సీనియర్‌ రెసిడెంట్ల కౌన్సెలింగ్‌ గందరగోళం

5 Aug, 2016 23:08 IST|Sakshi
సీనియర్‌ రెసిడెంట్ల కౌన్సెలింగ్‌ గందరగోళం
 
గుంటూరు మెడికల్‌ : గుంటూరు వైద్య కళాశాలలో శుక్రవారం జరిగిన సీనియర్‌ రెసిడెంట్ల కౌన్సిలింగ్‌లో గందరగోళం ఏర్పడింది.  మేనేజ్‌మెంట్‌ కోటాకు, కన్వీనర్‌ కోటాకు ప్రత్యేకంగా సీనియర్‌ రెసిడెంట్ల కౌన్సెలింగ్‌ నిర్వహించి ఎక్కడ పని చేయాలనే విషయాన్ని ఆర్డర్‌ ద్వారా ఇస్తామని అధికారులు చెప్పడంతో పీజీ వైద్యులు ఆందోళన చేశారు. మెరిట్‌ ప్రకారం కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్నారు. కౌన్సెలింగ్‌ బాయ్‌కాట్‌ చేసి డీఎంఈకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీనియర్‌ రెసిడెంట్లుగా ఏడాదిపాటు పనిచేసేలా అధికారులు సిద్ధమవడంతో బాయ్‌కాట్‌ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఉదయం 10 గంటలకు ప్రారంభమవ్వాల్సిన కౌన్సెలింగ్‌ 12 గంటల వరకు నిలిచిపోయింది.  ప్రభుత్వం సీనియర్‌ రెసిడెంట్‌లకు నెలనెలా గౌరవ వేతనంగా అందజేసే నిధులు విడుదలకు బడ్జెట్‌ లేవనే సాకుతో ప్రైవేటు వైద్య కళాశాలల్లో పని చేయించాలని చేస్తోందని వైద్యులు వాపోయారు. సీనియర్‌ రెసిడెంట్‌లను ప్రైవేటు వైద్య కళాశాలల నిర్వాహకులు రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియమించుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు కళాశాలల్లో పని చేయబోమని స్పష్టం చేశారు. వైద్యుల ఆందోళనతో స్పందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. గతంలో మాదిరిగానే కౌన్సెలింగ్‌ నిర్వహించాలని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుబ్బారావుకు ఆదేశాలిచ్చారు. దీంతో మధ్యాహ్నం నుంచి కౌన్సెలింగ్‌ యథావిధిగా కొనసాగింది. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజునాయుడు, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఫర్నీకుమార్, జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజీవ్, ఇతర అధికారులు కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. 
వైద్యులకు మద్దతు తెలిపిన అప్పిరెడ్డి
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కౌన్సెలింగ్‌కు వచ్చి వైద్యులకు మద్దతు తెలిపారు. ఎలాంటి జీవో విడుదల చేయకుండా ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ వైద్యులను నియమించాలనుకోవడం దారుణమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విధానాన్ని  సహించబోమని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా కౌన్సెలింగ్‌ నిర్వహించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.  
 
మరిన్ని వార్తలు