గొర్రెల కాపరి దారుణ హత్య

11 Mar, 2017 03:52 IST|Sakshi
గొర్రెల కాపరి దారుణ హత్య

► తలపై బండరాయితో మోది కిరాతకం
► పెద్ద కొడుకును అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
► ఆస్తి వివాదమే కారణమని అనుమానాలు


షాబాద్‌: ఆస్తి తగాదాల కారణంగా గొర్రెల కాపరి దారుణ హత్యకు గురైన సంఘటన షాబాద్‌ మండలంలోని తిర్మలాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. చేవెళ్ల సీఐ గురువయ్య కథనం ప్రకారం.. తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన కడ్మూరి అనంతయ్య(70) గొర్రెల కాపరిగా జీవనం సాగించేవాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారికి పెళ్లిళ్లు చేశాడు. అనంతయ్య వియ్యంకుడైన నందిగామ మండలం ఈర్లపల్లి గ్రామానికి చెందిన సత్తయ్య వారం రోజుల క్రితం తన వద్ద ఉన్న గొర్రెలకు మేత కోసం గొర్రెల మందతో తిర్మలాపూర్‌ గ్రామానికి వచ్చాడు. ఇద్దరూ కలిసి రోజూ గొర్రెలను మేపుకొచ్చి రాత్రి మంద వద్ద పడుకునేవారు. అనంతయ్య రోజూ రాత్రి భోజనం చేసి మంద వద్ద ఉన్న వియ్యంకుడు సత్తయ్యకు కూడా భోజనం తీసుకుని పోయేవాడు.

ఎప్పటిలాగానే గురువారం రాత్రి కూడా అనంతయ్య తన వియ్యంకుడికి భోజనం తీసుకెళ్లాడు. అనంతరం వారిద్దరూ గొర్రెల మందకు చెరో వైపున పడుకున్నారు. సత్తయ్య ఉదయం 5 గంటలకు గొర్రె పిల్లలకు తడికె అళ్లేందుకని చెట్ల కొమ్మలు తీసుకురావడానికి వెళ్లి ఆరున్నర గంటల ప్రాంతంలో వచ్చాడు. అప్పటికీ అనంతయ్య నిద్ర లేవకపోవడంతో అతడిపై కప్పి ఉన్న దుప్పటిని తీసిచూడగా.. శరీరమంతా రక్తసిక్తమై చనిపోయి కనిపించాడు. తలపై బలమైన గాయమై ఉంది. దీంతో సత్తయ్య వెంటనే ఈ విషయాన్ని అనంతయ్య చిన్నకుమారుడు శ్రీనుకు సమాచారం అందించాడు. గ్రామస్థులంతా సంఘటన స్థలానికి వచ్చి చూశారు.

సమాచారం అందుకున్న చేవెళ్ల సీఐ గురువయ్య, ఎస్సైలు శ్రీధర్‌రెడ్డి, రవికుమార్‌లు సంఘటన స్థలానికి చేరుకుని అనంతయ్య మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించారు. హత్యపై ఆరా తీసిన పోలీసులకు గత కొద్దిరోజులుగా పెద్ద కొడుకు సుభానయ్య.. అనంతయ్యతో ఆస్థి విషయంలో గొడవలు పడుతుండేవాడని తెలిసింది. దీంతో సుభానయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య కడ్మూరి అనంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం కుటుంబీకులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు