-

పన్ను ఎగ్గొడితే కఠిన చర్యలు

1 Mar, 2017 00:19 IST|Sakshi
– ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ జగదీష్‌బాబు
 
కర్నూలు (రాజ్‌విహార్‌): సంపాదనపై ఆదాయ పన్నును ఎగ్గొడితే కఠిన చర్యలు తప్పవని ఆదాయపన్ను శాఖ కర్నూలు రేంజ్‌ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఎం. జగదీష్‌ బాబు హెచ్చరించారు. మంగళవారం స్థానిక కప్పల్‌ నగర్‌లోని తనిష్‌ కన్వెన్షన్‌లో ఆదాయ పన్నుపై కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల (రేంజ్‌) వ్యాపారులు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్, చార్టెడ్‌ అకౌంటెంట్లు, పన్ను చెల్లింపు దారులు, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల సదస్సులో ఆయన మాట్లాడారు. వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక వేత్తలు ఆదాయానికి తగ్గట్లు చెల్లింపులు తప్పని సరి అన్నారు. నల్లధనం, లెక్కలు చూపని ఆదాయంపై ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన–2016 (పీఎంజీకేవై) కింద పన్ను చెల్లించాలన్నారు. వారిపై ఎలాంటి దాడులు ఉండవన్నారు.
 
పైగా ఈ పథకం కింద చెల్లించే పన్ను సొమ్మును పేద, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు చెప్పారు. మార్చి 31లోపు పన్నులు చెల్లించని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ తరువాత నెల రోజుల్లో ప్రిన్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి ఫారం–2 జారీ అవుతుందన్నారు. ట్యాక్సు, సర్‌చార్జీ, పెనాల్టీతోపాటు లెక్కల్లో చూపని ఆదాయంలో కనీసం 25శాతం రిజర్వు బ్యాంకు ఆధీకృత బ్యాంకుల్లో జమ చేయాలన్నారు. ఈ పథకం కింద వెల్లడించిన విషయాలను ఆదాయపన్ను, ఇతర ఏ చట్టాలకు సాక్ష్యాలుగా తీసుకోవన్నారు. వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక తదితర రంగాల్లో రాణించే వ్యక్తులు ఐటీ హోల్డర్లుగా మారాలని సూచించారు. ఏటా తమ ఆదాయ, జమ, ఖర్చుల వివరాలు వివరిస్తూ రిటర్న్స్‌ దాఖలు చేయాలన్నారు. సమావేశంలో కర్నూలు, అనంతపురం అడిషనల్‌ కమిషనర్‌ మల్లికార్జునరావు (కడప ఇన్‌చార్జ్‌), కేఈ.సునీల్‌బాబు, ట్యాక్స్‌ బార్స్‌ అధ్యక్షులు జి. బుచ్చన్న, ఎస్‌ఐఆర్‌సీ చైర్మన్‌ కెవి కృష్ణయ్య పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు