బిరదవోలు హడలు

16 Jul, 2016 19:02 IST|Sakshi
బిరదవోలు హడలు

అడవిలో వెలుగుచూస్తున్న హత్యలు
పొదలకూరు : మండలంలోని బిరదవ లు గుండెలు అదురుతున్నాయి. సమీప అటవీ ప్రాంతంలో మృతదేహాలు వెలుగుచూస్తున్నాయి. ఎక్కడో హత్యలు చేసి, ఇక్కడ పడేసిపోతుండంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. గత రెండేళ్ల కాలంలో నాలుగు హత్యోదంతాలు వెలుగులోకి వచ్చా యి.  ఈ ప్రాంతంలో పగటి వేళల్లోనే నర సంచారం తక్కువగా ఉంటుంది. అలాంటిది రాత్రి వేళల్లో ఆటోల్లో వచ్చి శవాలను పడేస్తున్నారు. 2014 మే 24వతేదీన బిరదవోలు పంచాయతీ బ్రాహ్మణపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తీసుకువచ్చి ముళ్లకంపతో తగులబెట్టారు. శవం సగం కాలి మొండెం మిగిలింది. అప్పట్లో ఈ ప్రాంతంలో సగం కాలిన మృతదేహం గుర్తింపు సంచనలం రేపింది. అయితే ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించి చిన్న క్లూ కూడా లభ్యం కాలేదు. కేసులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. మన్ మిస్సింగ్ కేసు కూడా చుట్టుపక్కల పోలీసుస్టేషన్లలో నమోదు కాకపోవడంతో పోలీసులు చేతులెత్తేశారు.

తర్వాత అదే ఏడాది డిసెంబర్ 30వ తేదీన మండలంలోని ఉలవరపల్లికి చెందిన భాగ్యలక్ష్మి దారుణ హత్యకు గురై మృతదేహం ఇదే అటవీ ప్రాంతంలో బయటపడింది. 2014లోనే 35 ఏళ్ల గిరిజన యువకుడు బిరదవోలు పంచాయతీ చీకిరేనితిప్ప అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తాజాగా బ్రాహ్మణపల్లి శ్మశానానికి సమీపంలోని పొదల్లో కోళ్ల వ్యాపారి వద్ద కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్న గోవర్ధన్ మృతదేహాన్ని గుర్తించడం సంచలం కలిగిస్తోంది. దీంతో ఈ ప్రాంత వాసులు బెంబేలెత్తుతున్నారు. హతుడు గోవర్ధన్ జేబులో గుర్తింపు కార్డులు ఉండడం వల్ల పోలీసులు మృతదేహాన్ని వెంటనే గుర్తుపట్టారు. గతంలో జరిగిన ఘటనల్లో మృతదేహాలను గుర్తించేందుకు పోలీసులకు సమయం పట్టింది. వీటన్నింటిని పరిశీలిస్తే నేరాలు చేసేందుకు నేరస్తులు ఇక్కడి అటవీప్రాంతాన్ని అనువుగా ఎంచుకుంటున్నారు.
 
మండలంలోని బ్రాహ్మణపల్లి శ్మశానానికి సమీపంలో హత్య చేసి పడేసిన పీవీఆర్ చికెన్స్ కలెక్షన్ ఏజెంట్ గోవర్ధన్ మృతదేహాన్ని ఆత్మకూరు డీఎస్పీ సుబ్బారెడ్డి శుక్రవారం పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో క్లూస్ కోసం ప్రయత్నించారు. పోలీసు అధికారులు ప్రాథమికంగా గోవర్ధన్‌ది హత్యగానే భావిస్తున్నారు. సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై ప్రసాద్‌రెడ్డి ద్వారా డీఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గూడూరు-1 టౌన్ పోలీస్‌స్టేషన్‌లో గోవర్ధన్‌కు సంబంధించి మిస్సింగ్ కేసు నమోదు కావడంతో డీఎస్పీ వారితో కూడా మాట్లాడారు. మృతదేహానికి పోస్టుమార్టం  నిర్వహించేందుకు నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 
పోలీసు జాగిలం రాక
గోవర్ధన్ హత్య కేసును ఛేదించేందుకు పోలీసు అధికారులు జాగిలాన్ని రప్పించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జాగిలం మృతదేహం పడి ఉన్న చుట్టుపక్కల ప్రాంతంలో కలియ తిరిగింది. అనంతరం మనుబోలు మార్గంలో కొంత దూరం వెళ్లి నిలిచిపోయింది. దీన్ని బట్టి హంతకులు మనుబోలు మీదుగా మృతదేహాన్ని వాహనంలో తీసుకు వచ్చి బ్రాహ్మణపల్లి వద్ద పడేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా