సారికది ఆత్మహత్యే కానీ..

8 Nov, 2015 04:50 IST|Sakshi
సారికది ఆత్మహత్యే కానీ..

♦ నిందితుల వేధింపుల వల్లే అఘాయిత్యానికి పాల్పడింది
♦ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు
♦ అనుమానాస్పద మృతిగా పేర్కొనే సెక్షన్ 174 తొలగింపు
♦ బెయిల్ కోసం రాజయ్య పిటిషన్.. 12కు వాయిదా పడ్డ విచారణ
 
 వరంగల్ లీగల్/సాక్షి, హన్మకొండ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల మృతి కేసులో పోలీసులు కోర్టుకు శనివారం రిమాండ్ రిపోర్టు సమర్పించారు. సారికది ఆత్మహత్యగానే భావిస్తున్నామని, అయితే భర్త అనిల్, మామ రాజయ్య, అత్త మాధవి, అనిల్ రెండో భార్య సనా వేధింపుల వల్లే జీవితంపై విరక్తి చెంది ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. వేధింపులు తాళలేక సారిక తన బెడ్‌రూమ్‌లోకి గ్యాస్ సిలిండర్లు, పిల్లలను తీసుకువెళ్లిందని, లోపలి నుంచి గడియ పెట్టుకొని గ్యాస్ లీక్ చేసి నిప్పంటించుకుందని తెలిపారు.

ఘటన వెలుగుచూసిన తర్వాత పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 498 ఏ(వరకట్న వేధింపులు), 306(ఆత్మహత్యకు ప్రేరేపించడం), సీఆర్‌పీసీ సెక్షన్ 174(అనుమానాస్పద మృతి) కింద కేసు నమోదు చేశారు. కానీ తాజాగా కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో మాత్రం సెక్షన్ 174ను చేర్చకపోవడం గమనార్హం. సారిక తల్లి లలిత, సోదరి అర్చనతో సహా చుట్టుపక్కల నివసించే ముగ్గురు వ్యక్తులు, రాజయ్య కారు డ్రైవర్లు ముగ్గురు, వివిధ గ్రామాలకు చెందిన రెవెన్యూ అధికారులను కలిపి మొత్తం 24 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. అనిల్, రాజయ్య, మాధవి.. సారికను ఒంటరిని చేసి వేధించారని వివరించారు. అనిల్ సనా అనే మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు.

 రాజయ్య బెయిల్ పిటిషన్
 రాజయ్య, ఆయన భార్య మాధవి శనివారం జిల్లా కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. విచారణ నిమిత్తం కేసును రెండో అదనపు జిల్లా కోర్టుకు కేటాయించారు. పోలీసులు పేర్కొన్న విధంగా సారికపై తామెలాంటి వేధింపులకు పాల్పడలేదని రాజయ్య తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు... ఘటన జరిగిన ఇంట్లో తాము ఉండటం లేదని పేర్కొన్నారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా ఈ నెల 3న సాయంత్రం ఇంట్లోకి వచ్చామని, వేధింపులకు గురిచేసే అవకాశం గానీ, ఆత్మహత్యకు ప్రేరేపించే అవకాశం గానీ లేదని పేర్కొన్నారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 12కు వాయిదా పడింది.

 సనాను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం
 సంఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా కేసులో కీలక నిందితురాలైన అనిల్ రెండో భార్య సనాను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. ప్రత్యేక పోలీసు బృందాలతో ఆమె కోసం గాలిస్తున్నామని చెబుతున్నా.. పురోగతి కనిపించడం లేదు. అలాగే ఫోరెన్సిక్, క్లూస్‌టీమ్‌కు సంబంధించిన నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. ఇవేవీ రాకుండానే సారికది ఆత్మహత్య అన్నట్టుగా పోలీసులు వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు