క్యాష్‌ కష్టాలు

10 Mar, 2017 00:00 IST|Sakshi
క్యాష్‌ కష్టాలు

మళ్లీ బ్యాంకుల్లో నగదు కొరత
 ఆర్‌బీఐ నుంచి జిల్లాకు అరకొర సరఫరా
రూ.100 నోట్లతో నెట్టుకొస్తున్న బ్యాంకర్లు


మళ్లీ నగదు కొరత సమస్య తలెత్తింది. వారం రోజులుగా జిల్లాలో ఉన్న ఏటీఎంలు 50 శాతం   ‘నో క్యాష్‌ బోర్డు’లతో దర్శనమిస్తున్నాయి. అవసరమైన మేరకు ఆర్‌బీఐ నుంచి నగదు రాకపోవడంతేనే ఈ సమస్య తలెత్తింది. దీంతో సామా న్య, మధ్యతరగతి జనం మళ్లీ అవస్థల పాలవుతున్నారు.

తిరుపతి (అలిపిరి) : పెద్దనోట్ల రద్దు తదితర పరిణామాల నేపథ్యంలో బ్యాంకుల్లో తీవ్ర నగదు కొరత నెలకొంది.  నెలన్నరగా బ్యాంకుల లావాదేవీలు పూర్తిస్థాయిలో పుంజుకున్నాయి. అయితే గత వారం రోజులుగా ఆర్‌బీఐ జిల్లా అవసరాలకు సరిపడా నగదు కేటాయించకపోవడంతో జాతీయ బ్యాంకుల్లో నగదు కష్టాలు ప్రారంభమయ్యాయి. నగదు నిల్వలు లేకపోవడంతో రూ.100 నోట్లతో బ్యాంకర్లు నెట్టుకొస్తున్నారు.

వారానికి రూ.250 కోట్లు అవసరం
జిల్లాలో ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో జాతీయ బ్యాంకు శాఖలకు మోస్తరు లావాదేవీలు కొనసాగించాలంటే వారానికి రూ.250 కోట్ల మేర నగదు అవసరం. అంత మొత్తంలో నగదు అందకపోతే లావాదేవీలు కొనసాగించాలంటే సమస్యలు తప్పవు. కనీసం అందులో సగభాగం కూడా ఆర్‌బీఐ జిల్లా బ్యాంకులకు నగదు బదిలీ చేయడం లేదు. జిల్లాలో 593 జాతీయ బ్యాంకు శాఖలున్నాయి. ఏటీఎంలు మొదలుకుని, బ్యాంకు శాఖల లావాదేవీలు జరపాలంటే రోజుకు రూ.20నుంచి రూ.40 కోట్లమేర అవసరం. అయితే అంత మొత్తంలో ఆర్‌బీఐ జిల్లాకు పంపే పరిస్థితులు లేవు.

మొదటి వారంలో..
ప్రతి నెలాటి వారంలో బ్యాంకు శాఖలు లావాదేవీలు కొనసాగించాలంటే కనీసం రూ.వెయ్యి కోట్ల నగదు అవసరమవుతుంది. జిల్లాలో 38వేల మంది ఉద్యోగులకు వేతనాల కింద రూ.400 కోట్లు,  26వేల మంది విశ్రాంత ఉద్యోగులకు రూ.250 కోట్లు, ఎన్టీఆర్‌ భరోసా కింద పింఛన్లు పొందుతున్న 3,90,728 మందికి రూ.42 కోట్లు అవసరం. ఇవి కాకుండా ఉపాధి హామీ పథకం కింద జాబ్‌ కార్డులు పొందిన వారికి నగదును చెల్లించాలి. ఇలా ప్రతి నెలా మొదటి వారంలో రూ.వెయ్యి కోట్ల మేర నగదు జిల్లాకు అవసరం. అయితే ఆర్‌బీఐ మాత్రం నగదు రహితం పేరుతో అరకొర నగదును కేటాయిస్తుండడంతో అటు బ్యాంకర్లు, ఇటు ఖాతాదారులకు అవస్థలు తప్పడం లేదు.  

ఏటీఎంలలో నో క్యాష్‌
జిల్లాలో 709 ఏటీఎం కేంద్రాలున్నాయి. అందులో కనీసం 50 శాతం కూడా పనిచేయడం లేదు. పలు ఏటీఎం ముందు నో క్యాష్‌ బోర్డులు, ఔట్‌ ఆఫ్‌ సర్వీస్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. జిల్లాకు సకాలంలో ఆర్‌బీఐ నుంచి బదిలీ కాకపోవడంతో ఏటీఎం కేంద్రాల నిర్వహణపై బ్యాంకర్లు దృష్టి సారించడం లేదు. దీంతో ఖాతాదారులు అత్యవసర పరిస్థితుల్లో నగదు కోసం అవస్థలు పడక తప్పడం లేదు.

నగదు కొరత నిజమే
బ్యాంకుల్లో నగదు కొరత ఉన్న మాట నిజమే.. ఆర్‌బీఐ నుంచి అధిక మొత్తంలో నగదు బదిలీ అయితేనే పూర్తిస్థాయిలో లావాదేవీలు జరుగుతాయి. అప్పుడే ఏటీఎంలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఆర్‌బీఐ నుంచి జిల్లాకు నగదు రావాల్సి ఉంది.
–లక్ష్మీనారాయణ, డీజీఎం, ఇండియన్‌ బ్యాంక్,  తిరుపతి జోనల్‌ కార్యాలయం 

మరిన్ని వార్తలు