ఆ 570 కోట్ల రూపాయల నగదు మాదే

14 May, 2016 17:51 IST|Sakshi
ఆ 570 కోట్ల రూపాయల నగదు మాదే

విశాఖపట్నం: తమిళనాడులో కంటెయినర్లలో తరలిస్తుండగా పట్టుబడిన 570 కోట్ల రూపాయల నగదుపై మిస్టరీ వీడింది. ఈ డబ్బు తమదేనని విశాఖపట్నం ఎస్బీఐ-ఎస్సీఏ బ్రాంచ్ అధికారులు చెప్పారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఈ నగదును తెప్పిస్తున్నట్టు తెలిపారు.

నగదు కావాలని ఈ నెల 11న రిజర్వ్బ్యాంక్ను కోరామని, కోయంబత్తూరులో అందుబాటులో ఉండటంతో అక్కడి నుంచి విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్టు బ్యాంక్ అధికారులు తెలిపారు. విమానంలో డబ్బు తీసుకురావడానికి చాలా ఇబ్బందులున్నాయని, దీంతో ఎస్కార్టుతో రోడ్డు మార్గంలో నగదు తీసుకురావాలని నిర్ణయించినట్టు చెప్పారు. డబ్బును తరలించేందుకు విశాఖపట్నం నుంచే ఎస్కార్టును పంపించామని తెలిపారు. తమిళనాడు పోలీసులకు డబ్బుకు సంబంధించిన ఆధారాలిచ్చామని బ్యాంక్ అధికారులు వెల్లడించారు.

తమిళనాడులో తిరుపూరు జిల్లా పెరుమనలూరు - కునత్తూరు బైపాస్‌రోడ్డులో ఈ నగదు దొరికిన విషయం తెలిసిందే. ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తుండగా మూడు కంటెయినర్లలో రూ. 570 కోట్ల నగదు పట్టుబడింది.

మరిన్ని వార్తలు