కొండలరాయుడికి తేళ్ల నైవేద్యం

23 Aug, 2016 03:48 IST|Sakshi
కొండలరాయుడికి తేళ్ల నైవేద్యం

– కోడుమూరులో వింత ఆచారం
– దశాబ్ధాలుగా కొనసాగిస్తున్న భక్తులు


కోడుమూరు రూరల్‌: ఆలయాల్లో దేవుళ్లకు పండ్లు, పాలు, పాయసాన్ని నేవేధ్యంగా పెట్టడం ఆనవాయితీ. అయితే ఇందుకు అతీతంగా కోడుమూరు కొండపై వెలసిన కొండల రాయుడికి ఆ ప్రాంత ప్రజలు తేళ్లను పట్టుకుని స్వామివారిపై వదిలి నేవేద్యంగా సమర్పిస్తున్నారు. ఏటా శ్రావణమాస మూడో సోమవారం రోజు ఈ వింత ఆచారాన్ని పట్టణ ప్రజలు దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. విషపురుగులైన తేళ్లను చూస్తే ఎక్కడైనా ప్రజలు ఆమడదూరం పరుగెడుతుంటారు.

ఇక్కడి కొండమీద మాత్రం భక్తులు చిన్న చిన్న రాళ్లను ఎత్తుతూ వాటికింద ఉండే తేళ్లను ఎలాంటి జంకుగొంకులేకుండా చేతులతో పట్టుకొని శ్రీకొండలరాయుడికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. సోమవారం సాయంత్రం పట్టణ ప్రజలు వేలాదిగా కొండపైకి చేరుకొని శ్రీకొండలరాయుడికి ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారి దర్శనార్థం వచ్చిన ప్రజలకు శ్రీలక్ష్మీవెంకటేశ్వర ఆలయ చైర్మన్, భారతి సిమెంట్‌ డిస్ట్రిబ్యూటర్‌ ఎద్దుల మహేశ్వరరెడ్డి అల్పాహారం, వాటర్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కోడుమూరు ఎస్‌ఐ మహేష్‌కుమార్‌ బందోబస్తు నిర్వహించారు.

మరిన్ని వార్తలు