చుక్క నీటికీ గగనమే!

11 Dec, 2015 02:59 IST|Sakshi
చుక్క నీటికీ గగనమే!

♦ తాగునీటి సరఫరా లేక ప్రజలు విలవిల
♦ పట్టణాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి
♦ చాలా మున్సిపాలిటీల్లో మూడు నాలుగు రోజులకు సరఫరా
♦ కొన్ని చోట్ల వారానికోమారు...
♦ అదను చూసి ధరలు పెంచిన ట్యాంకర్ల యజమానులు
♦ శీతాకాలంలోనే ఇలా ఉంటే మరి వేసవిలో ఎలా..!
 
 సాక్షి నెట్‌వర్క్: అన్నమో రామచంద్రా అనే బదులు నీళ్లో రామచంద్రా అని వేడుకునే కష్టకాలం వచ్చింది. వేసవి ఇంకా రానే లేదు... శీతాకాలం మంచు కురుస్తూనే ఉంది. కానీ దప్పిక తీర్చుకునేందుకు చుక్క నీటికీ గగనమైంది. గొంతు ఎండిపోతోంది. రాష్ట్రంలోని చాలా పట్టణాల్లో తాగునీటి  సమస్య తీవ్రమవుతోంది. వారం నుంచి పదిరోజులకోమారు తాగునీరు సరఫరా అవుతున్న పట్టణాలూ ఉన్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. వేసవిని తలచుకుంటేనే గుండె గుభేల్‌మంటుంది. రాజధాని నగరం హైదరాబాద్‌తో సహా నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో నీటి సమ స్య తీవ్రమైంది. ఇప్పట్లో వర్షాలు కురిసే అవకాశా లు కనిపించకపోవడంతో నీటిఎద్దడిని ఎలా తీర్చాలన్న ఆందోళన అధికారులను భయపెడుతోంది. ప్రతీ వేసవిలో ట్యాంకర్ల సంఖ్య పెంచి నీరందించడం మామూలుగా జరిగేది. కానీ ఇప్పు డు శీతాకాలంలోనే ట్యాంకర్లపై ఆధారపడాల్సిన దుస్థితి. మున్సిపాలిటీలకు నీటి సరఫరా చేసే రిజర్వాయర్లు ఒట్టిపోతున్నాయి. రోజు విడిచి రోజు నీటి సరఫరా చేసిన మున్సిపాలిటీల్లోనూ ఇప్పుడు నాలుగు రోజులకోమారు సరఫరా జరుగుతోంది.

 నాలుగైదు రోజులకు...
 గోదావరి నీటితో తాగునీటిని అందించే మున్సిపాలిటీలు కూడా ఇప్పుడు తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. కృష్ణా నది పరీవాహకంలోనూ ఈ సమస్య ఎదురవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లిలో 4 రోజులకోమారు సరఫరా జరుగుతుంటే.. మందమర్రిలో ఆరేడు రోజులకోమారు అందిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట, కోరుట్ల మున్సిపాలిటీల్లోనూ నాలుగు రోజులకోమారు మంచినీటి సరఫరా జరుగుతోంది. మంజీరా నది ఎండిపోవడంతో.. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి సైతం నీటి సరఫరా కష్టమైంది. కృష్ణా నదిలో నీరు సమృద్ధిగా ఉన్నప్పుడే మహబూబ్‌నగర్ నగరానికి తాగునీటి సమస్య ఉండేది.

ఇప్పుడది మరింత పెరిగింది. పదిరోజులకోమారు సరఫరా జరుగుతోంది. మున్సిపాలిటీల్లో రోజూ కనీసం ప్రతీ మనిషికి 70 లీటర్ల మంచినీరు సరఫరా చేయాలని నిబంధనలున్నా.. కొన్ని మున్సిపాలిటీల్లో వారానికి గాని సరఫరా కావట్లేదు. హైదరాబాద్ మహానగరాన్ని ఆనుకుని ఉండే.. బడంగ్‌పేట నగర పంచాయతీలో వారానికోమారు సరఫరా జరుగుతోంది. ట్యాంకర్ల దగ్గర ప్రజలు నీటి కోసం తరుచూ గొడవలు పడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. మహానగరాల్లో ఒక్కో మనిషికి 135 లీటర్ల కంటే ఎక్కువ నీటిని సరఫరా చేయాల్సి ఉన్నా ఎక్కడా అది అమలు కావడం లేదు. ఒక్కో మనిషికి రోజుకు ఇచ్చే నీరు (ఎల్‌పీసీడీ) 50 లీటర్ల కంటే కంటే తక్కువ  సరఫరా జరుగుతున్న మున్సిపాలిటీల్లో అగ్రస్థానం షాద్‌నగర్‌దే. అక్కడ కేవలం 25.88 ఎల్‌పీసీడీ నీరు సరఫరా అవుతోంది.
 
 వ్యవసాయ బోర్ల నుంచి..
 కరువు నేపథ్యంలో గ్రామీణ ప్రజలు కూడా పొట్టచేత పట్టుకొని పట్టణాల వైపు వలసలు వస్తున్న తరుణంలో తాగునీటి కొరత మరింత తీవ్రం కానుంది. ఇదే అదనుగా నీటి వ్యాపారులు ట్యాంకర్ల ధరలను అమాంతం పెంచేశారు. రాష్ట్రంలో మొత్తం 68 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేష న్లున్నాయి. సగానికి పైగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నీటి ఎద్దడే. భూగర్భ జలాలపై ఆధారపడిన మున్సిపాలిటీలు.. అవి అడుగంటిపోతుండడంతో కొత్తగా బోర్లు వేయలేక డైలమాలో పడ్డాయి. వీటిని ఆనుకుని ఉన్న గ్రామాల్లో వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకుని సరఫరా చేసేందుకు స్థానిక అధికారులు ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. వర్షాల్లేక ఇప్పటికే సాగు విస్తీర్ణం తగ్గింది. ఆరుతడి పంటలవైపు మొగ్గుచూపుతున్న క్రమంలో వ్యవసాయ బోర్ల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితులున్నాయి.

మరిన్ని వార్తలు