అంత ఈజీ కాదు!

25 Feb, 2017 23:41 IST|Sakshi
అంత ఈజీ కాదు!

సాక్షి ప్రతినిధి – నెల్లూరు : తూర్పు రాయలసీమ పరిధిలోని ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను సునాయాసంగా గెలుచుకోగలమనుకున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. పట్టభద్రుల స్థానం అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై పార్టీ నేతల్లో అంతర్గతంగా గూడుకట్టుకున్న అసంతృప్తి ఆరడం లేదు. ఉపాధ్యాయ స్థానం అభ్యర్థి వాసుదేవనాయుడుకు పోటీగా టీడీపీకి చెందిన చదలవాడ సుచరిత రెబల్‌గా బరిలో నిలిచారు. ఈ పరిణామాలన్నింటి వల్ల అభ్యర్థుల విజయం సులువు కాదనే నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణను నేరుగా రంగంలోకి దించారు.

ఊహించని పరిణామాలు
రెండు స్థానాల్లో విజయంపై ధీమాగా ఉన్న తెలుగుదేశం పార్టీకి పట్టభద్రుల అభ్యర్థి ఎంపికలోనే తీవ్ర అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వచ్చింది. మంత్రి నారాయణ ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటింపచేయడంతో మూడు జిల్లాల్లో పార్టీ ముఖ్య నాయకులు అసంతృప్తి చెందారు. ఒకరిద్దరు పెద్ద నేతలు తమ అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తం చేశారు. చాలా మంది నాయకులు తమ అసంతృప్తిని మనసులోనే పెట్టుకుని పైకి నటిస్తున్నారు. మంత్రి నారాయణను సమర్థిస్తున్న కొందరు నేతలు అభ్యర్థుల విజయానికి ప్రచారం చేస్తున్నారు. పట్టాభి ఎంపికపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఉపాధ్యాయ స్థానానికి అభ్యర్థి ఎంపికపై ఆచి తూచి అడుగు వేయాలనుకున్న పార్టీ హై కమాండ్‌ తీవ్ర జాప్యం చేసింది.

ఈ మధ్యలోనే ఉపాధ్యాయ స్థానానికి అభ్యర్థిత్వం కోసం గట్టిగా ప్రయత్నించిన టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి భార్య సుచరిత పలు ఉపాధ్యాయ సంఘాల మద్దతు కూడగట్టారు. చివరి నిమిషంలో వాసుదేవ నాయుడును ప్రకటించడంతో సుచరిత రెబల్‌గా బరిలో నిలిచారు. ఆమెను బుజ్జగించి నామినేషన్‌ ఉపసంహరింప చేయాలని చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ఆమె భర్త చదలవాడ కృష్ణమూర్తి గట్టిగా ప్రయత్నించినా ఆమె ససేమిరా అన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడానికి రెండు రోజుల ముందు నుంచి ఆమె అందుబాటులో లేకుండా పోయారు. దీంతో సుచరిత రెబల్‌గా బరిలో నిలిచారు.

ఆమె ప్రచారం ముమ్మరం చేస్తే టీడీపీకి వచ్చే ఓట్లకు గండిపడుతుందనే భయంతో ఇప్పటికైనా ఆమె బయటకు రాకుండా కట్టడి చేయాలని టీడీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. బరి నుంచి తప్పుకోవాలని తన భర్త ఒత్తిడి చేసినా సుచరిత ససేమిరా అంటున్నారు. ఇదే సందర్భంలో పట్టభద్రుల స్థానానికి సంబంధించి సుమారు 15వేల ఓట్లు, ఉపాధ్యాయ స్థానంలోని సుమారు 2 వేల ఓట్లు బోగస్‌విగా తేలడం టీడీపీకి శరాఘాతమైంది.

బాబు ఆదేశంతో రంగంలోకి నారాయణ
తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో నెలకొన్న పరిణామాలతో సీఎం చంద్రబాబు నాయుడు అసహనానికి గురయ్యారని సమాచారం.  ఈ ఎన్నికల బాధ్యత తన భుజస్కంధాల మీద వేసుకున్న నారాయణ సీఎం చంద్రబాబు ఆదేశంతో శుక్రవారం నుంచి నేరుగా రంగంలోకి దిగారు. పట్టభద్రుల ఓట్లను నేరుగా ప్రభావితం చేయగలిగిన పార్టీ నేతల్లో పట్టాభి ఎంపికపై ఉన్న అసంతృప్తిని తొలగించడానికి సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరులో ఆయన సమావేశాలు ఏర్పాటు చేశారు. ఓటరుగా నమోదైన ఉపాధ్యాయులను పార్టీ నేతలు నేరుగా కలసి వారి మద్దతు కోరడం, నయానో, భయానో వారి ఓటు సంపాదించే వ్యూహం అమలు చేయడానికి ఏర్పాట్లు చేశారు.

చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉండటంతో మంత్రి నారాయణ ఆ జిల్లా నాయకులతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రకాశం జిల్లా నాయకులు, ఉపాధ్యాయ సంఘాలతో కూడా సమన్వయం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే  తెలుగుదేశం నాయకులు ఉపాధ్యాయులను కలసి తమకు ఓటు వేయక పోతే ఇబ్బందులు ఎదురవుతాయనే రీతిలో పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

ఆ ఇద్దరి మధ్య సహకారానికి రాయబారాలు
టీడీపీ రెబల్‌గా బరిలో నిలిచిన చదలవాడ సుచరిత, కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో పట్టభద్రుల స్థానానికి పోటీకి దిగిన ప్రకాశం జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి పరస్పరం ఓట్లు మార్చిడి చేసుకునేలా రాయబారాలు సాగుతున్నాయి. తిరుపతికి చెందిన యువజన కాంగ్రెస్‌ మాజీ నాయకుడు ఒకరు ఇద్దరి మధ్య చర్చలకు తెర లేపారు. ఇదే జరిగితే టీడీపీకి అటు ఉపాధ్యాయ స్థానంతో పాటు ఇటు పట్టభద్రుల స్థానంలో కూడా గండిపడే ప్రమాదం కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు