నేడు దేశభక్తులు లేరు.. దేశముదుర్లే

27 Sep, 2016 04:17 IST|Sakshi
నేడు దేశభక్తులు లేరు.. దేశముదుర్లే
షహీద్‌ భగత్‌సింగ్‌ పుస్తకావిష్కరణ సభలో ఎండ్లూరి
రాజమహేంద్రవరం కల్చరల్‌: చెరసాలలే చంద్రశాలలుగా, అరదండాలే విరిదండలుగా నాటి త్యాగధనులు భావించారు.నేడు దేశభక్తులు లేరు.. దేశముదుర్లే కనిపిస్తున్నారు అని తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్యపీఠం డీన్‌ ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ అన్నారు. సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ మెమోరియల్‌ సోషల్‌ సర్వీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విశ్రాంతపేపర్‌ మిల్లు అధికారి ఎస్‌బీచౌదరి రచించిన‘షహీద్‌ భగత్‌సింగ్‌’పుస్తకావిష్కరణ సభలో ఎండ్లూరి ప్రసంగించారు. నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలునాయుడు ‘షహీద్‌ భగత్‌సింగ్‌ ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

భగత్‌ సింగ్, స్వామి వివేకానంద, ఆదిశంకరాచార్యులు జీవించినది కొద్ది కాలమే అయినా మానవాళికి వారు చేసిన సేవలు లెక్కపెట్టలేమన్నారు. గ్రంథకర్త ఎస్‌బీ చౌదరి మాట్లాడుతూ మంచి మనుషులే సమాజంలో నిజమైన మైనారిటీలన్నారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్‌ అరిపిరాల నారాయణరావు మాట్లాడుతూ ఉరితీయకముందు భగత్‌సింగ్‌ను నాటి పోలీస్‌ అధికారులు చిత్రహింసలకు గురిచేశారన్నారు.

స్వాగతవచనాలు పలికిన మహమ్మద్‌ఖాదర్‌ఖాన్‌ ‘జీవితాన్ని ప్రేమిస్తాం–మరణాన్ని ప్రేమిస్తాం, మేం మరణించి–ఎర్రపూల వనంలో పూలై పూస్తాం, ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం, నిప్పురవ్వల మీద నిదురిస్తాం’ అన్న కవితను చదివారు. వ్యక్తిత్వవికాసనిపుణుడు డాక్టర్‌ బీవీ పట్టాభిరామ్‌ గ్రంథకర్త కృషిని కొనియాడారు. కోడూరి రంగారావు, ఎర్రాప్రగడ రామకృష్ణ, పెరుమాళ్ల రఘునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు