మా స్కూలు.. మా ఇష్టం!

14 Aug, 2016 19:43 IST|Sakshi
మా స్కూలు.. మా ఇష్టం!

సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేటు పాఠశాలల్లో పాలక మండళ్ల ఏర్పాటు నేతిబీర చందంగా మారింది. స్వయంగా పాఠశాల విద్యాశాఖ ఉత్వర్వులిచ్చినా.. ప్రైవేటు బడుల యాజమాన్యాలు పెడచెవిన పెడుతున్నాయి. గడువు దాటి నెలలు గడుస్తున్నా ఇంతవరకు అన్ని స్కూళ్లు మండళ్లు ఏర్పాటు చేయలేదు. ప్రతి ప్రైవేటు పాఠశాలలో పాలక మండలి తప్పనిసరిగా ఉండాలి. ఇదే విషయాన్ని సర్కారు నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి అన్ని ప్రైవేటు బడుల్లో పాలక మండళ్లు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ గత మే నెలలో ఆదేశించింది.

ఇందుకు సంబంధించిన జాబితాను డీఈఓ కార్యాలయంలో అందజేయాలని గట్టిగా చెప్పినా.. ప్రైవేటు యాజమాన్యాల్లో కదలిక లేకుండా పోయింది. ఫలితంగా ఇష్టారాజ్యంగా ఫీజలు వసూలు చేసుకోవడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా యాజమన్యాలు చూసుకున్నాయి. పాఠశాల పరంగా తీసుకునే పలు కీలక నిర్ణయాలకు పాలక మండళ్ల ఆమోదం అనివార్యం. అన్ని పాఠశాలల్లో జూన్‌ 13వ తేదీలోపు ఏర్పాటు చేసి ఆ వివరాలను జిల్లా విద్యాశాఖాధికారికి పంపించాలని ఉత్తర్వుల్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కిషన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ డీఈఓ సోమిరెడ్డి... డిప్యూటీ ఈఓలు, డిప్యూటీ ఐఓఎస్‌లకు ఆదేశాలిచ్చారు.

అయితే పాలక మండళ్లు విధిగా ఏర్పాటు చేయాలని యాజమాన్యాలపై విద్యాశాఖ అధికారులు ఒత్తిడి తేవడంలో తీవ్రంగా విఫలమయ్యారని తెలుస్తోంది. ‘ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు పాలక మండళ్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రైవేటు స్కూళ్లకు సమాచారం చేరవేశాం. ఏ పాఠశాల కూడా అందుకు ఆసక్తి చూపలేదు. పాలక మండళ్లు లేకున్నా తమకొచ్చే ఇబ్బందులు ఏం ఉండవన్న భావనలో ఉన్నారు. పైగా ఫీజులు అధికంగా వసూలు చేసుకోవచ్చని, ఒకవేళ పాలక మండళ్లు ఉంటే ఫీజులపై నియంత్రణ వస్తుంది. దీంతో తమకేదీ గిట్టదని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. మేం సమాచారమిచ్చి మమ అనిపించడం తప్ప చేసిందేమీ లేదు. వారి నుంచి స్పందన రాదని మాకు ముందే తెలుసు. మేం ఒత్తిడి తెచ్చేందుకు యత్నించినా.. మాపై వేరేవిధంగా ఒత్తిళ్లు మొదలయ్యాయి’ అని విద్యాశాఖకు చెందిన ఓ అధికారి వివరించారు.
ఇప్పటికీ 70 శాతమే..
పాలక మండలిలో తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఈ మండలి ఆధ్వర్యంలోనే ఫీజులను నిర్ణయిస్తారు. దీని ప్రకారమే తల్లిదండ్రులు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతటి కీలకమైన పాలక మండళ్లను విద్యాశాఖ ఇచ్చిన గడువు జూన్‌ 13 నాటికి ఒక్క స్కూల్‌ కూడా ఏర్పాటు చేసుకున్న దాఖలాలు లేవు. జిల్లా విద్యాశాఖాధికారులు పలుమార్లు హెచ్చరించడంతో కొన్ని యాజమాన్యాలు మండళ్లు ఏర్పాటు చేశాయి. అదీ గడువుల మీద గడువులు ఇవ్వడంతో సాధ్యమైంది. నగరంలో 2 వేలకు పైగా ప్రైవేటు పాఠశాలలు ఉండగా.. ఇందులో 70 శాతం స్కూళ్ల వరకు మండళ్లను ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసుకున్నాయని సమాచారం. ఇంకొన్ని బడులు మొండికేశాయి. ఇటువంటి యాజమాన్యాల కోసం ఆయా మండలాల వారీగా ఈనెల 20వ తేదీలోగా ఏర్పాటు చేసి వివరాలు అందజేయాలని తుది గడువు అధికారులు ఇచ్చారు. ‘దాదాపు అన్ని ప్రైవేటు పాఠశాలలు పాలక మండళ్లు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఎంత శాతం అనేది ఇప్పుడే చెప్పలేం. రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో ఏర్పాటవుతాయి. మండళ్ల ఏర్పాటుకు విముఖత చూపిన స్కూళ్ల గుర్తింపు రద్దు చేస్తామని ముందే హెచ్చరించడంతో స్పందన లభించింది’ అని హైదరాబాద్‌ డీఈఓ సోమిరెడ్డి పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు