సమస్యలను పరిష్కరించకుంటే చర్యలు: కలెక్టర్‌

29 Aug, 2016 23:41 IST|Sakshi
సమస్యలను పరిష్కరించకుంటే చర్యలు: కలెక్టర్‌
 
గూడూరు:ఏ సమస్య అయినా త్వరితగతిన పరిష్కరించకుంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ ముత్యాలరాజు హెచ్చరించారు. స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్‌ సెల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్‌ పరిధిలోని పలు మండలాల నుంచి ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్‌కు అర్జీలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకూ 877 అర్జీలను ఎన్‌రోల్‌ చేసినట్లు తెలిపారు. మరో 300కు పైగా అర్జీలు కూడా వచ్చాయన్నారు. పరిష్కరించే వీలున్న వాటిని త్వరగా పరిష్కరించాలన్నారు. వీలుకాని వాటిని అందుకు గల కారణాలను అర్జీదారునికి తెలియజేయాలన్నారు. జిల్లాలోని నాలుగు డివిజన్లలో ఒక్కొ నెల్లో ఒక్కో డివిజన్‌ వంతున ఇలాంటి గ్రీవెన్స్‌ సెల్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 
 
ఆక్రమణలు విడిపించండి
ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం.. ఆ భూములకు పట్టాలు ఇప్పించండి.. అలాగే ఆక్రమణదారుల చెరనుంచి భూములను విడిపించి అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని బాధితులు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పిం చాలని, తమకు ప్రభుత్వం ఇచ్చిన పొలాన్ని కొందరు ఆక్రమించేశారని, వాటిని వారి చెరనుంచి విడిపించాలని పలువురు అర్జీలు సమర్పించారు.  కొందరు పింఛన్లు సక్రమం గా రావడం లేదని కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి అరవ పార్వతయ్య మాట్లాడుతూ ఓజిలి మండలం ముమ్మాయపాళెంలో అగ్ర కులాల వారు చెరువును పూడ్చేస్తున్నారని, దీంతో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూముల్లో సాగు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సీపీఎం నాయకుడు యాదగిరి మాట్లాడుతూ డివిజన్‌లో వేలాది ఎకరాల భూమిని పరిశ్రమల కోసం కేటాయించారని, అయితే కొన్ని పరిశ్రమలు స్థాపించలేదన్నారు. ఆ భూములను తిరిగి పేదలకు పంచాలని కోరారు. ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, ఎమ్మార్పీఎస్‌ నాయకుడు మందా కృష్ణయ్య, కాంగ్రెస్‌ పార్టీ పట్టణాధ్యక్షుడు గోపాల్‌యాదవ్, బీఎస్పీ నాయకుడు నాశిన భాస్కర్‌గౌడ్,ప్రగతిశీల సౌమ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సునీల్‌ తదితరులు పలు సమస్యలపై అర్జీలు ఇచ్చారు.  
మరిన్ని వార్తలు