ఆర్టీసీ ఎన్నికల్లో సీక్రెట్ బ్యాలెట్

26 Jan, 2016 23:19 IST|Sakshi

- ఫిబ్రవరి 9న తుది ఓటరు జాబితా..
-18న పోలింగ్, కౌంటింగ్
- మార్చి 4న అధికారికంగా ఫలితాలు వెల్లడి


సాక్షి, విజయవాడ బ్యూరో : ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరగనుంది. ఒక్కో ఓటరు రెండు ఓట్లు వేయనున్నారు. తెల్ల రంగు బ్యాలెట్(క్లాజ్ 3) రాష్ట గుర్తింపునకు, గులాబి రంగు బ్యాలెట్(క్లాజ్ 6) జిల్లా గుర్తింపునకు ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన మార్గదర్శకాలను కార్మిక శాఖ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 13జిల్లాల్లోను ప్రస్తుతం ఉన్న 57,800ఓటర్లకు సంబంధించిన జాబితాలను ఈ నెల 29న అన్ని డిపోల్లోను ముసాయిదా ఓటరు జాబితాలను ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీలోపు దానికి సంబంధించిన అభ్యంతరాలు స్వీకరించనున్నారు. 6వ తేదీన అభ్యంతరాల పరిశీలన చేస్తారు. బదిలీలు, పదవి విరమణ, వృతులకు సంబంధించిన ఓట్లను తొలగింపులు, చేర్పులు, మార్పులు చేసి ఫిబ్రవరి 9న తుది ఓటరు జాబితాలను ఆర్టీసీ డిపోల వారీగా ప్రకటిస్తారు.

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ మొత్తం కార్మిక శాఖ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు. ఎన్నికల సిబ్బందికి, సామాగ్రి చేరవేతకు ఆర్టీసీ బస్సులను సమకూర్చాల్సి ఉంటుంది. ఆయా డిపోల పరిధిలోని డిపో మేనేజర్లు ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చూడాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 18న ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు డిపోలవారీగా పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 6గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నేరుగా ఓటు హక్కు వినియోగించుకోలేని పోలింగ్ సిబ్బంది, ఆఫీసు సిబ్బంది, ఉద్యోగులు, అధికారులు ఫిబ్రవరి 23, 24తేదీల్లో పోస్టల్ బ్యాలెట్‌ను అందజేయవచ్చు. ఆ రెండు రోజుల్లోను ఏ రోజు వచ్చిన పోస్టల్ బ్యాలెట్‌లను అదే రోజు లెక్కిస్తారు. పోలింగ్ రోజునే ఓట్ల లెక్కింపుతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సంఘం ఏమిటన్నది తేలిపోనుంది. అయితే మార్చి 4 ఉదయం 11గంటలకు గుర్తింపు సంఘం ఏమిటన్నది అధికారికంగా ప్రకటించనున్నారు.

మరిన్ని వార్తలు