విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

2 Aug, 2016 00:34 IST|Sakshi
విద్యాసంస్థల బంద్‌ విజయవంతం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :
విద్యా సమస్యలపై విద్యార్థి సంఘాలు సోమవారం చేపట్టిన బంద్‌ జిల్లాలో విజయవంతమైంది. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంతోపాటు వివిధ ప్రాంతాల్లో విద్యాసంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌ఓ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ బంద్‌ నిర్వహించారు. విద్యార్థి సంఘాల విజ్ఞప్తి మేరకు విద్యాసంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్‌ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. కాకినాడలో జేఎన్‌టీయూ, బాలాజీచెరువు వద్ద; అమలాపురం గడియారస్థంభం సెంటర్‌; రంపచోడవరం, చింతూరుతోపాటు, జిల్లాలోని పలు ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లలో విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదికవి నన్నయ యూనివర్సిటీ విద్యార్థులు వీసీ ఎం.ముత్యాలు నాయుడుకు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో ఆరు వేల విద్యాసంస్థలుండగా ఈ బంద్‌లో 300 పీజీ కళాశాలలు, 350 జూనియర్‌ కళాశాలలు, 250 డిగ్రీ కళాశాలలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కోనసీమలోని ఇంజనీరింగ్‌ కళాశాలలు మూత పడ్డాయి.
ఈ సందర్భంగా విద్యార్థిసంఘాల జేఏసీ నాయకులు ఎస్‌.కిరణ్‌కుమార్, బి.పవన్‌లు మాట్లాడుతూ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం క్లస్టరైజేషన్, రేషలైజేషన్, మోడల్స్‌ స్కూల్స్‌ విధానాల పేరుతో దాదాపు 4 వేల పాఠశాలలు కుదించేసిందని అన్నారు. 1400 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు రద్దు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందన్నారు. కార్పొరేట్‌ రంగానికి ఎర్ర తివాచీ పరచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు విద్యను దూరం చేయాలని చూస్తోందని దుయ్యబట్టారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌చార్జీలను పెంచాలన్నారు. స్కూల్స్‌లో యూనిఫాంలు వెంటనే అందజేయాలని, విదేశీ యూనివర్సిటీలను రాష్ట్రంలో అనుమతించరాదని, మున్సిపల్‌ పాఠశాలలను కార్పొరేట్‌ రంగానికి ఇవ్వరాదని డిమాండ్‌ చేశారు.
మరిన్ని వార్తలు