌కు వచ్చిన బ్యాంకు ఎస్సెమ్మెస్‌లను పట్టించుకోలేదు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముషీరాబాద్‌లోని భోలక్‌పూర్‌కు చెందిన ఓ చిరు వ్యాపారికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్‌లో ఖాతా ఉంది. ఈ నెల 19న ఇతడికి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్ళు బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, అనివార్య కారణాల నేపథ్యంలో మీ డెబిట్‌కార్డ్‌ బ్లాక్‌ అయిందంటూ చెప్పారు.

అసలే నోట్లు రద్దు ఎఫెక్ట్‌తో అత్యధికంగా లావాదేవీలు కార్డు ద్వారానే చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కార్డ్‌ బ్లాక్‌ అని తెలియడంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితుడు పరిష్కారమేమిటని ఆలోచిస్తుండగా... పునరుద్ధరిస్తామంటూ ఫోన్‌ చేసిన వారే చెప్పి బుట్టలో వేసుకున్నారు. పునరుద్ధనణ కోసమంటూ కార్డు నెంబర్, సీవీవీ కోడ్‌ సహా ఇతర వివరాలు తెలుసుకున్నారు. వీటిని వినియోగించి ఆన్‌లైన్‌ ద్వారా వ్యాపారి ఖాతాలో ఉన్న సొమ్ము స్వాహా చేయడానికి ఓటీపీ అవసరం. అది లావాదేవీ చేసినప్పుడు వ్యాపారి సెల్‌ఫోన్‌కే వస్తుంది. దీంతో లావాదేవీలకు రంగం సిద్ధం చేసిన సైబర్‌ నేరగాళ్ళు ఆన్‌లైన్‌లో డబ్బు కాజేస్తూ బాధితుడికే ఫోన్‌ చేసిన ఓటీపీ అడిగారు. తాము మీ కార్డును పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో ఈ నెంబర్‌ చెప్పడం అనివార్యమంటూ నమ్మించారు. 19న ఆరుసార్లు, 20న మరో ఆరుసార్లు ఫోన్లు చేసిన సైబర్‌ నేరగాళ్ళు బాధితుడి ఖాతా నుంచి రూ.లక్ష కాజేశారు. ఈ సమయంలో సైబర్‌ నేరగాళ్ళు మాట్లాడుతున్న అంశాలను బాధితుడు రికార్డు చేశాడు. అదే సమయంలో అతడి ఖాతా నుంచి డబ్బు కట్‌ అయిన ప్రతిసారీ బ్యాంకు నుంచి ఎస్సెమ్మెస్‌ వచ్చింది.

సైబర్‌ నేరగాళ్ళు హడావుడి పెట్టడం, ఓటీపీని సరిగ్గా చెప్పనందుకే కార్డు పునరుద్ధరణ కావట్లేదంటూ గందరగోళానికి గురి చేయడంతో ఈ ఎస్సెమ్మెస్‌లను బాధితుడు పట్టించుకోలేకపోయాడు. రూ.లక్ష బదిలీ అయినట్లు గుర్తించిన తర్వాత ఈ సంక్షిప్త సందేశాలను పరిశీలించడం ద్వారా రెండు రోజుల్లో 12 లావాదేవీలు జరిగినట్లు తెలుసుకున్నాడు. దీనిపై శుక్రవారం నగర సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన అధికారులు ప్రాథమికంగా సదరు సైబర్‌ నేరగాళ్ళు జార్ఖండ్‌లోని జమ్‌తార ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. బాధితుడి నగదు సైతం ఉత్తరాదికి చెందిన ఖాతాల్లోకి మళ్ళించినట్లు భావిస్తున్న పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు