వీఆర్వోలకు టైం సెట్ చేయండి: హైకోర్టు

26 Jan, 2016 19:36 IST|Sakshi

గామ రెవిన్యూ అధికారి (వీఆర్‌ఓ) ప్రతీ గ్రామంలో నిర్ధిష్ట సమయం మేర ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టు సూచించింది. ఇందుకు గాను గ్రామస్థాయిలో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, రెండు మూడు గంటలు వీఆర్‌ఓ ఆ గ్రామంలో సమయం వెచ్చించేలా చూడాలంది. తద్వారా కూడా రెవిన్యూశాఖలో అవినీతి నిరోధించడానికి వీలవుతుందని అభిప్రాయపడింది.

రెవిన్యూ, విద్యుత్‌శాఖలో అవినీతి నిరోధానికి కోర్టు సహాయకులు (అమికస్ క్యూరీ)గా ఉన్న సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి ఇచ్చిన సూచనలు, సలహాలు బాగున్నాయని, వాటిని అమలు చేసే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రభుత్వానికి తెలిపింది. అలాగే అవినీతి నిరోధానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది.

ఈ మొత్తం వ్యవహారంలో తగిన సూచనలు, సలహాలతో ముందుకు రావాలని ప్రభుత్వాన్ని కూడా ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.


మహబూబ్‌నగర్ జిల్లాలో రెవిన్యూ అధికారులు ఒక్కో పనికి ఒక్కో రేటును నిర్ణయించుకుని, ఆ మేర రైతుల నుంచి వసూలు చేస్తున్నారంటూ పత్రికల్లో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది.

ఈ సందర్భంగా ఈ కేసులో కోర్టు సహాయకులుగా నియమితులైన సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి అవినీతి నిరోధానికి కొన్ని సూచనలు, సలహాలను రాతపూర్వకంగా కోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం, ఇవి చాలా బాగున్నాయని, ఇందుకు తాము సత్యంరెడ్డిని అభినందిస్తున్నామని తెలిపింది.

దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ స్పందిస్తూ, అందరి సూచనలు, సలహాలను తీసుకుని వారిపై ప్రభుత్వంతో చర్చించి, పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతాని ఆయన తెలిపారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ, ప్రభుత్వం కూడా సూచనలు, సలహాలతో రావాలంటూ విచారణను వాయిదా వేశారు.


అమికస్ క్యూరీ చేసిన సూచనలు, సలహాలు :
- గ్రామస్థాయిలో వీఆర్‌ఓ కీలక అధికారి. అయితే అతను గ్రామస్తులకు అందుబాటులో ఉండటం లేదు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో అతనికి ఓ ఆఫీసు ఉండాలి. నిర్ధిష్ట సమయాల్లో అక్కడకు వచ్చేలా చూస్తే గ్రామస్తులు అతన్ని కలిసేందుకు అవకాశం ఉంటుంది. వీఆర్‌ఓ గ్రామాలకు రావడం అరుదుగా జరుగుతోంది. వారు మండల కేంద్రాల్లోనే ఉంటున్నారు. వారంలో ఓ రోజు మినహా మిగిలిన రోజుల్లో మండల కేంద్రానికి రాకుండా వీఆర్‌ఓపై నిషేధం విధించాలి.


- వీఆర్‌ఓ తప్పనిసరిగా గ్రామంలోనే నివాసం ఉండాలి. మండలంలో నివశిస్తున్న వ్యక్తినే వీఆర్‌ఓగా నియమించాలి. వీఆర్‌ఓల విద్యార్హత కనీసం ఇంటర్‌గా నిర్ణయించాలి. మండల పరిధి నుంచి వీఆర్‌ఓను బదిలీ చేయరాదు. రెవిన్యూ ఇన్‌స్పెక్టర్లు వారంలో ఓ రోజు నిర్ధిష్ట సమయంలో గ్రామాన్ని సందర్శించాలి. రైతుల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించాలి. అంతేకాక సమస్యలకు సంబంధించి వీఆర్‌ఓ ఓ రిజిష్టర్‌ను నిర్వహించేలా చూడాలి. గ్రామ సందర్శనకు వచ్చినప్పుడు రెవిన్యూ ఇన్‌స్పెక్టర్లు ఈ రిజిష్టర్‌ను తప్పక పరిశీలించాలి.


- రైతులకు సహాయ సహకారాలు అందించేందుకు గ్రామ వ్యవసాయాధికారి పోస్టును సృష్టించాలి. అతను గ్రామంలోనే నివశించేలా చూడాలి. తహసీల్దార్ రెండు నెలకు ఓసారి గ్రామాన్ని సందర్శించేలా చూడాలి. రైతుల ఫిర్యాదులను పరిష్కరించేలా చూడాలి.


- అమ్మకపు లావాదేవీలు జరిగినప్పుడు రికార్డుల్లో యాజమాన్యపు హక్కు వివరాలను నిర్ధిష్ట కాల పరిమితిలోపు పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలి. అలాగే రికార్డుల కోసం రైతులు దరఖాస్తులు చేసుకున్నప్పుడు నిర్ధిష్ట కాల పరిమితి లోపు వాటిని వీఆర్‌ఓ అందచేయాలి.


- మండల స్థాయిలో ఉన్న మీ సేవా కేంద్రాలను గ్రామస్థాయిలకు విస్తరించాలి. అన్ని దృవీకరణ పత్రాలు ఇందులో లభించేలా చూడాలి.


- అసంపూర్తిగా ఉందన్న సాకుతో రైతులు పెట్టుకునే దరఖాస్తులను తిరస్కరించరాదు. దరఖాస్తును భర్తీ చేసేందుకు పంచాయతీ కార్యాలయాల్లో తగిన ఏర్పాట్లు చేయాలి. అన్ని కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేయాలి.


- వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ కనెక్షన్ కోసం రైతులు దరఖాస్తు చేసుకుంటే అధికారులు దానిని రిజిస్టర్ చేసుకుని నెంబర్ కేటాయించాలి. రెండు నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తి కావాలి. రైతుల నుంచి ఎటువంటి ఫీజు వసూలు చేయకూడదు.


- బోరుకు, విద్యుత్ స్తంభానికి మధ్య దూరం ఉందంటూ రైతుల దరఖాస్తును తిరస్కరిస్తున్నారు. స్తంభాల బాధ్యత విద్యుత్ శాఖదే కాబట్టి, వారు రైతుల దరఖాస్తులను తిరస్కరించడానికి వీల్లేదు.


- ట్రాన్స్‌ఫార్మర్ల రిపేర్ల విషయంలో రైతుల నుంచి ఎటువంటి డబ్బు వసూలు చేయరాదు. రైతులకు ఉచితంగా రిపేర్లు చేయాలి. అది కూడా నిర్ధిష్ట సమయంలోపు జరగాలి.


- రైతులకు సంబంధించి వ్యవసాయ కనెక్షన్ల విషయంలో మండల స్థాయిలో అసిస్టెంట ఇంజనీర్ ఉండాలి. ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి గ్రామాన్ని వారికి ఒకసారి సందర్శించాలి. ప్రతీ గ్రామంలో కనీసం ఓ లైన్‌మెన్ ఉండాలి. అతను ఆ గ్రామంలోనే నివసిస్తుండాలి. చేసిన పనికి డబ్బు వసూలు చేయకుండా లైన్‌మెన్లను నిరోధించాలి.

>
మరిన్ని వార్తలు