రైళ్లలో చోరీకి యత్నిస్తే కాల్చివేతే

15 Apr, 2016 10:22 IST|Sakshi

నగరంపాలెం  : వేసవి కాలం రైళ్లలో దొంగతనాలను అరికట్టేందుకు డివిజనులోని రైల్వే పోలీసులు రైల్వేప్రొటెక్షన్‌ఫోర్సు సహకారంతో త్రిముఖవ్యూహం అవలంభిస్తున్నారు. దొంగతనాలకు యత్నించేవారిపై కాల్పులు జరిపేందుకు సైతం ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రైలులో ప్రయాణికులను దోచుకొని అలారం చైన్ లాగి దొంగలు పారిపోయిన ఘటనల నేపథ్యంలో రైళ్లలో భద్రతను పటిష్టపరిచారు. అర్ధరాత్రి సమయంలో ప్రయాణించే అన్ని రైళ్లకు  పోలీస్ ఎస్కార్టు పెంచారు.
 
ముఖ్యంగా రాత్రి ఒంటి గంట నుంచి 3 గంటల మధ్య రైళ్లలో పూర్తిస్థాయి నిఘా ఉంచుతున్నారు. రైలు బయలుదేరే స్టేషను నుంచే అన్ని బోగీల్లోని ప్రయాణికులను నిశితంగా పరిశీలిస్తున్నారు. డివిజనుకు సంబంధించి రాత్రి సమయంలో ప్రయాణించే 15 రైళ్లకు 8 మంది నుంచి 10 మంది వరకు భద్రతా సిబ్బందిని కేటాయించి నిరంతర  పహరా ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి సమయంలో రైల్వే పోలీస్ సిబ్బంది ప్లాట్‌ఫారాలపై తనిఖీలు నిర్వహించి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.

రైల్వే ట్రాకు సమీపంలో రహదారులు ఉన్న ప్రాంతంలో మొబైల్ పార్టీలు రైళ్లలో ప్రయాణిస్తూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నాయి. రైల్వే శాఖతో సమన్వయ పరచుకొని సాంకేతిక కారణాలతో రైలు నెమ్మదిగా వెళ్లే ప్రాంతాల్లో ముందస్తు పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారులు సైతం అర్ధరాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సిబ్బందికి సూచనలు చేస్తున్నారు.
 
ప్రయాణికులకు అవగాహన...
రైళ్లలో దొంగతనాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించి చైతన్యం తెచ్చేందుకు రైల్వే పోలీసులు కృషి చేస్తున్నారు. రైలు ప్లాట్ ఫారమ్‌పై ఆగిన వెంటనే మొబైల్ స్పీకర్ ద్వారా అన్ని బోగీల్లో భద్రత నియమాలను తెలుపుతున్నారు. దొంగతనాలు జరుగుతున్న తీరుపై పోస్టర్లను రైళ్లలో, ప్లాట్‌ఫారమ్‌లపై ప్రదర్శిస్తున్నారు.
 
కాల్పుల ఆదేశాలు జారీ..
రైళ్లలో అలారం చైన్ లాగి ప్రయాణిలను దోపిడీ చేయటానికి ప్రయత్నిస్తే కాల్పులు జరపటానికి భద్రత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం.  ఫైరింగ్‌లో నిష్ణాతులైన వారిని రైళ్లలో భద్రతా సిబ్బందిగా నియమించటంతో పాటు ప్రతి ఒక్కరికి ఆయుధాలు సమకూర్చాం. అర్ధరాత్రి డివిజను మీదుగా నడిచే అన్ని రైళ్లకు భద్రతా సిబ్బందితో పాటు ఎనిమిది మొబైల్ పార్టీలు రహదారి మార్గం నుంచి భద్రత కల్పిస్తున్నాయి.

రైలు బోగీలలో అనుమానిత వ్యక్తుల కదలికలపై సమాచారాన్ని రైల్వే పోలీసుల టోల్‌ఫ్రీ నంబరు 15121కు ఫోన్ చేసి తెలపవచ్చు. ఐడీ పార్టీల ద్వారా కూడ పాత నేరస్తుల కదలికలపై, సమస్యాత్మక ప్రాంతాలపై పూర్తి స్థాయి నిఘా కొనసాగిస్తున్నాం. రైళ్లలో, ప్లాట్‌ఫారమ్‌లపై, రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన బందోబస్తును ఉన్నతస్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
 - అజయ్ ప్రసాద్,
 రైల్వే డీఎస్పీ, గుంటూరు
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా