సత్యదేవుని ఆదాయానికి ‘క్షవరం’

7 May, 2017 23:04 IST|Sakshi
సత్యదేవుని ఆదాయానికి ‘క్షవరం’
- అన్నవరం దేవస్థానంలో రూ.7 లక్షల విలువైన తలనీలాలు మాయం
- రూ.1.28 కోట్లకు వేలం పాడిన టీడీపీ నేత
- షరతుల ప్రకారం సగం సొమ్ము చెల్లించకుండానే మూడు నెలల తలనీలాల తరలింపు
- కుమ్మక్కైన సిబ్బంది
- ఆలస్యంగా గుర్తించిన అధికారులు
- గుమస్తా సస్పెన్షన్‌.. ఇద్దరికి ఛార్జ్‌ మెమోలు
అన్నవరం : బీహార్‌లో పశువుల దాణాను మేసేసిన ప్రబుద్ధుల గురించి విన్నాం. రాష్ట్రంలో ఇసుక బుక్కేస్తున్న బకాసురుల బాగోతాలను రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా అన్నవరం దేవస్థానంలో సత్యదేవుని ఆదాయానికి కొంతమంది సిబ్బంది క్షవరం చేసేశారు. 18 రోజుల కాలానికి భక్తులు సమర్పించిన రూ.7 లక్షల విలువైన తలనీలాలు మాయమయ్యాయి. దాదాపు ఆరు నెలల కిందట జరిగిన ఈ వ్యవహారం బయటకు వెల్లడి కాకుండా కొందరు అధికారులు గోప్యత పాటించారు. ఎట్టకేలకు ఆ బాగోతం బయట పడడంతో కేశఖండన శాల గుమస్తాను సస్పెండ్‌ చేసి, సంబంధిత సూపరింటెండెంట్, ఏఈఓలకు మెమోలు జారీ చేసినట్లు ఈఓ కె.నాగేశ్వరరావు ఆదివారం విలేకర్లకు తెలిపారు.
అసలేం జరిగిందంటే..
పలువురు భక్తులు సత్యదేవునికి తలనీలాలు సమర్పిస్తూంటారు. అలా వచ్చిన తలనీలాలను దేవస్థానం ఏడాది ముందే టెండర్‌ కం వేలంపాట ద్వారా విక్రయిస్తుంది. పాటదారు ఆ ఏడాదంతా ఆ తలనీలాలను సేకరించుకోవాలి. గత ఏడాది ఆగస్ట్‌ ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది జూలై 31 వరకూ తలనీలాలు పోగు చేసుకుని, తీసుకునే హక్కును తుని మునిసిపాలిటీలో కీలక పదవిలో ఉన్న ఓ టీడీపీ నాయకుడు రూ.1.28 కోట్లకు దక్కించుకున్నారు. టెండర్‌ షరతుల ప్రకారం సగం మొత్తం అంటే రూ.64 లక్షలు చెల్లించాలి. అనంతరం తలనీలాలు తీసుకోవాలి. దీని ప్రకారం ఆ పాటదారు డిపాజిట్‌ రూపంలో రూ.10 లక్షలు చెల్లించాడు. మిగిలిన మొత్తంలో రూ.18 లక్షలు నగదు, మిగిలిన మొత్తానికి చెక్కులు ఇచ్చాడు. అయితే ఆ చెక్కులు మారలేదు. దీంతో టెండర్‌ నిబంధనల ప్రకారం సగం సొమ్ము చెల్లించనందున, భక్తులు సమర్పించిన తలనీలాలను ఒక గదిలో దాచి ఉంచారు. దీనికి అటు దేవస్థానం అధికారులు, ఇటు పాటదారుని వద్ద పని చేసేవారు రెండు తాళాలు వేసి జాయింట్‌ కస్టడీలో ఉంచుకున్నారు. అయితే పాట పాడిన వ్యక్తి అధికార టీడీపీ నాయకుడు కావడంతో ఏ ఒత్తిళ్లు వచ్చాయో ఏమో కానీ నిబంధనలకు విరుద్ధంగా తలనీలాలు తీసుకువెళ్లడానికి సంబంధిత అధికారులు అనుమతించారు. దీంతో గదిలో భద్రపరచిన మూడు నెలల తలనీలాలను అక్టోబర్‌ 29న పాటదారుకు అప్పగించారు. ఆ మర్నాటి నుంచి భక్తులు సమర్పించిన తలనీలాలను పాటదారుకు ఇవ్వకుండా ప్రతి రోజూ కేశఖండన శాల సిబ్బంది గ్రేడింగ్‌ చేసి భద్రపర్చాలి. అయితే అధికారుల నుంచి తమకు అటువంటి ఆదేశాలు లేనందున తలనీలాలు ఉన్న గదికి తాళం వేయలేదని సంబంధిత సిబ్బంది చెబుతున్నారు. మొత్తానికి ఏం జరిగిందో కానీ అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 16 వరకూ వచ్చిన తలనీలాలు మాయమయ్యాయి. ఏ రోజు ఎంత మొత్తంలో తలనీలాలు వచ్చాయన్న ఆధారాలు కూడా లేవు. దీంతో పాటదారు తరఫు మనుషులతో సిబ్బంది కుమ్మక్కై తలనీలాలను తరలించేసి, సొమ్ము చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విచారణకు ఆదేశించాం
తలనీలాలు మాయమైన వ్యవహారంలో కేశఖండన శాల గుమస్తా ఎం.రామకృష్ణను సస్పెండ్‌ చేశాం. ఈ వ్యవహారంపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సూపరింటెండెంట్‌ జి.సత్యనారాయణ, ఏఈఓ సాయిబాబాలకు ఛార్జి మెమోలు జారీ చేశాం. పెద్ద పెద్ద స్కామ్‌లు కూడా చాలా కాలం తరువాతే వెలుగు చూస్తాయి. ఇదీ అంతే. ఆరు నెలల క్రితం జరిగినా అందుకే మా దృష్టికి రాలేదు. పాటదారు చెల్లించిన సొమ్ము మేరకే తలనీలాలు తీసుకువెళ్లేందుకు అనుమతించాం. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాం. నవంబర్‌ 17 నుంచి తలనీలాలను భద్రపరుస్తున్నాం. పూర్తి సొమ్ము కట్టని పాటదారుపై కేసు వేశాం. పాత వేలం రద్దు చేసి కొత్తగా వేలం నిర్వహిస్తాం.
- కె.నాగేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి, అన్నవరం దేవస్థానం
మరిన్ని వార్తలు