రాజుకుంటున్న భూ వివాదం

9 Sep, 2017 10:19 IST|Sakshi
రాజుకుంటున్న భూ వివాదం

సీలింగ్‌ భూములు తిరిగి లాక్కుంటున్నారు..
దివానం వారసులపై గిరిజనుల ఆరోపణ


అశ్వారావుపేట: అశ్వారావుపేట మండల పరిధిలోని నారంవారిగూడెం స్టేజీ వద్ద ప్రభుత్వం కొందరు గిరిజనులకు పట్టాలిచ్చిన భూమిని సీలింగ్‌లో కోల్పోయిన జమీన్‌ వారసులు కబ్జా చేశారని, తిరిగి గిరిజనులకు అప్పగించడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం వివాదాస్పద భూమి వద్ద పట్టాలున్న గిరిజనులు విలేకరులకు వెల్లడించిన వివరాలు వారి మాటల్లోనే... 1998లో నారంవారిగూడెం వద్ద 43 ఎకరాల దివానం భూమి సీలింగ్‌లో ప్రభుత్వం తీసుకుని అదే గ్రామానికి చెందిన 17 మంది గిరిజనులకు పట్టాలిచ్చారు. ఒక్కో గిరిజన రైతుకు అర ఎకరం నుంచి 6 ఎకరాల వరకు వేర్వేరుగా పట్టాలిచ్చారు. పట్టాదారు పాస్‌బుక్‌లు కూడా ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వం పట్టాలయితే ఇచ్చింది కానీ భూమిని తిరిగి దివానం వారసులు డీకే మహిపాల్, మాజీ జెడ్పీటీసీ జూపల్లి కోదండ వెంకటరమణారావు వ్యవసాయం చేసుకుంటున్నారని చెబుతున్నారు.

రూ.2 వేలు కౌలు ఇస్తున్నాం..
ఎకరాకు ఏడాదికి రూ.2 వేలు మాత్రమే కౌలుగా చెల్లిస్తున్నాం. ఐదేళ్లుగా కౌలు ఇవ్వకపోవడంతో వ్యవసాయం చేయనివ్వకుండా అడ్డుకున్నట్లు గిరిజనులు చెబుతున్నారు. ఉన్నట్టుండి శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి వచ్చి భూమిని దున్నుతుండగా అడ్డుకోవడంతో తమపై పోలీసులకు ఫిర్యాదు చేయించారని, దీంతో అసలు విషయాన్ని పత్రికల ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు.

బాధితులు వీరే..
1998లో జారీ చేసిన పట్టాల ప్రకారం నారంవారిగూడెం రెవెన్యూ గ్రామంలోని 1/70 యాక్టు పరిధిలోని సర్వే నంబరు 453లో కిన్నెర సీతమ్మకు అర ఎకరం, మనుగొండ ముత్యాలుకు అర ఎకరం, మనుగొండ బుచ్చమ్మకు 5 ఎకరాలు 3 కుంటలు, నల్లగుండ్ల లక్ష్మికి అర ఎకరం, నల్లగుండ్ల కృష్ణవేణికి అర ఎకరం, ఎదిరాజు వెంకమ్మకు ఎరకం  మనుగొండ దుర్గయ్యకు 6 ఎకరాలు, సర్వే నంబరు 385లో గుళ్ల అనంతకు అర ఎకరం, నల్లగుండ్ల మహాలక్ష్మికి అర ఎకరం, మనుగొండ  నరసమ్మకు 1.2 ఎకరాలు ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి లాక్కున్నారని ఆరోపిస్తున్నారు. ఏళ్లు తరబడి  పట్టాదారు పాస్‌పుస్తకాలు మాకు అందకుండా అధికారులను మేనేజ్‌ చేశారని, తహసీల్దార్‌ కార్యాలయంలో వెతికి మా పాస్‌ పుస్తకాలు మేం సంపాదించుకున్నామన్నారు. తమకు జరిగిన అన్యాయానికి అధికారులకు చెప్పుకుందామని వెళ్లినా రాజకీయ ప్రాబల్యంతో మా గోడు వినట్లేదని అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి  భూములు అప్పగించాలని కోరుతున్నారు.

 భూముల జోలికి పోలేదు: డీకే మహిపాల్‌
నారంవారిగూడెంలో మా తాతల కాలం నుంచి మా కుటుంబ అనుభవంలో ఉన్న భూములను సీలింగ్‌లో ప్రభుత్వానికి అప్పగించిన మాట వాస్తవమే. కానీ సర్వే నంబరు 453లో మాకు సెంటు భూమి మిగలకుండా వదిలేశాం. ప్రస్తుతం నా పేర ఉన్న పట్టా సర్వే నంబరు 353 లోనిది. వాటర్‌ ట్యాంకు నిర్మించిన స్థలం  పొలంలోనిదే.  ఆరోపణల్లో  వాస్తవం లేదు.

విచారణ నిర్వహిస్తాం: యలవర్తి వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌
 సీలింగ్‌ భూమిని  ఆక్రమించుకున్నారనే ఆరోపణ మా దృష్టికి వచ్చింది. వీఆర్వో, ఆర్‌ఐలను భూమి వద్ద సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశిస్తాను. ఎవరికీ అన్యాయం జరుగకుండా 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం.

మరిన్ని వార్తలు