డబుల్ స్థలాల కోసం అన్వేషణ

22 Jun, 2016 09:16 IST|Sakshi
డబుల్ స్థలాల కోసం అన్వేషణ

గ్రేటర్‌లో లక్ష ఇళ్లకు స్థలాల కొరత
ఇప్పటివరకు 254 ఎకరాల గుర్తింపు
మురికివాడలపై ప్రభుత్వం దృష్టి
వాటిని ఖాళీ చేయించి.. పున ర్‌నిర్మించే దిశగా కసరత్తు

శివార్లలోని 8 నియోజకవర్గాల్లో 554.25 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని అధికార యంత్రాంగం తేల్చింది.

దీంట్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 287.87 ఎకరాలు, జీహెచ్‌ఎంసీ అవతల 254.37 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు.

మురికివాడల స్థానే కొత్తగా డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అడ్డగుట్టలో ఈ ప్రయోగం చేసింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రేటర్‌లో లక్ష ఇళ్ల నిర్మాణం.. ఈ హామీ బల్దియాపై టీఆర్‌ఎస్ జెండా ఎగరడానికి కారణమైంది. పేదల సొంతింటి కల నెరవేర్చడానికి జీహెచ్‌ఎంసీలో ఈ ఏడాది లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తాం.. అని ప్రభుత్వం ప్రకటించింది. అంతే  బడుగుల నుంచి దరఖాస్తుల వెల్లువలా వచ్చాయి. ‘రెండు పడక గదుల ఇళ్ల’ కోసం ఏకంగా ఐదు లక్షల వరకు అర్జీలు ప్రభుత్వం వద్దకు చేరాయి. నగర పీఠం దక్కించుకోవడంలో కీలకంగా మారిన ఈ పథకం ఇప్పుడు అధికార యంత్రాంగానికి చెమటలు పట్టిస్తోంది.

పేదల ఆశలసౌధానికి స్థలాలు లభించకపోవడంతో గల్లీగల్లీని జల్లెడ పడుతోంది. మురికివాడల ప్రజలను చైతన్య పరచడం ద్వారా బహుళ అంతస్తు భవనాలను నిర్మించాలనే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆధునిక హంగులు, మౌలిక వసతులను కల్పించడం ద్వారా మురికివాడ రహిత నగరంగా మలచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే మురికివాడల స్థానే కొత్తగా డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్లను ప్రతిపాదిస్తోంది. ఇప్పటికే అడ్డగుట్టలో ప్రయోగాత్మకంగా నిర్మించింది. ఇదే ఎత్తుగడను మిగతా ప్రాంతాల్లోనూ అమలు పరిచేదిశగా అడుగులు వేస్తోం ది. దీంట్లో భాగంగా ఇటీవల జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో బల్దియా యంత్రాంగం సర్వే నిర్వహించింది.

254 ఎకరాలే..
శివార్లలోని 8 నియోజకవర్గాల్లో 554.25 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని తేల్చింది. దీంట్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 287.87 ఎకరాలు, జీహెచ్‌ఎంసీ అవతల 254.37 ఎకరాలు ఉన్నట్లు గుర్తించింది. కొన్ని భూములపై వివాదాలున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ఈ మేరకు గ్రేటర్ యంత్రాంగం ఇచ్చిన జాబితాను పరిశీలించిన రెవెన్యూ అధికారులు దీంట్లో చాలావరకు వివాదస్పద భూములే ఉన్నట్లు తేల్చారు. న్యాయపరమైన చిక్కులు, ఇతరత్రా వివాదాలు నెలకొన్న భూములను గ్రేటర్ అధికారులు ప్రతిపాదించిన జాబితాలో ఉన్నట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో జాబితాను నిశితంగా పరిశీలించిన రెవెన్యూ అధికారులు.. ప్రాథమికంగా కేవలం 281.81 ఎకరాల భూ లభ్యతపై స్పష్టత నిచ్చారు. వీటిలో అత్యధికంగా ఇబ్రహీంపట్నం నియోజకవ ర్గం గుర్రంగూడ పరిధిలోని సర్వే నం.92లో 117.27 ఎకరాలను డబుల్ ఇళ్లకు ప్రతిపాదించారు. అలాగే  కౌకూరు, ఉప్పల్, అహ్మద్‌గూడలో మాత్రమే స్థలాల లభ్యత ఉందని నిర్ధారించారు. స్థలాల కొరతను విశ్లేషిస్తున్న ప్రభుత్వం.. మురికివాడ ల ప్రజలను ఒప్పించడం ద్వారా ఖాళీ చేయించి.. ఆ ప్రాంతంలో జీ+9 లేదా జీ+14 అంతస్తుల బహుళ అంతస్తుల భవన సముదాయాలను నిర్మించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై మురికివాడల్లోని పేదలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహిస్తోంది.

మరిన్ని వార్తలు