సర్వర్ల మొరాయింపు.!

16 Jun, 2017 00:01 IST|Sakshi
సర్వర్ల మొరాయింపు.!

– మీ–సేవ కేంద్రాల్లో నిండుకున్న స్టేషనరీ
– ఇబ్బందుల్లో  రైతులు, విద్యార్థులు


అసలే ఖరీఫ్‌ సీజన్‌.. పంట రుణాల రెన్యూవల్‌ చేసుకునే మాసం.. ఆపై పిల్లలను  పాఠశాలలకు చేర్పించే సమయం.. ఇలాంటి కీలక సమయంలో ప్రభుత్వ సర్వర్లు సతాయిస్తున్నాయి. ఇది చాలదన్నట్లు మీ– సేవ కేంద్రాల్లో స్టేషనరీ నిండుకుంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఇటు రైతులు, అటు విద్యార్థులు తమకు కావాల్సిన సర్టిఫికెట్లు పొందేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
- ధర్మవరం

కేస్‌ స్టడీ..
ముదిగుబ్బ మండలం యర్రగుంటపల్లికి చెందిన రైతు పంట రుణాన్ని రెన్యూవల్‌ చేసుకునేందుకు అవసరమైన 1బీ, అడంగల్‌ తీసకునేందుకు మీ–సేవ కేంద్రానికి వెళ్లారు. అక్కడ సర్వర్‌ బిజీగా ఉందని చెప్పడంతో సాయంత్రం వరకూ కూర్చొన్నాడు. అయినా ఫలితం లేకపోవడంతో చేసేది లేక ఇంటికెళ్లిపోయాడు. ఇలా మూడ్రోజులుగా తిరుగుతున్నా పనిజరగడం లేదు.  

కేస్‌ స్టడీ..
ధర్మవరం పట్టణానికి చెందిన ఈశ్వరయ్య తన కూతురిని పాఠశాలలో చేర్పించేందుకు గాను కులం, ఆదాయం ధ్రువ్రీకరణ పత్రం కోసం మీ సేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకునేందుక ప్రయత్నించాడు. అక్కడ స్టేషనరీ లేదని చెప్పడంతో..  మరో కేంద్రానికి వెళ్లాడు..అక్కడా లేకపోవడంతో అనంతపురం వెళ్లి నాలుగైదు సెంటర్లు తిరిగి సర్టిఫికెట్లను తీసుకుని వచ్చాడు.

ఖరీఫ్‌ 2017–18కు గాను జిల్లా వ్యాప్తంగా 6,26,339 మంది రైతులు తమ పంట రుణాలు రెన్యూవల్‌ చేయాల్సి ఉంది. వీరందరూ రుణాలను రెన్యూవల్‌ చేసే సమయంలో తప్పనిసరిగా తమ భూమి వివరాలు చూపే 1బీ – అండగల్‌ను బ్యాంకులకు సమర్పించాల్సి ఉంది. ప్రస్తుతం అన్ని సర్టిఫికెట్లూ ఆన్‌లైన్‌ ద్వారానే ఇస్తుండటంతో ఈ 1బీ–అడంగల్‌ను మీ సేవ కేంద్రాల ద్వారా మాత్రమే పొందాల్సి ఉంటుంది. జిల్లాలో ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించే మీ సేవ కేంద్రాలు 259 ఉన్నాయి.

కార్వే సంస్థ ద్వారా నిర్వహించే మీ సేవ కేంద్రాలు మరో 140 దాకా ఉన్నాయి. వీటి ద్వారానే జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరు రైతులు 1బీ–అండగల్‌ను పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సర్వర్లు డౌన్‌ కావడంతో ఒక్కో మీ సేవ కేంద్రం నుంచి సగటున రోజుకు 30 కూడా 1బీ–అండగల్‌లను ఇవ్వలేకపోతున్నారు. ఈ లోపు పంట రుణాల రెన్యూవల్‌ గడువు ముగిసిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గడువు పెంచాలని కోరుతున్నారు.  ఈ విషయమై మీ సేవ కేంద్రాల అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్, ఏపీ ఆన్‌లైన్‌ అధికారులను భాస్కర్‌బాబు, హరివర్థన్‌లను వివరణ కోరగా.. సర్వర్‌ సమస్యకు తామేమీ చేయలేమన్నారు. స్టేషనరీ కొరత ఉన్నట్లు తమ దృష్టికి కూడా వచ్చిందన్నారు.

మరిన్ని వార్తలు