పెచ్చులూడుతున్న పైకప్పు

6 Sep, 2016 19:23 IST|Sakshi
ఊచలు తేలిన పాఠశాల వరండా
  • శిథిలావస్థకు చేరిన వైమాందాపూర్‌ ప్రాథమిక పాఠశాల భవనం
  • భయాందోళన చెందుతున్న విద్యార్థులు, టీచర్లు
  • పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
  • కొల్చారం: మండలంలోని ఏటిగడ్డ మాందాపూర్‌లో ప్రాథమిక పాఠశాల కొనసాగుతోంది. నాలుగు గదుల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆంగ్ల మాధ్యమం ఒకటో తరగతిలో 22 మంది విద్యార్థులున్నారు. పాఠశాల భవనం పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. భవనం ఏ క్షణంలోనైనా కూలడానికి సిద్ధంగా ఉంది.

    గదుల్లోని పైకప్పులు, వరండాలో పెచ్చులూడిపడుతున్నాయి. ఇనుప ఊచలు తేలి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. వర్షం వచ్చిందంటే పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నారు. గత పది సంవత్సరాల నుంచి పాఠశాల భవనానికి మరమ్మతులు చేయడం లేదు. పాఠశాల దుస్థితిని ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రత్యక్షంగా చూపించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

    అదనపు గది నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెబుతున్నా అమలు చేయడం లేదు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రమాదం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

    అధ్వానంగా...
    మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. కొత్త భవనం నిర్మిస్తామని అధికారుల చెబుతున్నా మంజూరు చేయడం లేదు. కనీసం మరమ్మతులు చేపట్టిన దాఖలాలు లేవు. ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలి. - దుర్గయ్య, వైమాందాపూర్‌

    అధికారులు స్పందించాలి
    పాఠశాలలో అన్ని వసతులు, మంచి ఉపాధ్యాయులున్నారు. పాఠశాల భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి నెలకొంది. మా పిల్లలు భయపడుతున్నప్పటికీ గత్యంతరం లేక పంపిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. - సురేష్‌, ఎస్‌ఎంసీ వైస్‌చైర్మన్‌

    దారుణంగా ఉంది
    ప్రస్తుతం పాఠశాల భవనం పరిస్థితి దారుణంగా ఉంది. వర్షం పడితే గదుల్లోకి నీళ్లు చేరుతున్నాయి. పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. భయం భయంగానే పాఠాలు చెబుతున్నాం. ఈ విషయాన్ని అధికారులకు చెబుతూనే ఉన్నాం. - దేవరాజ్‌, హెచ్‌ఎం

మరిన్ని వార్తలు