అమ్మా.. రాక్షసులున్నారు జాగ్రత్తగా వెళ్లిరా!

2 Jan, 2017 22:51 IST|Sakshi
అమ్మా.. రాక్షసులున్నారు జాగ్రత్తగా వెళ్లిరా!

నశించిపోతున్న మానవతా విలువలు
పెరుగుతున్న లైంగిక వేధింపులు
ముక్కుపచ్చలారని బాలికలనూ వదలని కామాంధులు
ప్రభావం చూపుతున్న సెల్‌ఫోన్‌లు, సినిమాలు
10 ఏళ్ల వయస్సులోనే నీలిచిత్రాలు చూస్తున్న బాలలు


ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి.. తిరిగి క్షేమంగా వచ్చే వరకూ తల్లిదండ్రులకు గుండె దడే. మనిషి తోలు కప్పుకున్న ఏ మాయదారి మృగం కళ్లు.. అభంశుభం తెలియని తమ బిడ్డపై పడతాయేమోనని!! యుక్తవయస్సు వచ్చిన పిల్లకు పెళ్లి చేసే దాకా కన్నవారికి నిత్యక్షోభే. ప్రేమ, దోమ అంటూ ఏ ఉన్నాది వెంట పడి వేధిస్తాడోనని!! నిండుగా చీర కప్పుకొని వెళ్తున్న వివాహిత ఏం చేసింది పాపం.. ఆమె చుట్టారా వందలాది కళ్లు కామంతో సూదుల్లా గుచ్చేస్తుంటే!! అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా నడిచినప్పుడే మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అని జాతిపిత బాపూజీ అన్నారు. కానీ అర్ధరాత్రి మాట అటుంచితే.. పట్టపగలు కూడా మహిళ ధైర్యంగా తిరగలేని పరిస్థితి నేడు నెలకొంది.

విజయనగరం ఫోర్ట్‌ :
కొత్తవలస మండలంలో గత నెల 29న 10 ఏళ్ల బాలికపై  కామాంధుడు లైంగికదాడికి యత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చంపేందుకు సైతం సిద్ధమయ్యాడు.
ఆగస్టు 16న డెంకాడ మండలంలో ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
ఇలా ఏదో చోట నిత్యం బాలికలపైన, మహిళలపైన లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. సమాజంలో మానవత్వం మంట గలుస్తోందనడానికి ఇవి ఉదాహరణలు మాత్రమే. ఆడపిల్లలను గౌరవించాల్సింది పోయి.. వారిని కర్కశంగా చిదిమేస్తున్న రోజులు వచ్చాయి. వావీవరసలు మరచిపోతున్నారు. పసి పిల్లలన్న కనికరమూ చూపడం లేదు. సెల్‌ఫోన్‌ల్లోనూ, సినిమాల్లోనూ నీలిచిత్రాలను చూస్తూ రెచ్చిపోయి మానవమృగాళ్లా మారిపోతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు అందరిదీ ఒకే ధోరణి. బయటకు వెళ్లిన ఆడపిల్ల తిరిగి ఇంటికి చేరే వరకూ తల్లితండ్రులు గుండెలు పట్టుకుని ఉండాల్సిన పరిస్థితి. నిరక్షరాస్యులే ఇలా చేస్తున్నారనుకుంటే పొరపాటు.. అక్షరాస్యులు సైతం వావీవరసలు మరిచిపోయి  రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. సమాజం గురించి పూర్తిగా తెలియన ముక్కపచ్చలారని చిట్టితల్లులపై కూడా తెగబడుతున్నారు.

విద్యార్థులపై సెల్‌ఫోన్లు, సినిమాల ప్రభావం
నేడు తినడానికి తిండి లేని ఇల్లు ఉందేమో గానీ.. ప్రతి ఇంటిలోనూ సెల్‌ఫోన్‌ ఉంది. అరచేతిలో నీలిచిత్రాలను చూడగలిగే టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో యువత పెడదోవన పడుతోంది. ముఖ్యంగా ప్రతి విద్యార్థి చేతిలోనూ నేడు ఇంటర్నెట్‌ సౌకర్యంతో సెల్‌ఫోన్‌ దర్శనమిస్తోంది. అందులో నీలి చిత్రాలు, అసభ్యకర సన్నివేశాలు కోకొల్లలు. గతంలో ఉద్యోగం వచ్చిన తర్వాతో.. వ్యాపారంలో స్థిరపడ్డాకో ఫోన్‌ ఇచ్చేవారు. కానీ నేడు 3వ తరగతి నుంచే ఇంట్లో పిల్లలకు సెల్‌ఫోన్‌ ఇస్తున్నారు. పిల్లలు ఫోన్‌ ఆపరేట్‌ చేస్తుంటే మురిసిపోతున్నారు. కానీ దాని వల్ల భవిష్యత్‌లో కలిగే అనర్థాల గురించి పట్టించుకోవడం లేదు. 10వ తరగతి వచ్చేసరికి సెల్‌ఫోన్‌ ఏ విధంగా ఆపరేట్‌ చేయాల్లో పూర్తిస్థాయిలో నేర్చుకుంటున్నారు. సెల్‌ఫోన్‌తోపాటు సినిమాల ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటోంది. సినీనటులు నటిస్తే దాన్నే నిజమని ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

వస్త్రధారణ కరెక్టేనా?
మారుతున్న కాలానికనుగుణంగా మనమూ మారాలి. అందులో తప్పు లేదు. కానీ.. ఆ మారడం అన్నది ఎలా అన్నదే ఇక్కడ ప్రశ్న. విదేశీ పోకడలు, వింత అలవాట్లు, పాశ్చాత్య వస్త్రధారణ మన సమాజంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోందనడంలో సందేహం లేదు. శరీరమంతా కనిపించేలా కొంతమంది మహిళలు, యువతులు ధరిస్తున్న వస్త్రాలు కూడా నేడు లైంగిక దాడులు పెరగడానికి ఒక కారణమన్నది కాదనలేని నిజం. నేడు ఫ్యాషన్‌ల పేరిట చిన్నపిల్లలకు సైతం అర్ధనగ్న వస్త్రాలను తల్లిదండ్రులు ఇస్తున్నారు. ఇటువంటి వాటికే ‘మృగాళ్లు’ ఆకర్షితులై దాడికి పాల్పడుతున్నారు.

దారి తప్పిస్తున్న చెడు అలవాట్లు
నేటి తల్లిదండ్రులు పిల్లలకు మితిమీరిన ‘స్వేచ్ఛ’ ఇచ్చేస్తున్నారు. ఆ స్వేచ్ఛనే పిల్లలు దుర్వినియోగం చేసుకుంటున్నారు. చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. చెడుతిరుగుళ్లకు అలవాటు పడుతున్నారు. 15 ఏళ్ల నుంచే మద్యం సేవించడం చాలామంది యువకులు అలవర్చుకుంటున్నారు. మద్యానికి అలవాటు పడడం వల్ల ఏది మంచో.. ఏది చెడో అన్న విచక్షణను కోల్పోతున్నారు.

తల్లిదండ్రుల శ్రద్ధ అవసరం..
అమ్మా.. జాగ్రత్తగా వెళ్లిరా అని ఆడపిల్లకు తల్లిదండ్రులు చెబుతున్నారు. కానీ.. మగవాడికి మాత్రం ఎటువంటి విషయాలూ చెప్పడం లేదు. ఆడపిల్లలను గౌరవించాలి.. వారి పట్ల మర్యాదగా నడుచుకోవాలి.. అసభ్యకరంగా ప్రవర్తించరాదన్న విషయాలను ఏ తల్లిదండ్రులైనా తమ కుమారుడికి చెబుతున్నారా? మగ పిల్లవారికి సైతం చిన్ననాటి నుంచే ఇలాంటి జాగ్రత్తలు చెబితే కాస్తయినా వారిలో మార్పు రావచ్చు.

సెల్‌ఫోన్‌ సగం కారణం..
నేటి సమాజంలో పరిస్థితికి సెల్‌ఫోన్‌లే సగం కారణం. నేడు సెల్‌ఫోన్‌ నిత్య వాడకంగా మారింది. చాటింగ్‌లు, మేసేజ్‌లు విద్యార్థులపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాల్సి ఉంది. మంచి, చెడులు గురించి తల్లిదండ్రులు తెలియజేయాలి
– కేసలి అప్పారావు, బాలల సంక్షేమ సమితి చైర్మన్‌.

పిల్లల్లో వచ్చే మార్పులను గమనించాలి..
నైతిక విలువల గురించి పిల్లలకు శిక్షణ ఇప్పించాలి. ఏదో మంచి, ఏది చెడు అన్న విషయాలను తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచి తెలియజేయాలి. సెల్‌ఫోన్‌లు సా«ధ్యమైనంతవరకు ఇవ్వకూడదు. టీవీలు,  సినిమాలు చూసిన తర్వాత పిల్లల్లో వచ్చే మార్పులను గమనించాలి. – గంటా హైమావతి, బాలల సంక్షేమ కమిటీ సభ్యురాలు

మరిన్ని వార్తలు