సీమ బంద్‌ సక్సెస్‌

25 May, 2017 08:03 IST|Sakshi
సీమ బంద్‌ సక్సెస్‌
 – డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
– స్వచ్ఛందంగా వాణిజ్య, ప్రభుత్వ కార్యాలయాల మూసివేత
– శాంతియుతంగా ధర్నా చేస్తున్న సీపీఎం, సీపీఐ నాయకుల అరెస్టు
– రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే సీఎంకు గుణపాఠం తప్పదని హెచ్చరిక
 
కల్లూరు (రూరల్‌)/కర్నూలు(కొండారెడ్డిఫోర్టు): రాయలసీమలో  కరువు నివారణ చర్యలు చేపట్టడంలో  రాష్ట్ర ప్రభుత్వం  పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందంటూ సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌ చేపట్టిన బంద్‌ విజయవంతమైంది. ఉదయం ఆరు గంటల నుంచి ధర్నాలు, రాస్తారోకోలు, బైక్‌ ర్యాలీలతో నిరసనకారులు కదం తొక్కారు.  ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా  ఆటోలు మధ్యాహ్నం వరకు రోడ్డుపైకెక్కలేదు. దీంతో   ప్రయాణికులకు కాలినడక తప్పలేదు. వాణిజ్య సమూదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. చిరువ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. 
 
బస్టాండ్‌ కేంద్రంగా నిరసనలు హోరు...
ఉదయం ఆరు గంటల నుంచి బస్టాండ్‌ పరిసరాలు సీపీఎం, సీపీఐ నాయకులు నినాదాలతో హోరెత్తాయి. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్రప్రధాన కార్యదర్శి మనోహర్‌ మాణిక్యం, సీపీఐ నగర కమిటీ కార్యదర్శి రసూల్‌ ఆధ్వర్యంలో నిరసన కారులు బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలను కదలనివ్వలేదు. దుకాణాలను బంద్‌ చేయించి బస్టాండ్‌ నుంచి చౌరస్తా వరకు ర్యాలీలు నిర్వహించారు.
 
పుర్రెలతో నిరసన...
 కర్నూలు చౌరస్తాలో సీపీఎం, సీపీఐ నాయకులు  వినూత్నంగా పుర్రెలతో నిరసన తెలిపారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో రైతులకు చివరికి పుర్రెలే మిగిలాయని చెప్పారు.  మరోవైపు చౌరస్తా నుంచి బస్టాండ్, రాజ్‌విహార్, పాతబస్టాండ్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తిరిగి అక్కడి నుంచి బస్టాండ్‌ వరకు ర్యాలీ కొనసాగింది. మరోవైపు ఉభయ కమ్యూనిస్టులు గుంపులు గుంపులుగా విడిపోయి నగరంలో బైక్‌ ర్యాలీలను నిర్వహించారు. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయించి సర్కారుపై తమ నిరసన తెలిపారు.
 
ఆందోళనకారుల అరెస్టు...
ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో బస్టాండ్‌ నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్‌ ఆధ్వర్యంలో రాజ్‌విహార్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ శాంతి యుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు అడ్డుకొని బలవంతంగా అరెస్టు చేసి రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రామకృష్ణ, గఫూర్‌తోపాటు మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. 
 
బాబు రాజధాని జపం చేస్తున్నారు ..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడేళ్ల పరిపాలన కాలంలో రాజధాని అమరావతి జపం చేస్తూ రాయలసీమను తీవ్ర అన్యాయం చేశారని సీపీఎం కేంద్ర కమిటీసభ్యుడు ఎంఏగఫూర్‌ విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర  కూడా కల్పించలేకపోయారని ధ్వజమెత్తారు. వరుస కరువుల నుంచి జిల్లాను  గట్టెక్కించడంలో విఫలమయ్యారని విమర్శించారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇవ్వలేదన్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేక  రైతులు, కూలీలు వలస బాట పటా​‍్టరని చెప్పారు. పట్టిసీమను ఏడాదిలోపు పూర్తి చేసిన ప్రభుత్వం జిల్లాలో ఏళ్ల తరబడి సాగుతున్న పెండింగ్‌ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు.  సీమలో శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టకపోతే   ఆందోళన కార్యక్రమాలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 
 
మరిన్ని వార్తలు