అడుగుల సవ్వడికి... పులకించిన పల్లెలు

9 Jul, 2013 13:12 IST|Sakshi
కొత్తవలస బహిరంగ సభకు హాజరైన జనసందోహం (అంతర చిత్రం) ప్రజలకు అభివాదం చేస్తున్న షర్మిల.

‘ వైఎస్సార్ అన్న ఒక్క పదం రాష్ట్రగతినే మార్చేసింది. రాష్ర్ట రాజకీయాలను మలుపు తిప్పింది. రాజకీయాలకే కొత్త అర్థం చెప్పింది. నాయకుడు అంటే ఎలా ఉండాలో నేర్పింది. రైతులకు అభయహస్తం ఇచ్చింది. దీనులకు, పేదలకు ఆపన్నహస్తం ఇచ్చింది’. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. రాజ న్న బిడ్డ.. జగనన్న చెల్లెలు షర్మిల. మరో ప్రజాప్రస్థానం యాత్ర లో భాగంగా కొత్తవలస బహిరంగ సభలో అశేష జనవాహిని మధ్య ఆమె ప్రసంగం ఇటు వైఎస్సార్ సీపీ శ్రేణుల్లోనూ, పార్టీ కార్యకర్తల్లోనూ కొత్త ఉత్సాహం నింపింది. ఆమె మాటలు జనాన్ని ఉత్తేజపరిచాయి. సోమవారం వైఎస్సార్ జయంతి కావడం, పాదయాత్రకు విశాఖ జనం వీడ్కో లు చెప్పడం, విజయనగరం జిల్లా ప్రజలు స్వాగతం చెప్పడం ఒకే రోజు కావడం విశేషం.

వైఎస్సార్ ఉచితంగా వైద్యం అందించడం,పేదలకు సాయం చేయాలన్న అభిప్రాయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, నాయకుడిగా... పలుమార్లు ఎమ్మెల్యే, ఎంపీగా గెలవడం, సీఎంగా బాధ్యతలు చేపట్టడం వంటి విషయాలను షర్మిల చెబుతున్నప్పుడు జనం ఆసక్తిగా విన్నారు. కాం గ్రెస్, టీడీపీ కుట్రను ఎండగట్టడం, రాజన్న పాలన మళ్లీ వస్తుందన్నప్పుడు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. సోమవారం సాయంత్రం యాత్ర ప్రారంభమై చింతలపాలెం, దేశపాత్రునిపాలెం, మంగళపాలెం మీదుగా కొత్తవలస జంక్షన్‌కు చేరుకుంది, ఆమె యాత్రకు జనం అడుగడుగునా హారతులు పట్టారు. అనంతరం రాత్రి 7 గంటల సమయంలో ఆమె కొత్తవలస శివారులో రాత్రి బసకు ఉపక్రమించారు, తపనలోంచే పథకాలు పుట్టాయి పాదయాత్రలో భాగంగా షర్మిల మాట్లాడుతూ రాజన్న ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఎప్పుడూ తపన పడేవారని, అందులోంచి పుట్టినవే సంక్షేమ పథకాలు అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పని చేసేవారని చెప్పారు. ప్రజల్లో పుట్టి ప్రజల మధ్య పెరగడమే నాయకత్వ లక్షణంగా అభివర్ణించారు.

ఆయన రెక్కల కష్టంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఇప్పుడు ఆయన మీదే ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటోందన్నారు. ధర్మ పోరాటం కోసం ఆందోళనలు జరిపిన వ్యక్తి మీదే ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం ఘోరమన్నారు. ఆయన మృతి తరువాత రాష్ట్రంలో 660 మంది గుండెలాగిపోయాయని షర్మిల అన్నప్పుడు సభకు హాజరైన జనం కళ్లు చెమ్మగిల్లాయి. రాజన్న రాజ్యాన్ని జగనన్న తీసుకువస్తాడని, అమ్మఒడి పథకం ద్వారా పిల్లల్ని చదివిస్తాడని, పింఛన్ల సొమ్ము పెంచుతాడని చెప్పడంతో అంతా ఆనందించారు. తన ప్రసంగాన్ని ఓపిగ్గా విన్నందుకు చేతులెత్తి, శిరసు వంచి ఆప్యాయంగా ఆనందంగా, అనురాగంతో నమస్కరిస్తున్నానని చెప్పినప్పు డు అప్పుడే సభ అయిపోయిందా అనుకుంటూ జనం తిరుగుముఖం పట్టారు.

మరిన్ని వార్తలు