ఇదేమి బాదుడు

20 Jun, 2017 23:30 IST|Sakshi
ఇదేమి బాదుడు
– నగదు రహిత లావాదేవీలపై సర్వీస్‌ చార్జీలు 
– 0.75 నుంచి 2 శాతం వరకూ వసూళ్లు 
– ఆర్టీసీ టిక్కెట్లు బుక్‌ చేసినా బాదుడే 
– నగదు రహిత లావాదేవీలపై ప్రజల విముఖత 
– ఏటీఎంలలో నగదు నిల్వలు నిల్‌ 
సాక్షి, రాజమహేంద్రవరం:  రూ. వెయ్యి, రూ. 500 నోట్ల చెలామణి రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించిన నగదు రహిత లావాదేవీలపై ప్రస్తుతం విముఖత వ్యక్తమవుతోంది. నగదు రహిత లావాదేవీలపై సర్వీస్‌ చార్జీలు వసూలు చేయడమే ఇందుకు కారణం. పెట్రోలు కొనుగోలు మినహా ఇతర అన్ని సేవలు, వస్తు కొనుగోళ్లపై ఆయా డెబిట్, క్రెడిట్‌ కార్డుల బ్యాంకులు సర్వీస్‌ చార్జీలు వసూలు చేస్తున్నాయి. డిసెంబర్‌లో పెద్ద నోట్లు రద్దు తర్వాత రెండు నెలలపాటు ఏటీఎం విత్‌డ్రాలు, నగదు రహిత సేవలపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్వీస్‌ చార్జీలు రద్దు చేసిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థ బ్యాంకులు తరువాత అంతకుముందులాగే సర్వీస్‌ చార్జీలు వసూలు చేయడం ప్రారంభించాయి. లావాదేవీల మొత్తం ఆధారంగా 0.75 శాతం నుంచి 2 శాతం వరకూ సర్వీస్‌ చార్జీలు వేస్తున్నారు. ఫలితంగా వినియోగదారులు నగదు రహిత సేవలపై విముఖంగా ఉన్నారు.
ఆర్టీసీ టిక్కెట్లు కొన్నా బాదుడే... 
పెట్రోలు మినహా ఇక ఏ సర్వీస్‌ పొందినా, ఏ వస్తువు కొనుగోలు చేసి కార్డు ద్వారా నగుదు చెల్లిస్తే మాత్రం సర్వీస్‌ చార్జీ చెల్లించుకోవాల్సిందే. చివరకు ఆర్టీసీ టిక్కెట్లు నగదు రహిత లావాదేవీ రూపంలో కొనుగోలు చేసినా సర్వీస్‌ చార్జీ బాదుడు సరేసరి. రూ.2000 లోపు నగదు రహిత లావాదేవీలపై 0.75 శాతం ఆపై గరీష్టంగా 2 శాతం సర్వీస్‌ చార్జీ రూపంలో బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఉదహరణకు రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌ టిక్కెట్లు రూ.600 అనుకుంటే దానిపై రూ.5 (0.75శాతం) సర్వీస్‌ చార్జీ అదనంగా తీసుకుంటున్నారు. ఏదైనా రూ.30,000 విలువైన ఎలక్ట్రానిక్‌ వస్తువు కొనుగోలు చేసి నగదు కార్డుల ద్వారా చెల్లించాలంటే రూ. 600 (2 శాతం) సర్వీస్‌ చార్జీ అవుతుందని ఆయా దుకాణాల క్యాష్‌ కౌంటర్‌లో ముందుగానే చెబుతున్నారు. దీంతో కొనుగోలుదారులు కార్డుల ద్వారా చెల్లించాలన్న తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నారు. అప్పటికప్పుడు ఏటీఎంల వద్దకు పరిగెడుతున్నారు. ఏటీఎంలలో కనిష్టంగా రూ. 20,00, గరిష్టంగా రూ.40,000 వస్తున్నాయి. ఒకసారి ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తే బ్యాంకులకు చెల్లించాల్సిన సర్వీస్‌ చార్జీ రూ.30లోపు ఉంటోంది. అన్ని బ్యాంకులు తమ కార్డుదారులకు నెలకు ఐదుసార్లు లావాదేవీల వరకు ఎలాంటి సర్వీస్‌ చార్జీలు వేయడంలేదు. రూ.30,000 మొత్తం నగదు రహితంగా చెల్లిస్తే రూ.600 సర్వీస్‌ చార్జీ అవుతుంది. అదే ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తే రూ.30 లేదా అసలే చార్జీ ఉండదు. దీంతో ప్రజలు తాము కొనుగోలు చేసిన వస్తువుల చెల్లింపులను నగదు రూపంలో ఇచ్చేందుకే మొగ్గుచూపుతున్నారు.
ఏటీఎం.. ఎనీ టైం నో మనీ...
వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత నగదు కోసం ఏటీఎంల వద్దకు పరిగెడుతున్న ప్రజలకు ఏటీఎంల వద్ద నో క్యాష్, ఆవుట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ వంటి బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని ఏటీఎంలో ఆయా బ్యాంకులు పెడుతున్న నగదు కొద్ది గంటల్లోనే అయిపోతోంది. జిల్లాలో 811 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అధికారిక లెక్కల ప్రాకారం దాదాపు 60 శాతం ఏటీ ఎంలలో మాత్రమే నగదు నిల్వలు ఉంటున్నాయి. వీటిలో కూడా 24 గంటలూ నగదు ఉండే ఏటీఎంలు 10 శాతం కూడా లేవు. బ్యాంకుల వద్ద ఉన్న ఏటీఎంలలో మాత్రమే 24 గంటలు నగదు ఉంటోంది. జిల్లాలో ప్రతి రోజు అన్ని బ్యాంకులు దాదాపు రూ.500 కోట్ల లావాదేవీలు జరుపుతున్నాయి. ఇందులో ఆర్టీజీఎస్, నెఫ్ట్‌ ద్వారా జరిగే లావాదేవీలు దాదాపు 70 శాతంగా ఉన్నాయి. వస్తు,సేవలకు ప్రజలు నగదు రహిత లావాదేవీలు దాదాపు 10 శాతం జరుగుతున్నాయి. 
సర్వీస్‌ చార్జీలు లేనప్పుడు 75 శాతం నగదు రహితమే..
పెద్దనోట్ల రద్దు సమయంలో సర్వీస్‌ చార్జీలు ఎత్తివేసినప్పుడు ప్రతి రోజు మేము చేసే వ్యాపారంలో 75 శాతం కార్డుల ద్వారానే నగదు తీసుకున్నాం. ప్రస్తుతం సర్వీస్‌ చార్జీలు వసూలు చేస్తుండడతో వ్యాపారంలో కనీసం 10 శాతం కూడా కార్డుల ద్వారా లావాదేవీలు జరగడం లేదు. రెండు శాతం సర్వీస్‌ చార్జీలు అని కస్టమర్లకు చెప్పడంతోనే నగదు తెస్తామంటూ ఏటీఎంల వద్దకు వెళుతున్నారు. 
– రత్నాకర్, శ్రీ కంప్యూటర్‌ వరల్డ్, రాజమహేంద్రవరం. 
సేవలకు సర్వీస్‌ చార్జీలు తప్పనిసరి 
పెద్దనోట్ల రద్దుకు ముందు నుంచే నగదు రహిత లావాదేవీలపై సర్వీస్‌ చార్జీలు ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు అనంతరం రెండు నెలలపాటు కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం యథాతథంగా సర్వీస్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ టిక్కెట్లు నగదు రహిత లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే నామమాత్రపు సర్వీస్‌ చార్జీలు వేస్తున్నారు. జిల్లాలో దాదాపు 60 శాతం ఏటీఎంలు పని చేస్తున్నాయి. కొన్ని ఏటీఎంలలో నగదు పెట్టిన కొద్ది గంటల్లోనే అయిపోతున్నాయి. 
– సుబ్రమణ్యం, జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్, కాకినాడ.
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా