ఈసారి తాడో పేడో తేల్చుకుంటాం

6 Oct, 2016 08:38 IST|Sakshi
ఈసారి తాడో పేడో తేల్చుకుంటాం
వర్గీకరణ కోసం ఎన్ని పోరాటాలకైనా సిద్ధం
మాటిచ్చి బాబు మోసం చేశాడు ∙మాదిగల ఆత్మ గౌరవ సభలో వక్తలు
అమలాపురం టౌన్‌ : ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు ఎన్ని పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నారు. ఈసారి తాడో పేడో తేల్చుకుంటాం. ఎన్నికల ముందు మాదిగలకు మాట ఇచ్చి తప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగిన బుద్ది చెబుతామని మాదిగల ఆత్మగౌరవ సభ హెచ్చరించింది. అమలాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం రాత్రి మాదిగల ఆత్మగౌరవ సభ జరిగింది. రాష్ట్ర ఎమ్మార్పీఎస్‌ ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి ఇజ్రాయిల్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ ప్రముఖులు హాజరయ్యారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జన్ని రమణయ్య మాదిగ, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంఎస్‌ రాజు సభకు అతిథులుగా హాజరయ్యారు.

రాష్ట్ర అధ్యక్షుడు రమణయ్య మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టబద్దత కల్పించాలని డిమాండు చేశారు. వర్గీకరణకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి అఖిల పక్షాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి తీసుకుని వెళ్లాలన్నారు. సూదాపాలెం బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని, ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 8 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.ఎస్‌.రాజు, సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇజ్రాయిల్‌ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ‘ మీకు వర్గీకరణ చేసి నేను పెద మాదిగ అవుతాన’ని... డప్పు కొట్టి మరీ చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాదిగలను దగా చేసి మాట తప్పారని ధ్వజమెత్తారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గొర్రె లాజరస్, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకులు ఉందుర్తి, సుబ్బారావు, ఉప్పలపాటి నెపోలియన్‌ తదితరులు ప్రసంగించారు.
 
డప్పుల దరువుతో సాగిన ర్యాలీ : మాదిగల ఆత్మ గౌరవ సభకు ముందు స్థానిక బస్‌స్టేషన్ నుంచి మాదిగలు డప్పుల దరువులతో ర్యాలీ నిర్వహించారు. మోటారు సైకిళ్లు, కార్లతో ఈ ర్యాలీ  సభా స్థలి దాకా సాగింది.
మరిన్ని వార్తలు