జిల్లాలో 24 కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటు

18 Apr, 2017 20:10 IST|Sakshi
జిల్లాలో 24 కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటు
 నల్లజర్ల : యాంత్రీకరణపై రైతుకు పెట్టుబడి భారం తగ్గించే విధంగా యంత్ర పరికరాలు అద్దెకు (కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌) ఇచ్చే కేంద్రాలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్టు జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు తెలిపారు. జిల్లాలో ఒక్కోటీ రూ. కోటి వ్యయంతో 24 కష్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నల్లజర్లలో రూ.10 లక్షలతో నిర్మించిన వ్యవసాయ శాఖ కార్యాలయ భవనాన్ని జెడ్పీ చైర్మన్‌ బాపిరాజు, రూ.8.50 లక్షలతో నిర్మించిన ఉద్యానశాఖ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జెడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు పెంపునకు యాంత్రీకరణ తప్పనిసరి అన్నారు. యాంత్రీకరణతో పాటు సాగు నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు చెప్పారు. తాడిపూడి, ఎర్రకాలువ కుడికాలువ, చింతలపూడి లిప్ట్‌ల నుంచి సాగునీరు అందించి సాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. అధికారుల కష్టంతోనే నల్లజర్ల మండలం జాతీయస్థాయిలో ఉత్తమ పురస్కారం అందుకోబోతుందని బాపిరాజు చెప్పారు. పంచాయతీరాజ్‌ దినోత్సవం ఈ నెల 24న సీఎం చంద్రబాబును పోతవరం తీసుకువచ్చి సత్కరించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు, జెడ్పీటీసీ కొఠారు అనంతలక్ష్మి, వ్యవసాయశాఖ జేడీ సాయిలక్షీ ‍్మశ్వరి, ఉద్యానశాఖ ఏడీ జి.విజయలక్ష్మి, ఆత్మ పీడీ ఆనందకుమారి, ఏడీఏ రాజన్ తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు