ఊరూరా కన్నీరు!

28 Jun, 2017 02:51 IST|Sakshi
ఊరూరా కన్నీరు!

మేజర్‌ పంచాయతీల్లో తీవ్ర నీటి ఎద్దడి
57 గ్రామాలకు ట్యాంకర్లే దిక్కు
పలు గ్రామాల్లో 10 రోజులకు ఒకసారి సరఫరా


కోడుమూరు పట్టణ జనాభా 60 వేల దాకా ఉంటుంది. ఇక్కడ జనాభాకు సరిపడా నీరు అందడం లేదు. పైగా పది రోజులకు ఒకసారి మాత్రమే సరఫరా చేస్తున్నారు. పక్కనే హంద్రీ ఉన్నా.. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో పట్టణ ప్రజలకు నీరు అందని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయినా సమస్య తీరడం లేదు. పక్కనే గాజులదిన్నె డ్యాం ఉంది. ఆ నీటిని కర్నూలుకు విడుదల చేస్తుండటంతో కోడుమూరు గొంతెండుతోంది. కోడుమూరులోనే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది.

మేజర్‌ గ్రామ పంచాయతీ వెల్దుర్తిలో  20 వేల దాకా జనాభా ఉంది. ఈ పంచాయతీలో వారానికి ఒకసారి కూడా నీరు అందడం లేదు. గతంలో తుంగభద్ర, బ్రహ్మగుండం నీటి పథకాల నుంచి విడుదల చేస్తూ వచ్చారు. ప్రస్తుతం తుంగభద్ర పథకం నుంచి నీటి సరఫరా ఆగిపోయింది. బ్రహ్మగుండం నుంచి మాత్రమే విడుదల చేస్తుండడంతో నీటి కొరత ఏర్పడింది. ఇక్కడ మెజారిటీ ప్రజలు నీటిని కొని తాగుతున్నారు. మద్దికెర, సున్నిపెంట ప్రాంతాల్లోనూ ప్రజలు తీవ్ర తాగునీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కర్నూలు(అర్బన్‌):  జిల్లాలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. పలు ప్రాంతాల్లో జూన్‌ ప్రారంభంలోనే వర్షాలు కురిసినా ఆశించిన స్థాయిలో భూగర్భజలాలు పెరగలేదు. దీంతో వేసవిలో పరిస్థితులే కొనసాగుతున్నాయి. హంద్రీ, తుంగభద్ర నది తీర ప్రాంతాల్లో బోర్లు అధికమయ్యాయి. నదుల్లో ఇసుకలేని కారణంగా భూగర్భజలాలు పూర్తిగా ఇంకిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు నీటి సమస్య ఉత్పన్నమైంది. తీవ్రనీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న 57 గ్రామాల ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో మాత్రం సమస్య తీరడం లేదు. విధిలేని పరిస్థితుల్లో బిందె నీటిని రూ.8నుంచి రూ.10 వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.

ఆలూరు నియోజకవర్గంలోనూ కటకట
ఆలూరు, హాలహర్వి, హోళగుంద మండలాల్లోని 40 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటైన బాపురం, చింతకుంట, విరుపాపురం రిజర్వాయర్లలో నీరు ఉంది. అయితే.. గ్రామ పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల ఆయా గ్రామాల్లో కూడా తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. ఇక్కడ 10–15 రోజులకు ఒకసారి నీరు విడుదలవుతోంది. కాగా.. పలు స్వచ్ఛంద సంస్థలు ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేస్తూ ప్రజల గొంతులు తడుపుతున్నాయి.

మరిన్ని వార్తలు