పాఠశాలల్లో ‘ఖేల్‌ ఖతం’

11 Jan, 2017 23:13 IST|Sakshi
పాఠశాలల్లో ‘ఖేల్‌ ఖతం’

అరకొర మైదానాలతో కుంటుపడిన క్రీడాభివృద్ధి
జిల్లాలో కేవలం 118మంది పీఈటీలు, 27మంది పీడీలు


మహబూబ్‌నగర్‌ క్రీడలు : జిల్లాలోని క్రీడల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాఠశాలస్థాయిలో క్రీడలను అభివృద్ధి చేస్తామన్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల మాటలు కేవలం మూటలుగా మిగిలిపోతున్నాయి. జిల్లాల్లోని చాలా పాఠశాలల్లో సరైన క్రీడామైదానాలు లేక విద్యార్థులకు క్రీడావికాసానికి దూరమవుతున్నారు. ఆటస్థలాలు లేని పాఠశాలలు కొన్ని...మైదానాలు ఉన్నా పీఈటీలు లేని పాఠశాలలు మరికొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా ఆట పరికరాలు కనిపించని పాఠశాలలు మరెన్నో.  జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు అసలే పీఈటీ లేరు.

అరకొర వ్యాయామ ఉపాధ్యాయులు...
మహబూబ్‌నగర్‌ జిల్లాలో 213 ఉన్నత పాఠశాలలు, 185 ప్రాథమికోన్నత పాఠశాలలు, 980 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటి పరి ధిలో కేవలం 118పీఈటీలు, 27మంది ఫిజికల్‌ డైరెక్టర్లు ఉన్నారు. అత్తెసరు వ్యాయా మ ఉపాధ్యాయులు, అరకొర మైదానాలతో జిల్లాలోని విద్యార్థులకు ఆటలకూ దూరమై, కేవలం చదువుకే పరిమితమవుతున్నారు. ఇక ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలల్లో క్రీడలు, వ్యాయామ విద్యకు చోటులేదు. 9, 10 తరగతుల విద్యార్థులకు ఆటలు ఆడడానికి సమ యం లేకుండా సిలబస్‌ చదివిస్తున్నారు. పదు ల సంఖ్యలోని పాఠశాల్లో మైదానాల్లో క్రీడలు ఆడిపిస్తున్నారు.

విద్యాహక్కు చట్టం అమలయ్యేనా...!
విద్యాహక్కు చట్టం ప్రకారం వ్యాయామ విద్యను కచ్చితంగా అమలు చేయాలంటూ అప్పటి ప్రభుత్వం 2012లో జీఓన.63ను జారీ చేసింది. అయితే దాని అమలు మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మారింది. పాఠశాలల్లో వ్యాయామ విద్యను తప్పనిసరిగా అమలుచేయాల్సి ఉంది. ముఖ్యంగా 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు వ్యాయామ విద్య పీరియడ్‌లను తప్పనిసరిచేశారు. కానీ ఎక్కడా అమలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు.

క్రీడల నిర్వహణకు నిధుల కొరత...
పాఠశాలల్లో క్రీడల నిర్వహణకు నిధుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసే అరకొర నిధులు క్రీడల నిర్వహణకు ఏ మాత్రం సరిపోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్‌వీఎం విడుదల చేస్తున్న పాఠశాల నిధుల నుంచే ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో క్రీడా పరికరాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. చాలా వరకు పాఠశాలల్లో హెచ్‌ఎంలు క్రీడాసామగ్రి కొనడానికి చొరవ చూపడం లేదు. దీంతో పాఠశాలలో క్రీడలు ఆడిపించడం కేవలం నామమాత్రంగా కొనసాగుతుంది.

నిధులు కేటాయిస్తేనే క్రీడాభివృద్ధి
పాఠశాలల్లో క్రీడాభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి. కొన్నేళ్లుగా క్రీడాసామగ్రి లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు క్రీడల పట్ల అవగాహన కల్పించాలి. ప్రతి ఉన్నత పాఠశాలలో పీఈటీ ఉండాలి. సంఖ్యతో నిమిత్తం లేకుండా పీఈటీ పోస్టులను పీడీలుగా అప్‌గ్రేడ్‌ చేయాలి. పీఈటీలకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలి.
– దూమర్ల నిరంజన్, టీజీపీఈటీఏ జిల్లా అధ్యక్షుడు

మరిన్ని వార్తలు