డొక్కు డొక్కు

17 Jul, 2016 18:25 IST|Sakshi
డొక్కు డొక్కు
  • కాలం చెల్లిన బస్సులు.. రోడ్లపై చక్కర్లు
  • ఆర్టీసీ నిర్వాకంతో తరచూ ప్రమాదాలు
  • ప్రయాణికుల ప్రాణాలు గాల్లో
  • 618 బస్సుల్లో 160 కాలం డొక్కువే..
  • నెలన్నర వ్యవధిలోనే ఐదు బస్సు ప్రమాదాలు
  • ప్రయాణికుల బెంబేలు

  • డొక్కు బస్సులతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. కాలం చెల్లిన బస్సులు రోడ్లపై చక్కర్లు కొడుతుండడంతో అవి ఎప్పుడు?.. ఎక్కడ?.. ప్రమాదానికి గురవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. గత్యంతరం లేక చాలాచోట్ల డొక్కు బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. ‘సురక్షితంగా గమ్యానికి చేరాలంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలి’... అనే మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి.

    ఆచరణలో మాత్రం ఆర్టీసీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. డొక్కు బస్సులను యథేచ్ఛగా రోడ్లపై తిప్పుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. నెలన్నర వ్యవధిలోనే ఐదు బస్సు ప్రమాదాలు జరిగాయంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తీరు మారకపోతే ఆర్టీసీకి ప్రయాణికులు మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది.

     మెదక్‌: కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. నెలన్నర రోజుల వ్యవధిలోనే జిల్లాలో ఐదు బస్సు ప్రమాదాలు జరిగాయి.  ఇందులో రెండు బస్సులు కాలం చెల్లినవి కావడం గమనార్హం. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, గజ్వేల్, దుబ్బాక డిపోలకు గాను మొత్తం 618 బస్సులు ఉన్నాయి. ఇందులో 176 అద్దెబస్సులుండగా, సంస్థకు చెందినవి 442 బస్సులున్నాయి. ఆర్టీసీకి చెందిన 442 బస్సుల్లో 160 బస్సులు కాలం చెల్లినవి కాగా మిగతా 282 బస్సులు మాత్రమే కండిషన్‌లో ఉన్నాయి.

    నిబంధనలు ఇలా...
    నిబంధనల ప్రకారం 7.50 లక్షల కిలోమీటర్లు తిరిగిన డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను, 6.50 లక్షల కిలో మీటర్లు తిరిగిన సూపర్‌ లగ్జరీ బస్సులను ఆర్డీనరీ బస్సులుగా మారుస్తారు. 12లక్షల కిలో మీటర్లు తిరిగిన ప్రతి బస్సు కాలం చెల్లినట్టుగా గుర్తిస్తారు. జిల్లాలో ఇప్పటికే 160 ఆర్డీనరీ బస్సులు కాలం చెల్లినవి ఉండగా వాటిని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా నడిపిస్తూనే ఉన్నారు.

    తరచూ ప్రమాదాలు...
    డొక్కు బస్సులను తిప్పడం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నారు. రోడ్డుపై వెళ్లాల్సిన బస్సులు అదుపుతప్పి పక్కకు తిరుగుతున్నాయి. నెలరోజుల్లో జిల్లాలో నాలుగు బస్సు ప్రమాదాలు జరిగాయి. అందులో 50మంది వరకు గాయపడగా, ఒకరు మృతి చెందారు. కేవలం కాలం చెల్లిన బస్సులను నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవిస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

    – గత మే 20వ తేదీన సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్డీనరీ బస్సు (నం.ఏపీ28జెడ్‌409) సంగారెడ్డి నుంచి మెదక్‌కు సుమారు 45మంది ప్రయాణికులతో బయల్దేరింది. మెదక్‌ పట్టణానికి 13కిలో మీటర్ల దూరంలో ఉండగా కొల్చారం మండలం పొతన్‌శెట్టిపల్లి గ్రామ శివారులో చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో మెదక్‌ మండలం పేరూర్‌కు చెందిన భూలక్ష్మి కాలు బస్సులోనే తెగిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. మరో ఐదుగురు రమావత్‌ కిషన్, సాలి, విఠల్, అజ్మిర, పద్మజా తలలు పగిలి తీవ్ర గాయాలు కాగా, 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

    – ఇదే నెలలో చేగుంట మండలం 44వ జాతీయ రహదారిపై వల్లూరు శివారులోగల నర్సరీ సమీపంలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సూపర్‌ లగ్జరీ బస్సు ఓ లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్‌తోపాటు మరో నలుగురికి గాయాలయ్యాయి.

    – కౌడిపల్లి మండలం రాయిలాపూర్‌ గేటు సమీపంలో మెదక్‌–నర్సాపూర్‌ ప్రధాన రహదారిపై మెదక్‌ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు మెదక్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డు కిందికి వెళ్లి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తోపాటు మరో 15మందికి తీవ్రగాయాలయ్యాయి.

    – అదే నెలలో నర్సాపూర్‌–తూప్రాన్‌ ప్రధాన రహదారిపై గజ్వేల్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హన్మంతాపూర్‌ వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తోపాటు పదిమంది తీవ్రంగా గాయపడ్డారు.

    – రామాయంపేట శివారులో సైతం జాతీయ రహదారిపై నిజామాబాద్‌ జిల్లాకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనగా 20మంది గాయపడ్డారు.
     ఇలా కేవలం నెలన్నర రోజుల వ్యవధిలో ఐదు బస్సు ప్రమాదాలు చోటుచేసుకోగా, రెండింటిలో కాలం చెల్లినవి కావడంతోనే జరిగినట్లు ప్రమాద స్థలంలో డ్రైవర్లు తెలిపారు. గ్యారేజీలో ఉండాల్సిన బస్సులు రోడ్లపై తిరుగుతోండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

     మరమ్మతులతో నడిపిస్తున్నాం...
    జిల్లాలో 160 పల్లె వెలుగు బస్సులు కాలం చెల్లినవి ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ నడిపిస్తున్నాం. ప్రభుత్వం 1,200 బస్సుల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. అందులో వందకుపైగా బస్సులు జిల్లాకు రానున్నాయి. అవి వస్తే జిల్లాలో బస్సుల కొరత ఉండదు. నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు సైతం వారి అభివృద్ధి నిధుల నుంచి ఆర్టీసీ డిపోల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఆ నిధులు వస్తే డిపోలు మరింత అభివృద్ధి చెందుతాయి.
    – రఘునందన్, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్, సంగారెడ్డి



     

మరిన్ని వార్తలు