‘ముచ్చుమర్రి’తో సీమ సస్యశ్యామలం​

2 Jan, 2017 23:26 IST|Sakshi
‘ముచ్చుమర్రి’తో సీమ సస్యశ్యామలం​
– సామాజిక, కుటుంబ వికాసానికి ప్రాధాన్యం
– తడకనపల్లె గ్రామానికి సీఎం వరాల జల్లు
– నాల్గవ విడత జన్మభూమి– మన ఊరు ప్రారంభం 
– రూ. 1766 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
కల్లూరు/కల్లూరు రూరల్‌ : ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రామ సర్పంచ్‌ గంగుల వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన నాల్గో విడత జన్మభూమి– మన ఊరు కార్యక్రమాన్ని సోమవారం తడకనపల్లె గ్రామం నుంచి సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా తడకనపల్లె గ్రామ శివారులో రూ. 2 కోట్లతో నిర్మితమైన పశు వసతి కేంద్రాన్ని, ఓర్వకల్లు మండలం గ్రామజ్యోతి ప్రాజెక్టును జెండా ఊపి ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రాన్ని ప్రారంభించి చెరువు కట్టపై ఏర్పాటుచేసిన జన్మభూమి సభకు చేరుకున్నారు. వివిధ శాఖలు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. చెరువు కట్టమీద ఏర్పాటు చేసిన రూ. 1766 కోట్ల అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ కేక్‌ను కట్‌ చేశారు.
 
తడకనపల్లె పాలకోవాకు ప్రసిద్ధి
 గ్రామ సర్పంచ్‌ అధ్యక్ష నిర్వహించిన సభలో.. చంద్రబాబు నాయుడు మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీరందిస్తున్నామని, డెల్టాకు వెళ్లాల్సిన నీటిని ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా సీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. భూమి, నీరు, విద్యుత్‌ పుష్కలంగా ఉంటే పరిశ్రమలు తరలివస్తాయని తెలిపారు. ఇప్పటికే ఓర్వకల్లు మండలంలో వేలాది ఎకరాలను ఏపీఐఐసీకి పరిశ్రమల స్థాపనకు కేటాయించామని తెలిపారు. కర్నూలు జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పశువుల వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కేంద్రం ద్వారా తడకనపల్లె పాలకోవా రాష్ట్ర ప్రసిద్ధి చెందాలని ఆకాంక్షించారు. తడకనపల్లె, వామ సముద్రం, ఓబుళాపురం, తండ గ్రామాల ప్రజలకు వరాల జల్లు కురిపించారు. గ్రామంలో 250 ఎకరాలలో సేంద్రియ వ్యవసాయం కింద కూరగాయలు సాగుచేయడం శుభపరిణామం అన్నారు.
 
ప్రతీ కుటుంబానికి ఓ సెల్‌ఫోన్‌..

 

కుటుంబ, సామాజిక వికాస సూత్రాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులకు సీఎం సూచించారు. ఫైబర్‌ గ్రిడ్‌ సౌకర్యం అందించి డిజిటల్‌ గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. సెల్‌ఫోన్, రూపే కార్డు, ఏటీఎం కార్డులు వినియోగించి 100 శాతం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్నారు. ప్రతి కుటుంబానికి ఒక సెల్‌ ఫోన్‌ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఒక్కొక్క సెల్‌ను రూ. 1000 సబ్సిడీ కింద అందించాలన్నారు. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలని, మండల ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ చేయాలని  జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. పశుసంవర్ధఖ శాఖ ఆధ్వర్యంలో 300 పశువులకు పరిపడే 4 షెడ్లను ఏర్పాటుచేశామని, గ్రామంలోని రైతులు ఈ షెడ్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న ఎంపీటీసీ సభ్యుడు మర్రి శేఖర్, అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎంపీ టీజీ వెంకటేష్, జెడ్పీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, మాజీ మంత్రులు ఏరాసు ప్రతాప్‌ రెడ్డి, కేఈ ప్రభాకర్, కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్, జేసీ హరికిరణ్, ఎంపీపీ వాకిటి మాధవి, జెడ్పీటీసీ సభ్యురాలు సరస్వతమ్మ, ఎంపీటీ సభ్యుడు మర్రి శేఖర్, ఐఏఎస్‌ అధికారి జగన్నాథం, పాలడైరీ నిర్వాహకురాలు జుబేదాబీ పాల్గొన్నారు. కార్యక్రమం వాఖ్యాతగా యాగంటీశ్వరప్ప వ్యవహరించారు.
మరిన్ని వార్తలు