ఉన్మాదికి ఉరిశిక్ష

23 Dec, 2016 02:43 IST|Sakshi
ఉన్మాదికి ఉరిశిక్ష

మూడున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేసిన దుర్మార్గుడు
కరీంనగర్‌ జిల్లా అత్యాచార నిరోధక ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు
చాక్లెట్లు కొనిస్తానంటూ బాలికను తీసుకెళ్లిన వెంకటస్వామి
అత్యాచారం చేసి, గొంతు నులిమి హత్య
ఆ దుష్టుడికి ఉరిశిక్షే సరైనదని నిర్ణయించిన న్యాయమూర్తి

కరీంనగర్‌ క్రైం/కాటారం: అన్నెం పున్నెం ఎరుగని ఓ మూడున్నరేళ్ల చిన్నారిని కాటేసిన దుర్మార్గుడికి ఉరిశిక్ష పడింది. చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టి, ఆపై గొంతు నులిమి చంపేసిన ఈ మానవ మృగాన్ని మరణించే వరకూ ఉరి తీయాల్సిందిగా కరీంనగర్‌ అత్యాచార నిరోధక ప్రత్యేక కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది.జయశంకర్‌ జిల్లా కాటారం మండలం దామెరకుంటకు చెందిన ఓ మూడున్నరేళ్ల బాలిక స్థానిక అంగన్‌వాడీ పాఠశాలలో చదివేది. 2016 ఫిబ్రవరి 27న సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి వస్తున్న ఆ చిన్నారిని, ఆమె అక్కను.. వారి ఇంటి వెనకాలే నివాసముండే జక్కుల వెంకటస్వామి (30) పిలిచాడు. చాక్లెట్లు కొనిస్తానంటూ మభ్య పెట్టి.. వెంట ఉన్న అక్కను అక్కడి నుంచి పంపిం చేశాడు. తర్వాత చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి.. రాక్షసంగా అత్యాచారం చేశాడు. తర్వాత పాప గొంతు నులిమి హత్య చేశాడు. ఇంటికి తాళం వేసి పారిపో యాడు. సాయంత్రం పొలం పనులు చేసుకొని ఇంటికి వచ్చిన తల్లికి చిన్న కుమార్తె కనిపించలేదు.

దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. మరుసటి రోజు ఉదయం పెద్ద కుమార్తెను వివరంగా అడగగా.. వెంకటస్వామి చాక్లెట్‌ కొనిస్తానంటూ తీసుకెళ్లాడని చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు వెంకటస్వామి ఇంటి కిటికీలు తెరిచిచూశారు. లోపల ఓ మూలన కోళ్లను కమ్మే గంప పక్కన చిన్నారి బట్టలు కనిపించాయి. ఇంటి తాళం పగల గొట్టి, లోనికి వెళ్లి చూస్తే.. గంప కింద రక్తసిక్తమైన చిన్నారి మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిన్నా రిపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఐపీసీ 302, 376, ఫోక్సా యాక్ట్‌ 6 కింద క్రైం నంబర్‌ 28/2016తో కేసు నమోదు చేశారు. మార్చి 5న జక్కుల వెంకటస్వా మిని అరెస్టు చేయగా.. ఇప్పటివరకు రిమాండ్‌లో ఉన్నాడు. కరీంనగర్‌లోని బాలికలపై అత్యాచారాల నిరోధక ప్రత్యేక జిల్లా కోర్టు ఈ కేసును.. పలు దఫాలుగా విచారించింది. 11 మంది సాక్ష్యం, ఇతర ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి సురేశ్‌.. వెంకట స్వామిని దోషిగా నిర్ధారించారు. అతడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

మా బిడ్డ ఆత్మకు శాంతి చేకూరుతుంది
‘‘అల్లారుముద్దుగా పెంచుకున్న మా బిడ్డను ఆ దుర్మార్గుడు పొట్టన పెట్టుకున్నాడు. నిత్యం మా బిడ్డ జ్ఞాపకాలతోనే బతుకుతున్నాం. ఇలాంటి పరిస్థితి మరే తల్లిదండ్రులకూ రావద్దు. దేవుడిని, చట్టాన్ని నమ్ముకున్నాం. వాడికి ఉరిశిక్ష పడింది, మా బిడ్డ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరుతుంది..’’  – బాధిత చిన్నారి తల్లిదండ్రులు

మరిన్ని వార్తలు