ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధంకావాలి

28 Aug, 2016 20:00 IST|Sakshi
ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధంకావాలి
మోత్కూరు/యాదగిరిగుట్ట : కాలు పట్టుకునే సంస్కృతి కాకుండా మాదిగ యువతీ, యువకులు, విద్యార్థులు ఆత్మగౌరవ పోరాటం చేయడానికి సిద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ పిడమర్తి రవి పిలుపు ఇచ్చారు. ఆదివారం మోత్కూరు రహదారి బంగ్లాలో, యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 22 సంవత్సరాల మాదిగ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ జాతి కాలు మొక్కే సంస్కృతిని ఇచ్చాడని ప్రపంచంలో ఏసామాజిక హక్కులు, ఉద్యమాలు కాళ్లు పట్టుకుంటే రాలేదని కాలర్‌ పట్టుకుంటేనే సాధించారని అన్నారు. 27 జిల్లా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కమిటీల ఏర్పాటు అనంతరం అక్టోబర్‌లో అలాయ్‌బలాయ్‌ కార్యక్రమాన్ని నవంబర్‌లో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశంలో ఏబీసీడీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేసినా.. కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందన్నారు. సకల జనులకు జేఏసీగా ఉన్న కోదండరాం ఏ కులానికి మద్దతు ప్రకటించకుండా మోసం చేశారని ఆరోపించారు. ప్రాజెక్టులతో ప్రజలు నష్టపోతున్నారని అంటున్న కోదండరాంను ఏ కులం న్యాయం కోసం పోరాడుతున్నావు అని ఆయన ప్రశ్నించారు. వర్గీకరణ అయినా తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా కలిసి నూతన ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ కింద ఇప్పటి వరకు 4,500మందికి రూ.45కోట్లు సంక్షేమ ఫలాలు అందాయని, ఇంకా 20వేల మందికి త్వరలోనే వస్తాయన్నారు. 
జిల్లా జేఏసీ అధ్యక్షుడి ఎన్నిక
నూతన యాదాద్రి జిల్లా మాదిగ జేఏసీ అధ్యక్షుడిగా యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామానికి చెందిన డప్పు వీరస్వామిని నియమించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్‌ చైర్మన్‌ నియామక పత్రాన్ని అందజేశారు. అంతకు ముందు పిడమర్తి రవిని స్థానిక నాయకులు సన్మానించారు. యాదాద్రి క్షేత్రంలో ఎస్సీ సత్రం నిర్మించాలని కోరారు. దీనిపై ఆయన స్పందిస్తు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. ఈ సమావేశంలో తుంగతుర్తి నియోజకవర్గ జేఏసీ ఇన్‌చార్జి దాసరి ప్రవీణ్, గద్దల అంజిబాబు, ఎర్రబెల్లి కృష్ణ, కూరెళ్ల దాసు, మందుల కృష్ణ, పులిగిల నర్సింహ, చేడె మహేందర్, మధు, కృష్ణ, తొంట నవీన్, ఆదిత్య, మహేష్, నరేష్, నాగరాజు, యాదగిరిగుట్ట సర్పంచ్‌ బూడిద స్వామి,  పులెపాక అశోక్, సుర్పంగ పాండు,  కొన్నె వెంకటేష్, గ్యాదపాక బాలనర్సయ్య, నమిలె ఆంజనేయులు, మొగిలిపాక మహేందర్, పులెపాక వెంకటేష్‌ తదితరులున్నారు.
 
మరిన్ని వార్తలు