రేషన్‌షాపుల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం

6 Aug, 2016 00:11 IST|Sakshi
సాక్షి, విశాఖపట్నం : రేషన్‌ షాపుల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధమైంది. జీవో నెం.35 ప్రకారం ఇందుకు 
చర్యలు తీసుకోవాలంటూ పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు నుంచి ఆదేశాలొచ్చాయి. గత ప్రభుత్వ 
హయాంలో జారీ అయిన ఈ జీవోను అనుసరించే రేషన్‌ షాపులను కార్డుల సంఖ్యకనుగుణంగా 
క్రమబద్ధీకరించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆధార్, ఐరిష్‌ అనుసంధానం చేసిన రేషన్‌ కార్డుల సంఖ్య 
ఆధారంగా ఈ క్రమబద్ధీరణ చేయనున్నారు. ప్రభుత్వాదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కోషాపు 
పరిధిలో 400 నుంచి 450 బీపీఎల్, 50 పింక్‌ కార్డులకు మించి ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో 
ఒక్కోషాపు పరిధిలో 500 నుంచి 550 బీపీఎల్, 250 గులాబీ కార్డులకు మించి ఉండకూడదు.  
కార్పొరేషన్‌ పరిధిలో అయితే 600 నుంచి 650 బీపీఎల్, 400 గులాబీ కార్డులకు మించి ఉండకూదని 
జీవో పేర్కొంది. ప్రస్తుతం జిల్లాలో 2018 రేషన్‌ షాపులుండగా వాటి పరిధిలో 10.87 లక్షల రేషన్‌ 
కార్డులున్నాయి. 1500 నుంచి 2 వేలకు పైగా కార్డులున్న దుకాణాలు 10 వరకు ఉంటే, వెయ్యినుంచి 
1500కుపైగా కార్డులున్న దుకాణాలు 20కుపైగా ఉన్నాయి. అలాగే 500 నుంచి వెయ్యి లోపు కార్డులు 
కలిగిన దుకాణాలు 200కుపైగా ఉంటాయని అంచనా. కార్డుల సంఖ్య ఆధారంగా రేషన్‌షాపులను 
క్రమబద్ధీకరిస్తే ప్రస్తుతం ఉన్న రేషన్‌ షాపుల సంఖ్యకు అదనంగా మరో రెండు మూడొందలు పెరిగే 
అవకాశం ఉందని సివిల్‌ సప్లయిస్‌ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా జిల్లా 
స్థాయిలో గైడ్‌లైన్స్‌ రూపొందించుకొని క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
 

 

మరిన్ని వార్తలు