ఆ చిట్టితల్లికి ఏకష్టమొచ్చిందో?

29 Feb, 2016 18:46 IST|Sakshi
ఆ చిట్టితల్లికి ఏకష్టమొచ్చిందో?

 వారికి ఆ అమ్మాయి గారాల పట్టీ.. అమ్మానాన్నల కళ్లెదుట ఆడుతూపాడుతూ..తాతయ్య గుండెలపై నిద్రపోతూ ఆ ఇంట సందడి చేసేది. తన కూతురి అల్లరి చూస్తూ మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు ఇక శోకమే మిగిలింది. ఆ చిట్టితల్లికి ఏ కష్టమొచ్చిందో? ..ఆ ఇంట దుఃఖాన్ని మిగిల్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో  కిరోసిన్ పోసుకొని, నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన అనంతపురం లోని ఓబుళదేవరనగర్‌లో ఆదివారం జరిగింది.                                        
 
 ఓబుళదేవరనగర్‌లోని సిమెంట్ గోడౌన్ సమీపంలో నివాసముంటున్న చాకలి కిష్టప్ప, చాకలి లక్ష్మీనరసమ్మ దంపతుల కుమార్తె చాకలి హరిత (12). శ్రీకృష్ణదేవరాయ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం తన బంధువులు ఇంటికి వెళ్లింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో తన చిన్నాన్న ఇంటి నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు.  హరిత ఏదో బాధను వ్యక్తం చేస్తూ.. ఇంట్లోకి వడివడిగా వెళ్లింది.
 
  ఈ విషయాన్ని గమనించిన స్థానికులు హరితకు ఏదైనా అనారోగ్యం అయి ఉండొచ్చని అనుకున్నారు.  ఇంతలోనే ఆ ఇంటి నుంచి పొగలు కమ్ముకున్నాయి. పొరుగింటి వారు వచ్చి చూశారు. తలుపులు మూసి ఉన్నాయి. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి వె ళ్లి చూస్తే .. స్నానపు గది వద్ద హరిత మంటల్లో కాలిపోతూ కనిపించింది. ఆస్పత్రికి తరలించాలని ప్రయత్నించారు. అప్పటికే హరిత మృతి చెందింది. వృత్తి పనికి వెళ్లిన తల్లిదండ్రులకు స్థానికులు హరిత మృతి చెందిన విషయాన్ని తెలియజేశారు. తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున ఇంటి వద్దకు చేరుకున్నారు. తల్లిదండ్రులు, బంధువుల రోదనతో ఆప్రాంతం మిన్నంటింది.
 
 ఆ దుస్తుల వెనుక..
 హరిత పసుపు పచ్చని దుస్తులు వేసుకుంది. బయట నుంచి ఇంటికి వేగంగా వచ్చిన హరిత ఒంటిపై ఉన్న చున్నీని చేతి లో పట్టుకొని లోపలికి వెళ్లింది. ఆ దుస్తులను ఒంటిపై నుం చి తీసివేసి ఓ మూలన పడేసింది. ఆ దుస్తుల వెనుక ఏదో రహస్యం ఉన్నట్టు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 బహుమతి ఎవరి కోసం..
 హరిత అప్పు చేసి ఎవరి కోసమో ఒక బహుమతిని కొనుగోలు చేసినట్లు బంధువులు తెలిపారు. ఆ బహుమతి తన పెద్దనాన్న కుమారుడి కోసం కొన్నట్లు హరిత తన సొంత అన్న దామోదర్‌కు చెప్పింది. ఈనేపథ్యంలో దామోదర్ తన చెల్లెలు హరితను మందలించినట్లు సమాచారం. చిన్న వయస్సులో హరిత ఆత్మహత్యకు పాల్పడడం చూసి, ఏం జరిగిందోనన్న అనుమానం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. కాగా ఆ విద్యార్థిని సూసైడ్ నోట్ రాసుకున్నట్లు తెలుస్తోంది. తరగతి గదిలో ఈ నెల 27న తోటి విద్యార్థినులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.  
 
 ఎంత పని చేశావు హరితా..
 హరితా.. ఎంత పని చేశావే.. రోజు అంతా కలిసి ఆడుకునేవాళ్లం. ఉదయం కూడా నాతో మాట్లాడి ఇంటికి వెళ్లితివే. ఇంతలోనే ఏమైంది నీకూ.. నా ఫ్రెండ్ ఇంత పని చేసుకుంటుందని అనుకోలేదే.. హరితా.. ఎందుకిలా చేసుకున్నావు..అంటూ మృతురాలి ఫ్రెండ్ శైలజ వెక్కి వెక్కి ఏడ్వడం స్థానికులను కంటతడి పెట్టించింది.
 
 దేవుడా..ఎందుకు మాకీశోకం..
 దేవుడా.. మాకెందుకు ఇంత శోకం మిగిల్చావు. బిడ్డ పుష్పవతి అయ్యిందని  వారం రోజుల క్రితమే సంబరం చేసుకున్నాం.. బాగా చదివి మాకు చేదోడు వాదోడుగా ఉంటుందనుకున్నాం.. మా బిడ్డను ఎవరో ఏమో చేశారు..అందుకే ఇలా చేసుకుంది* అని హరిత తల్లిదండ్రులు, అవ్వాతాత బోరున విలపించారు. చిన్న వయస్సులోనే మా బిడ్డ ఇలా చేసుకుంటుందే అని సొమ్మసిల్లి పడిపోయారు. ఘటన స్థలానికి చేరుకున్న రెండో పట్టణ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజనాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
 

మరిన్ని వార్తలు