ఉద్యమాలతోనే హక్కుల పరిరక్షణ

3 Feb, 2017 01:12 IST|Sakshi
ఉద్యమాలతోనే హక్కుల పరిరక్షణ

అంతర్జాతీయ గని కార్మిక మహాసభలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌

గోదావరిఖని: ప్రపంచవ్యాప్తంగా కార్మికోద్యమాల ద్వారానే హక్కుల పరిరక్షణ జరుగుతుం దని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. అంతర్జాతీయ గని కార్మికుల రెండో మహాసభ సందర్భంగా గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి జీఎం కాలనీ గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించారు. హరగోపాల్‌ మాట్లాడుతూ అనేక పోరాటాలు, నాయకులు, విప్లవకారులు, కార్మికుల ప్రాణత్యాగాల ఫలితంగానే హక్కులు పుట్టుకొచ్చాయని, వాటిని పరిరక్షించేం దుకు నిరంతరం ఉద్యమిస్తూనే ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా గతంలో పెట్టుబడిదారులు కార్మికులను జలగల్లా పీడించేవారని, కార్మిక శక్తికి భయపడి కొన్ని హక్కులను ప్రకటించారన్నారు. అయితే వాటిని కాపాడుకునేలా కార్మిక సంఘాలు ప్రయత్నించాలని, కొత్త హక్కుల కోసం పోరాడాలని సూచించారు. 19, 20వ శతాబ్దాలలో పెట్టుబడి అంతా కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిందని, కార్మికుడు దేశసరిహద్దులు దాటలేని పరిస్థితి ఏర్పడగా.. పెట్టుబడి మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లగలిగే మార్పు ఏర్పడిందన్నారు.

 60 శాతం పెట్టుబడి ప్రపంచంలో ఉన్న ఒక్కశాతం మంది చేతుల్లో ఉందని, వారే రాజ్యాల్ని నడిపిస్తున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నేడు 95 శాతం మంది అసంఘటిత రంగంలో ఉన్నారని, వారికి వేతనాలు లేవని, భద్రత లేదని, నాయకత్వం వహించే వారే లేరన్నారు. సంఘటిత రంగానికి నాయకత్వం వహిస్తున్న వారే అసంఘటిత రంగాన్నీ చేతబూనాలని కోరారు. గని కార్మికులు గనుల్లోకి వెళ్లి బొగ్గు, ఇతర సహజ వనరులను వెలికితీసి దేశ అభివృద్ధికి పాటుపడుతూ సంపదను సృష్టిస్తుంటే.. పెట్టుబడిదారులు, రాజ్యాలు ఆ సంపదను కార్మికుడికి అందకుండా చేస్తున్నాయని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఈ నేపథ్యంలో కార్మికుడు ప్రశ్నించడం మొదలు పెట్టాలని, అప్పుడే పెట్టుబడిదారులు, రాజ్యాలు శ్రమజీవులపై దాడులు చేయడం ఆపివేస్తాయని, ఈ ఉద్యమం సంఘటితంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పోరాటం మరువలేనిదని, అదే సమయంలో ఓసీలకు వ్యతిరేకంగా కార్మికలోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జీవన విధ్వంసాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీసేలా ప్రారంభిస్తున్న ఓసీలను ఆపే లా ఉద్యమాలు రావాలన్నారు. కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా, ఉద్యోగ భద్రత కోసం, హక్కు ల పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు నిర్వహించాలని, ఇందుకు అంతర్జాతీయ గని కార్మికుల మహాసభ దోహదపడుతుందనే నమ్మ కం ఉందని హరగోపాల్‌ స్పష్టం చేశారు. మహా సభ జాతీయ సన్నాహక కమిటీ చైర్మన్‌ పి.కె. మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో వివిధ యూనియన్లకు చెందిన నాయకులు, విదేశీ ప్రతి నిధులు బి.ప్రదీప్‌కుమార్, సాదినేని వెంకటేశ్వరరావు, డాక్టర్‌ అపర్ణ, డాక్టర్‌ పటోలే, అండ్రియాస్, టి.సూర్యం, టి.శ్రీనివాస్, కె.విశ్వనాథ్, బి.సంపత్‌కుమార్, ఇ.నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు